నా అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మనకు రక్షణకర్తయగు దేవుడై యున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మీకా 7:7వ వచనమును మనము ధ్యానించుకుందాము. అవును ప్రియులారా, మన పాపముల నుండి మనము బయటకు రావడమే, దేవునితో అనుసంధానము కావడమే అత్యంత గొప్ప ఆశీర్వాదము కదా. "అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును'' అని చెప్పబడిన ప్రకారము మీరు రక్షణ కర్తయగు దేవుని కొరకు కనిపెట్టుకొని యున్నప్పుడు, ఆయన మీకు రక్షణానందమును అనుగ్రహిస్తాడు.
ఇది చార్లెస్ అనే యువకుడికి సంబంధించిన ఒక సాక్ష్యం. అతని యొక్క 16వ సంవత్సరము మొదలుకొని, అతడు పాపములో జీవిస్తున్న వారితో అనుసంధానమును కలిగియున్నాడు. అతడు త్రాగుబోతుగా అయ్యాడు. అతడు పొగ త్రాగుచున్నాడు. ఇంకను అతడు మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. అతడు ఎల్లప్పుడు వీటి యొక్క ప్రభావము క్రిందనే ఉండిపోయేవాడు. అతనికి తెలియకుండానే, చెత్త కుండీల ప్రక్కన అతడు పండుకునేవాడు. మరడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ, అతని వలన కాలేదు. అతని బంధువులు మరియు స్నేహితులందరు అతనిని విడిచిపెట్టారు. అతనికి తినడానికి ఏమీయు లేదు మరియు అతను అనారోగ్యానికి గురయ్యాడు మరియు అతని వ్యసనాల కారణంగా అతని యొక్క కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడం మానేశాయి.
అటువంటి సమయములో అతని యొక్క సహోదరుడైన ఒక వ్యక్తి, అతనిని కె.జి.ఎఫ్‌లో నిర్వహించబడిన యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా కూటమునకు తీసుకొని వచ్చాడు. అతడు తన బాధ మధ్యలోనే అక్కడికి వచ్చియుండగా, నేను అతనిని పేరు పెట్టి పిలిచియున్నాను. అక్కడ ఉన్న వేలకొలది మంది ప్రజలు మధ్యలో నేను ఈలాగున చెప్పాను, 'చార్లెస్ అను ఒక వ్యక్తి, ఇక్కడ ఉండి ఉన్నాడు, దేవుని శక్తి మీ మీదికి వచ్చుచున్నది. అది మీ దేహమును నింపుచున్నది. మీ అవయవములను పునరునిర్మాణము చేయుచున్నది. మిమ్మును అణచివేయుచున్న అంధకారము ఇప్పుడే మిమ్మును విడిచి పెట్టి వెళ్లిపోవుచున్నది, యేసు యొక్క శక్తి, మీరు యేసునకు సేవకులుగా ఉండునట్లుగా, మిమ్మును రూపాంతరము చెందునట్లు చేయుచున్నది' అని చెప్పాను. వెంటనే, దైవ శక్తి అతని మీదికి దిగివచ్చినది, అతని వ్యసనములన్నియు కేవలము అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. అతని రోగము స్వస్ధపరచబడియున్నది. దేవుడు అతనికి నూతన జీవమును అనుగ్రహించియున్నాడు. ఈ రోజున అతడు క్రీస్తులో ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. అతనికి వివాహము జరిగినది, ఇప్పుడు అతడు ఒక సంఘకాపరిగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన రూపాంతరం! ఇది ఎంత గొప్ప సంతోషము కదా!
అవును నా ప్రియులారా, ఈ రోజు చెడు వ్యసనముల నుండి మీరు విడుదల పొందాలనుకుంటున్నారా? మరియు చెడు ఆనందాల నుండి బయటకు రావాలని కోరుచున్నారా? పాపము ద్వారా సంక్రమించు శాపమును బట్టి, పాపము వలన కలుగు అణిచివేత, ఆలాగే ఒత్తిడి ఆతురుత, ఇటువంటి పర్యావసానముల నుండి బయటకు రావాలని కోరుచున్నారా? ప్రియులారా, మీరు చేయవలసినది, ప్రభువైన యేసు వైపునకు చూడండి. యేసు అనగా, 'రక్షకుడు,' అని అర్థం. కనుకనే, ఆయన మీ సకల పాపముల నుండి మిమ్మును రక్షించువాడు. ఆయన మిమ్మును చూచి ఇలాగున అంటున్నాడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును మరియు నేను మీ కొరకై సిలువలో చిందించిన రక్తము చేత మిమ్మును కడిగి శుద్ధీకరించెదను. నేను మిమ్మును నూతన సృష్టిగా చేస్తాను. మీ పాపములను మరియు మీ పాపపు భోగేచ్ఛలను మీ యొద్ద నుండి తొలగించి వేయుదును. మిమ్మును నా బిడ్డలను చేసుకుంటాను. ' కాబట్టి, నా ప్రియులారా, నేడు మీరు యేసు చెంతకు రండి, ఆయన వైపు చూడండి, మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి, అప్పుడు ఆయన మీకు రక్షణను అనుగ్రహిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
రక్షణకర్తవైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేడు నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మేము యేసు యొక్క శక్తివంతమైన నామంలో నీ సింహాసనం యొద్దకు వచ్చుచున్నాము. తండ్రీ, మా పాపాలకు త్యాగబలిగా నీ కుమారుడిని పంపినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఇప్పుడు కూడా, మేము మా రక్షకుడైన యేసును మరియు మా పాపాలకు రక్తం కార్చి, ఆయన వేలాడదీసిన సిలువను చూస్తున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, పరిశుద్ధమైన నీ యొక్క రక్తముతో మా పాపములను కడిగి, మమ్మును శుద్ధులనుగా చేసి, నూత న వ్యక్తిగా మమ్మును రూపాంతపరచుము. దేవా, మేము నీ కొరకు ఎదురు చూచురు. ప్రభువా, మేము వెళ్లు ప్రతిచోటా నీ సన్నిధిని మోసుకెళ్ళే పాత్రగా మమ్మును మార్చుము. తద్వారా, ప్రజలు మాలో నిన్ను చూచునట్లుగా మరియు నీ నామము మా ద్వారా మహిమపరచబడునట్లు చేయుము. దేవా, మా జీవితంలో పాపాత్మకమైన విధానాలు మరియు ప్రవర్తనల యొక్క ప్రతి అణచివేత నీ శక్తివంతమైన నామంలో బ్రద్ధలగునట్లుగాను మరియు నీ యొక్క పరిపూర్ణమైన విమోచనను మేము అనుభవించునట్లు చేయుము. ప్రభువా, మా ఆత్మను రక్షించినందుకు మరియు మా వ్యసనాల నుండి మమ్మును విడిపించినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీ రక్తము ద్వారా మమ్మును కడిగి నీ బిడ్డనుగా మమ్మును మార్చి, నీ మహిమ కొరకు మమ్మును ఉపయోగించుకొనుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.