నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మనం 1 సమూయేలు 2:8వ వచనమును ధ్యానించుకుందాము. ఆ వచనము, "దరిద్రులను అధికారులతో కూర్చుండ బెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి యెత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు'' అన్న వచనం ప్రకారం దేవుడు ఈ నూతన మాసములో మిమ్మును పెంటకుప్ప మీది నుండి పైకిలేవనెత్తుతాడు. ఇది ఎంత చక్కని వాగ్దాన వచనము కదా! ఈ రోజు, దేవుడు మీ కొరకు ఆ కార్యమును జరిగిస్తాడు మరియు మిమ్మును యువరాజులతో కూర్చోబెడతాడు. హన్నా అనే తల్లి తన కుమారుడైన సమూయేలును ప్రభువు సేవకు అంకితం చేయుచూ ప్రార్థించిన ప్రార్థన ఇది.

బైబిల్‌లో హన్నాను చూచినట్లయితే, హన్నా ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించెను; తాను బ్రదుకు దినములన్నిటను అతను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. హన్నా, ప్రభువుకు ప్రమాణం చేసినట్లుగానే, తన కుమారుడైన సమూయేలును దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించెను; అతను దేవుని మందిరములో ఎదిగాడు మరియు చివరికి ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా మార్చబడ్డాడు. దైవీక మార్గదర్శకత్వం అందించడం ద్వారా సమూయేలు ఇశ్రాయేలు దేశాన్ని నడిపించాడు. అతను వారితో పాటు కూర్చొని, వారికి ఆలోచనలను అనుగ్రహిస్తూ మరియు దేవుని ప్రణాళిక ప్రకారం ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి వారికి సహాయం చేయడం ద్వారా రాజులను కూడా అభిషేకించాడు. హన్నా తన కుమారుని కొరకు ఈ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆమెకు తెలియకపోవచ్చును. కానీ, దేవుడు సమూయేలు జీవితమును గురించి ప్రవచించడానికి ఆమెను ఎన్నుకున్నాడు మరియు ఆమె ప్రవచించినట్లుగానే దానిని నెరవేర్చాడు, అతనిని ఇశ్రాయేలీయులకు నాయకునిగా మరియు ప్రవక్తగా సంసిద్ధము చేశాడు, అతను దేవుని ప్రణాళికను ప్రజలకు తీసుకురావడంలో ఒక కీలకపాత్రను పోషించాడు.

నా ప్రియ స్నేహితులారా, చూడండి, తల్లి ప్రార్థన ఎంతో విలువైనది. దేవుడు వాటిని నెరవేరేలా చేస్తాడు కదా. ఈరోజు కూడా, మీరు మీ పిల్లలను గురించి ప్రార్థిస్తూ, వారి భవిష్యత్తు కొరకు ఏడుస్తూ ఉండవచ్చును. భయపడకండి, దేవుడు వారిని పెంటకుప్ప మీది నుండి పైకి లేవనెత్తి, వారిని రారాజులతో కూర్చుండబెట్టి, వారిని ఈ దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించుట ద్వారా వారిని పైకి లేవనెత్తుతాడు. కాబట్టి భయపడకండి. నిరుత్సాహపడకండి. ఈ రోజు, ఆలాగుననే దేవుడు మిమ్మును కూడ పైకి లేవనెత్తుతాడు, రాజులతో కూర్చునేలా చేస్తాడు మరియు ప్రజలకు తన ప్రణాళికను ప్రవచిస్తాడు, తద్వారా దానిని నెరవేరుస్తాడు. మన జీవితాల కొరకు మరియు మన పిల్లల కొరకు ఈ రోజు ఈ దీవెనను పొందుకుందాం. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును మరియు మీ పిల్లలను ఉన్నత స్థలముల మీద ఎక్కించి, రాజులతో కూర్చుండబెట్టి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనను నీవు వింటున్నావనియు మాకు తెలుసు. దేవా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, మమ్మును పెంటకుప్ప మీది నుండి పైకి లేవనెత్తి, మమ్మును రాజులతో కూర్చుంటబెట్టుము. యేసయ్యా, మేము చేయు ప్రతి పనిలో ప్రకాశించునట్లుగా మాకు సహాయం చేయుము మరియు ఈ దేశంలో ఉన్నతంగా ఎదగడానికి మరియు ఈ లోకమంతటికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా యొక్క ప్రస్తుత పరిస్థితి మమ్మును కృంగదీస్తున్నప్పటికి, నీ శక్తిమంతమైన హస్తంతో మమ్మును పైకి లేవనెత్తి, నీ ప్రణాళికలను ప్రవచించే మరియు నీ వాక్యాన్ని ప్రకటించే నాయకులనుగా మమ్మును సంసిద్ధము చేస్తావని మేము హృదయపూర్వకంగా నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి మమ్మును నీ మంచితనానికి సాక్ష్యంగా వాడబడునట్లుగా మా దీన స్థితి నుండి పైకి లేవనెత్తి, ఉన్నత స్థానమునకు హెచ్చించి, అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగాను, రాజులతో మమ్మును మరియు మా పిల్లలను కూర్చుండబెట్టునట్లుగా నీవు అటువంటి గొప్ప కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.