నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 107:9 వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు'' ప్రకారం ఈ రోజు నిశ్చయముగా మీ ఆశగల కోరికలన్నిటిని తృప్తిపరచుటకు దేవుడు మీ పట్ల వాంఛకలిగియున్నాడు.
నా ప్రియులారా, ఈ లోకము ఎల్లప్పుడు ఇంకా ఏదో కావాలి అని ఆశిస్తూ ఉంటుంది. ఈ లోకములోని విషయాలు మనలను ప్రలోభపెట్టే విధంగా ఉంటాయి. కానీ, చివరికి మనలను వైఫల్యములోనికి నెట్టివేస్తాయి. ఇక్కడ చెప్పబడిన 'తృప్తి' అనే మాటకు అర్థము ఆధ్యాత్మికపరమైనది. బైబిల్‌లో 3 యోహాను 2వ వచనములో చూచినట్లయితే, "ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను'' ప్రకారము మీరు అన్ని విషయములలోను వర్థిల్లుతారు. ఇంకను మీరు మరియు మీ ఆత్మ అన్నిటిలోను వర్థిల్లును గాక. మనము వర్థిల్లునట్లుగా ప్రభువు కొరకు అధికంగా ఆశపడుదాము. ' ప్రభువా, నేను గతంలో సాధించిన వాటితో తృప్తి చెందలేదు, నీవు మాకు ఇంకా అత్యధికంగా కావాలి దేవా' అని మీరు ఆ విధంగా ఆయనను అడిగినప్పుడు దేవుడు మిమ్మును ఎంతగానో ప్రేమిస్తాడు. దీనికి బైబిల్‌లో కీర్తనలు 34:10వ వచనము స్పష్టంగా తెలియజేయుచున్నది. అది ఈలాగున చెబుతుంది, " సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు'' ప్రకారం, ప్రభువును వెదకువారికి ఎటువంటి మేలు కూడ కొదువై ఉండదు. ప్రభువును కలిగి యుండు మీకు ఏ మేలు కొదువై ఉండదు. ఆయన మీ ఆశలన్నిటిని తృప్తిపరుస్తాడు. ఆకలి గొనిన మీ ప్రాణాన్ని ఆయన మేలులతో నింపుతాడు. ఎందుకంటే, మీరు ప్రభువునకు ప్రియులై యున్నారు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నిరాశ చెందకండి, ఈ రోజు అది మీ జీవితములో తప్పకుండా జరుగుతుంది.
నా ప్రియులారా, మానవుని యొక్క ఆత్మీయ ఆకలిని మరియు ఆశలను ప్రభువు మాత్రమే తృప్తిపరచగలడు. ఈ లోకములో జీవించడానికి శారీరకపరమైన విషయాలు కూడా అవసరమే అని ప్రభువునకు తెలుసు. అయితే, ప్రభువును మనము మొదటిగా ఆయనను వెదకినప్పుడు ఆయన ఈ లోకపరమైన వాటన్నిటితో కూడ మిమ్మును దీవిస్తాడు.కనుకనే, మీరు ప్రభువును ఆధ్యాతిక ఆశీర్వాదాలు కూడా కావాలని అడగవచ్చును. కానీ, మీరు ఇంక ఎవరితోను కూడ పోల్చుకొనకండి.
నేను యౌవనములో బోధించుచున్నప్పుడు, 'నా భర్త వలె నేను కూడ బోధించాలి ప్రభువా,' అని దేవుని అడిగేదానను. ఆయన ఎంతో ధైర్యవంతులు. ఆయన చేతులను ఇలాగున, ఆలాగున కదిలిస్తూ బోధించేవారు. నేను కూడా అదేవిధంగా ఉండాలి. అదే నా ప్రార్థనయై ఉండేది. కానీ, ఒక ప్రవక్తిని మమ్మల్ని సందర్శించినప్పుడు, 'ఇవాంజెలిన్, నీ భర్త వలె నిన్ను కూడ వాడుకోవాలని ప్రభువును అడగవద్దు. ప్రభువు నిన్ను ఒక ప్రత్యేకమైన విధానంలో వాడుకుంటాడు. అవును, నీవు ఎంతో మృధువుగా మాట్లాడతావు, కానీ, నీ యొక్క మృధువైన చిన్నగా గుసగుస మాట్లాడిన మాటలనైనను, ప్రభువు ఆలకించుచున్నాడు. అనేకమంది స్త్రీలకు బోధకురాలిగా ప్రభువు నిన్ను ఉపయోగించుకుంటాడు' అని చెప్పారు. ఇలాగున ఇంకా మరెన్నో విషయాలను నాకు చెప్పి, ఆమె నన్ను ప్రోత్సహించారు.
నా ప్రియ స్నేహితులారా, మరొకరితో మిమ్మును పోల్చుకొనవద్దు. ప్రభువు మిమ్మును ఎన్నడును విడిచిపెట్టడు. బైబిల్‌లో యోహాను 4:10లో చూచినట్లయితే, "అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను.'' అవును, ఆయన జీవజలమై ఉంటూ, నిశ్చయముగా మిమ్మును తృప్తిపరుస్తాడు. మీ దప్పికనంతటిని ఆయన తీరుస్తాడు. ఇంకను యోహాను 6:35లో చూచినట్లయితే, "అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు'' ప్రకారం ఆయన జీవాహారమై ఉంటున్నాడు. మీరు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మీరు ఏ మాత్రము ఆకలి గొనరు. ఆయన ఈ రోజు మిమ్మును తృప్తిపరుస్తాడు. మీ ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఇంకను మీ యొక్క ఆకలి గొనిన ప్రాణమును ఆయన మేలుతో నింపుతాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును దీవించును గాక. దేవుడు మీలో అధికమగును గాక. ప్రభువు మిమ్మును నింపియున్నాడని నేను ఎరుగుదును. ఆయన ఈ రోజు మిమ్మల్ని సంతృప్తిపరుస్తాడు. ఆయన మీరు కోరికతో ఉన్న మీ ఆత్మను, మీరు ఆకలితో ఉన్న మీ ఆత్మను సమస్త మేలులతో సంతృప్తిపరుస్తాడు మరియు మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నీ నమ్మకమైన వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, నీవు మాత్రమే మా ఆత్మకు సంతృప్తినిచ్చుటకు నిజమైన మూలం. మా హృదయంలోని లోతైన కోరికలను పూరించగల ఏకైక వ్యక్తివి నీవే ప్రభువా. మా ఆధ్యాత్మిక దాహాన్ని నీవు మాత్రమే తీర్చగలవని మేము గుర్తెరుగుచున్నాము. దేవా, నీ యొక్క జీవజలాలను వెదకుతూ మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, ఎండిపోయిన మరియు అలసిపోయిన భూమిలో నదుల వలె నీ ఆత్మ మాలో ప్రవహించునట్లుగా నీ కృపను దయచేయుము. దేవా, మా జీవితములో బంధింపబడిన ఉన్న ప్రతిచోట మా బంధకాలను తొలగించుము. దేవా, ' నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు' అని నీవు వాగ్దానం చేసినట్లుగానే, ప్రభువా, నీ నీతితో మమ్మును నింపుము మరియు నీ వాక్యంతో మమ్మును పోషించుము. మా జీవితం యొక్క అరణ్యంలో కూడా, నీవు జీవజల ప్రవాహాలను ప్రవహించునట్లు చేయుము. దేవా, మా ఆత్మీయ దాహమంతంటిని తీర్చి, మమ్మును పొంగిపొర్లేలా నీ జీవజలములతో మమ్మును నింపుము. ప్రభువా, మా ఆశగల ప్రాణాన్ని, దప్పిక గొనిన మా జీవితాలను నీ యొక్క మేలులతో మమ్మును తృప్తిపరచుమని యేసు క్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.