నా ప్రశస్తమైన స్నేహితులారా, బైబిల్ నుండి మత్తయి 9:22వ వచనమును నేడు వాగ్దానముగా తీసుకొనబడినది. ఆ వచనము, "యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను'' ప్రకారం, ఈ రోజు మిమ్మును మరియు మీ దయనీయమైన స్థితిని చూచునట్లుగా, యేసు మీ వైపునకు మరల్చుచున్నాడు. ఈ స్త్రీ పండ్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచుండెను. వైద్యులందరి యొద్దకు వెళ్లి ప్రయత్నము చేసినది. తన ధనమంతా ఖర్చు అయిపోయినది. కానీ, ఆమెకు స్వస్థత కలుగలేదు. అయినను, ఆమె 12 సంవత్సరములుగా బాధపడుచుండెను. ఒకవేళ ఆమె దగ్గర దుర్వాసన వస్తుందేమో, తద్వారా, ఆమె ఎంతో బలహీనంగా ఉండవచ్చును. ఏ పని కూడా ఆమె చేయలేకపోవుచుండి ఉండవచ్చును. కానీ, విశ్వాసముతో ఆమె ఆయన యొద్దకు వచ్చినప్పుడు, యేసు ఆమె వైపునకు తిరిగి చూచెను.
నా ప్రియులారా, ఈ రోజున మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో? సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో? ఆలాగైతే, యేసు మీ వైపునకు తిరిగి మిమ్మును చూస్తున్నాడు. జీవదాత మీ వైపు చూచుటకు మీ వైపునకు మరలుకుంటున్నాడు, మీకు మరల పునరుత్థానమును ఇవ్వగలుగువాడు మీ వైపునకు చూస్తున్నాడు. మీ వైపునకు కారుణ్యము కలిగియున్న దేవుడు మీ వైపునకు తిరిగి చూస్తున్నాడు. ఆయన మిమ్మును చూస్తూ, ఆయన మీతో అంటున్నాడు, " నా కుమారుడా, కుమారీ, ధైర్యముగా ఉండండి, ప్రోత్సహించబడండి. ఆదరించబడండి, మీ విశ్వాసము మిమ్మును బాగుపరచియున్నది. మీరు ఎంతో విశ్వాసమును కలిగి యున్నారు. మీకు బలహీనత అంతటితోను, మీకున్న అవమానమంతటితోను, మీకున్న నష్టములన్నిటిలోను, మీకున్న శాపములంతటితోను, అంధకార దుష్ట ప్రభావముల దాడులన్నిటికిని, మీరు యేసు అను 'నా చెంతకు వచ్చియున్నారు. మీకు విశ్వాసమున్నది, మీ విశ్వాసము ఇప్పటికే మిమ్మును బాగుపరచి యున్నది. ఆ స్త్రీ, "నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.'' యేసు ఆ మాట పలుకగానే, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. వెంటనే ఆమె పరిపూర్ణముగా స్వస్థపరచబడినది. ఆమెలో నూతన జీవము వచ్చినది. ఆలాగుననే, నేడు మీ విశ్వాసమును బట్టి, ప్రభువు నేడు ఇదే కృపను మీకు కూడా అనుగ్రహించుచున్నాడు. ఆలాగుననే, నేడు మీ వ్యాధులు ఎటువంటివైనను సరే, మీరు విశ్వాసమును కలిగి ఉండండి, మీ విశ్వాసము చొప్పున మీరు ఇప్పుడే స్వస్థపరచబడుదురు గాక. దేవుని కృప మీ అందరి మీదికి దిగివచ్చుచున్నది. కనుకనే, మీరు భయపడకండి.
ఆలాగున దేవుని శక్తి ద్వారా తాకబడి, స్వస్థత పొందుకొనిన ఒక అద్భుతమైన సాక్ష్యము ఇక్కడ ఉన్నది. జెనిటా అనబడిన ఒక స్త్రీ ఉండెను. ఆమెకు గర్భములో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. సుదీర్ఘకాలముగా రక్తస్త్రావము అవుచుండెను. వైద్యులు ఏమన్నారంటే, మీ గర్భము ఎల్లప్పుడు తెరువబడి ఉంటుంది. సర్వసాధారణంగా, ఇతరులకు కేవలము 7 రోజులు మాత్రమే తెరువబడుతుంది. కానీ మీకైతే, నిత్యము తెరువబడి ఉంటుంది. అందుచేత మీరు రక్తస్రావముతో బాధపడుచున్నారు. కనుకనే, మీకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. కనుకనే, శస్త్ర చికిత్స కొరకు ఆమె చైన్నై వచ్చినది. ఆమె ఎవరి బంధువుల గృహములో నివాసము ఉంటున్నదో, వారు ఆమెతో, ప్రార్థనా గోపురమునకు వెళ్లి ప్రార్థించుకుందామని చెప్పారు. వారు చెన్నైలో ఉన్న తాంబరం ప్రార్థనా గోపురమునకు వెళ్లి, ప్రార్థించుకున్నారు. ప్రార్థనా యోధులు ఆమెకు నూనె రాసి, ఆమె కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. యేసు రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ఆ నూనెను ఆమె తనలోనికి తీసుకున్నారు. మహా అద్భుతమైన రీతిలో రక్తస్రావము ఆగిపోయినది. ఆమె సంపూర్ణంగా స్వస్థపరచబడినది. ఈ రోజున ఆమె శస్త్ర చికిత్స లేకుండా పరిపూర్ణంగా స్వస్థపరచబడినది. ఆమెను స్వస్థపరచిన యేసు ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. 'నా కుమారీ, నీ విశ్వాసము నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచబడియున్నది' అని యేసు చెప్పినట్లుగానే, నేడు మీరు కూడా మీ సమస్యలను బట్టి, దేవుని యందు విశ్వాసముంచండి, నేటి వాగ్దానము ద్వారా దేవుని స్వస్థతను పొందుకొని మీరు దీవించబడుదురు గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా బాధను మరియు వ్యాధులను చూస్తున్నావని మాకు తెలిసి, రక్త స్రావముగల స్త్రీకి చేసినట్లుగానే మేము ఈ రోజు నీ యొద్దకు విశ్వాసముతో వచ్చుచున్నాము. దేవా, నీవు జీవముగల దేవుడవు గనుకనే, పునరుద్ధరించేవాడవు మరియు నీవు ప్రస్తుతం నీ దయగల దృష్టిని మా వైపునకు తిప్పుతున్నారని మేము నమ్ముచున్నాము. ప్రభువా, 12 సంవత్సరాల తర్వాత నీవు ఆమెను స్వస్థపరచినట్లుగానే, మమ్మును స్వస్థపరిచే మరియు పునరుద్ధరించే నీ శక్తిని మేము విశ్వసించుచున్నాము. దేవా, మా బలహీనత, అవమానం మరియు నష్టాల మధ్య, మేము మీ మీద నమ్మకం ఉంచే హృదయాన్ని మాకు దయచేయుము. ప్రభువా, నీపై మాకున్న విశ్వాసం మమ్మును సంపూర్ణంగా స్వస్థతపరుస్తుందని గుర్తించి, మేము నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, నీ యందు విశ్వాసముతో ముందుకు కొనసాగునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితంలోకి ప్రవహించే నీ కనికరము మరియు దయకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసయ్యా, నేడు మాకున్న విశ్వాసమును బట్టి, నీవు మావైపు చూచి, నా కుమారీ, కుమారుడా, నేను ఈరోజు నీకు స్వస్థతను దయచేయుచున్నాను, నీవు స్వస్థతను పొందుకొనుచున్నావు అని చెప్పి మమ్మును ధైర్యపరచి, మా విశ్వాసము ద్వారా మేము అద్భుత కార్యాలను చూచునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.