అమూల్యమైన నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ నెలలో మీ నిమిత్తమై అనేకమైన ఆశీర్వాదాలను కలిగియున్నాడు. మీరు పూర్ణ హృదయముతో, మీ పూర్ణ బలముతోను దేవుని వెదకి యున్నారు. కాబట్టి, దేవుడు పూర్ణ హృదయముతో మీ యొద్దకు వచ్చి, ఆయన మిమ్మును ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ నూతన నెల వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 75:3వ వచనమును మన ధ్యాననిమిత్తము తీసుకొనబడియున్నది. ఆ వచనము, "భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును '' అన్న వచనం ప్రకారం మీరు దేవుని స్తంభాలుగా ఉన్నారు.

అవును, నా ప్రియులారా, మన పరిసరప్రాంతాలలో ఉన్న పరిస్థితులన్నియు కూడ కూలిపోతున్నట్లుగా మనకు అనిపిస్తున్నప్పుడు, కీర్తనలు 75:3వ వచనములో చెప్పబడినట్లుగానే, దేవుడు దానిని బలంగా నిలుపుదును అను నిశ్చయతను మనకు అనుగ్రహించుచున్నట్లుగా మనకు తెలియజేయుచున్నది. మీ జీవితాన్ని స్థిరంగా నిలుపుటకు శక్తిగలవాడు దేవుడే. నా జీవితములో అన్నియు కూలిపోతున్నాయి, ఇంతటితో నేను అంతమైపోతాను అన్నట్టుగా మీరు అనుకొంటుండవచ్చును. కానీ, దేవుడు మీ జీవితమును స్థిరముగాను, ముందుకు కొనసాగునట్లుగా చేయును. ఎందుకనగా, ఆకాశమందును, భూమి మీద దేవుడు సర్వాధికారమును కలిగియున్నవాడై యున్నాడు. దేవుడు ఆకాశమందును, భూమి మీదను సర్వాధికారమును కలిగియున్నాడు గనుకనే, ఆయన మాత్రమే సమస్త కార్యములను కూడ స్థిరముగా ఉంచగలిగినవాడై యున్నాడు. ఇక్కడ స్తంభములు అనే మాటకున్న భావము నీతిమంతులైన ప్రజలు అని అర్థము. గలతీయులకు 2:9వ వచనములో మనం చూచినట్లయితే, యాకోబు, కేఫా మరియు యోహాను అందరూ స్తంభాలుగా పిలువబడ్డారు. ఆయన ఈలాగున చెబుతున్నాడు, " స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి'' అన్న వచనం ప్రకారం, దేవుడు నీతిమంతులుగా ఉన్న మిమ్మును తన స్తంభములుగా పిలుచుచున్నాడు. 'జయించు వానిని నా దేవుని ఆలయములో నేను స్తంభముగా చేసెదనని దేవుడు సెలవిచ్చియున్నాడు.' ఆలాగుననే, యేసు పిలుచుచున్నాడు సేవా పరిచర్యలో, ప్రార్థనా యోధులను మేము స్తంభములుగా భావించుచున్నాము. ఎందుకంటే, వారు పరిచర్యను ముందుకు కొనసాగునట్లు చేయుచున్నవారుగా ఉన్నారు. ప్రార్థనా పూర్వకమై యున్న వారి యొక్క కన్నీళ్ల ద్వారా ప్రజలకు అద్భుతాలను జరిగించుచూ, వారిని ఆశీర్వదించుచున్నవి. ఇంకను ఇతరుల జీవితాలోనికి దేవుని నుండి అద్భుతాలను తీసుకువచ్చు వారుగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ వెనుక మీకు ఆధారముగా నిలిచియున్నాడు. దేవుని యొక్క ప్రార్థనల ద్వారా మరియు యేసు యొక్క కన్నీళ్ల ద్వారా, ప్రభువు మిమ్మును పడిపోకుండా కాపాడువాడై యున్నాడు. నా సేవా పరిచర్య ఆరంభములో దేవుని యొక్క వాక్యమే నన్ను ముందుకు వెళ్లునట్లు కొనసాగింపచేసినది. నేను సేవా పరిచర్య చేయుచుండగా, దేవుని యొక్క వాక్యమే నేను ముందుకు వెళ్లునట్లు చేయుచున్నది. ఒక ఫర్యాయం నేను వాక్యము చదువుచున్నప్పుడు, యాకోబు 4:7 లో ఏమని చెప్పబడినదనగా, " కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' అన్న వచనం ప్రకారం ఆ వాక్యమును నేను చేపట్టుకొని వెంబడించుటకు నేను కొనసాగించాను. నా జీవితమును పరిపూర్ణముగా నా దేవునికి స్వాధీనపరచియున్నాను. నా జీవితములో శోధన వచ్చిన సందర్భములో ప్రతిసారి నేను అపవాదిని ఎదిరిస్తాను. అప్పుడు అపవాది నా జీవితము నుండి పారిపోవుచున్నాడు. మనకు మనము స్వయంగా అపవాదిని ఎదిరించడము అనేది చాలా కష్టము. మనము పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ చేతను, సంపూర్ణముగా దేవుని యొక్క వాక్యముచేతను నింపబడియున్నప్పుడు మాత్రమే అపవాదిని ఎదిరించగలము. కాబట్టి, దేవుని యొక్క వాక్యము మనలను ముందుకు వెళ్లునట్లు చేస్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనము పడిపోకుండా, మనలను కాపాడి రక్షించును.

బైబిల్‌లో కీర్తనలు 37:23వ వచనములో స్పష్టముగా చెబుతుందిలా, " ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును'' అని మనము చూడగలము. ఆయన వాని ప్రవర్తనను చూచి, ఆనందించును, దీవించును. అతడు పడిపోయినప్పుడు లేవలేక ఉండడు. ఎందుకనగా, ప్రభువే, వారి చేతిని పట్టుకొని ఉండి, ఆ విధంగా స్థిరపరచువాడై యున్నాడు. చూడండి, ప్రభువు మన జీవితమును ఎంత సౌందర్యవంతముగా నడిపించనై యున్నాడు కదా! ఆయన మన చేతులను చేపట్టుకొనువాడై యున్నాడు. మన చేతులతో ఆయన మనలను పట్టుకొని, పడిపోకుండా కాపాడువాడై యున్నాడు. మనము ఎప్పటికిని పడిపోము. అయినప్పటికిని దేవుడు తన ఆలయములో ఆయన మనలను స్తంభములుగా నిలుపువాడై యున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మీరు దేవునికి స్తంభములు వంటివారై యున్నారు. కాబట్టి, ఆయన మీ జీవితములో మిమ్మును స్థిరపరచుచున్నాడు. కాబట్టి, భయపడకండి, ఆయనకు లోబడండి, అపవాది మీ యొద్ద నుండి పారిపోవునట్లుగా ధైర్యంగా అపవాదిని ఎదిరించండి. దేవుని స్తంభములుగా మారండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ మాసమంతా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందానలు. దేవా, నీ ప్రేమగల హస్తము ఇప్పుడు కూడా మమ్మును పట్టుకోవాలనియు మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, నీ చేతిని మేము పట్టుకొని ఉండునట్లు చేసి, మమ్మును నీ ఆలయములో స్తంభములుగా చేయుము. ప్రభువా, మమ్మును ఇనుప స్తంభం వలె దృఢంగా మార్చుము. దేవా, ఏ కీడు మమ్మును ఎప్పటికిని తాకకుండా ఉండునట్లుగా చేయుము. మరియు ఏ శోధన ఎప్పటికిని మా చెంతకు రాకుండా నిత్యము మమ్మును కాపాడుము. ప్రభువా, మేము ఇనుప స్తంభములవలె అపవాదిని ఎదిరించునట్లు చేయుము. దేవా, మా మీదికి వచ్చు ప్రతి శోధనను తీసుకొని వచ్చు అపవాదిని మేము గద్దించుచున్నాము. దయచేసి మా జీవితం నుండి అవాంఛిత విషయాలన్నింటిని తొలగించి, మమ్మును నీతిగా జీవించునట్లుగా చేయుము. ప్రభువా, గడిచే ప్రతి రోజు ఎక్కువగా మేము నీతిమంతులుగాను మరియు పవిత్రంగాను జీవించునట్లు కృపను దయచేయుము. నీ పరిశుద్ధాత్మశక్తితో సంపూర్ణంగా మేము నింపబడియుండునట్లు చేయుము. దేవా, నేటి నుండి నూనెతో మా తలను అభిషేకించుము మరియు మా గిన్నె నిండి పొంగిపొర్లునట్లు చేయుము. ప్రభువా, మా జీవితాన్ని నీవు స్థిరంగా ఉంచి, నీవు మమ్మును ముందుకు కొనసాగింపజేయుచున్నావని మేముగుర్తించునట్లు చేయుము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము సమస్తమును చేయగలము అని చెప్పుకొనునట్లు చేయుము. యేసయ్యా, మమ్మును బలపరచు నీ యందే మేము సమస్తమును చేయుటకు నీ బలమును మాకు దయచేసి, అత్యంత సమీపముగా నీవు మాతో ఉండి, మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.