నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 12:12వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...నీతిమంతుల వేరు చిగుర్చును'' అని సెలవిచ్చుచున్న ప్రకారము నీతిమంతుల వేరు నిత్యము చిగురిస్తుందని చెప్పబడియున్నది. సహజంగా, మనము చెట్టులో ఉన్న కొమ్మల ద్వారానే ఫలములను ఎదురుచూస్తుంటారు. అనేక సంవత్సరాల క్రితము, ఆ దినములలో మా తండ్రిగారు రేడియోలో ప్రసంగించే దినములు అవి. కానీ, మా తండ్రిగారు రేడియోలో ప్రసంగించుచుండగా, ఒక అద్భుతమైన విషయం జరిగింది.
పంటలు పండకపోవడంతో విచారముతో ఉన్న ఒక రైతు, తన చేతిలో ఒక పోర్టబుల్ రేడియోను పట్టుకుని తన పొలంలో నడుచుకుంటూ వెళ్లుచుండెను. ఆ రోజు, మా తండ్రిగారు రేడియోలో ఒక దైవీకమైన సూత్రాన్ని పంచుకుంటూ, "మీరు పంటను ఆశించే భూమిలోనే మాత్రము కాకుండా, ఇతరుల ఆశీర్వాదం కొరకు దేవుని రాజ్యంలో కూడా మీ విత్తనాన్ని విత్తండి, అప్పుడు దేవుడు మీకు సమృద్ధిగా పంటను దయచేస్తాడు. ఆయన మీ జీవితంలో అత్యధికమైన ప్రతిఫలాలను అనుగ్రహిస్తాడు'' అని చెప్పారు. అయితే, ఆ రైతు ఈ మాటలను నమ్మి, వాటి ప్రకారం అనుసరించాడు. అతను ప్రార్థనలో మా తండ్రిగారితో కలిసి ప్రార్థిస్తూ, విశ్వాసంతో తన కానుకలను విత్తాడు. ఆ సంవత్సరం, పంట కాలం వచ్చినప్పుడు, అతను ఒక అద్భుతాన్ని చూశాడు. కొమ్మలపైనే కాకుండా, అతని చిన్న చెట్ల వేర్ల వద్ద కూడా ఏలకులు ఫలించాయి. అది యాలకుల పంట భూమి, పైరు అత్యధికముగా పండుట చేత, దిగుబడి సమృద్ధిగా ఉండెను. అంతేకాకుండా, మార్కెట్ ధరలు పెరిగి, అతనికి ఊహించని ఆర్థిక ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాయి. అందుకు కృతజ్ఞతగా, అతను యాలకులతో ఒక దండను తయారు చేసి, నా తండ్రి భుజాలపై వేసి, నాకు ఆధ్యాత్మిక ఫలం మరియు నా చేతి కష్టార్జితమునకు ప్రతిఫలం రెండింటిని ఫలించేలా చేసిన యేసును నాకు చూపించినందుకు మీకు నా ధన్యవాదాలు అని అతడు తన కృతజ్ఞతలను తెలియజేశాడు. చూడండి మన దేవుడు ఎంతగొప్ప దేవుడు కదా! సమస్త మహిమ దేవునికే కలుగును గాక.
అవును, నా ప్రియులారా, నేడు ప్రభువు మిమ్మల్ని కూడా ఫలింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు! ఆయన దీనిని ఎవరి కోసం చేస్తాడు? నీతిమంతుల కొరకు మాత్రమే. కనుకనే, నేడు మనం నీతిమంతులుగా నడుచుకుంటూ, దేవునికి విధేయత చూపిస్తూ, మన హృదయాలను పవిత్రంగా ఉంచుకుంటూ, ఆయన రాజ్యంలో విత్తుతూ, ఆయన పరిచర్యకు సహాయపడుతూ, పేదలను పరామర్శించినప్పుడు దేవుడు మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మనం చేయుచున్న ప్రతి పనిలోనూ, ఒక ప్రాంతంలోనే కాదు, తల నుండి అరికాలు వరకు, ఫలాలను ఫలించేలా చేస్తాడు.
మనము ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యమును చూడబోవుచున్నాము. సహోదరి అనిత, పాండిచ్చేరి నుండి తన సాక్ష్యాన్ని ఈలాగున పంచుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, రోహన్ మరియు రోహిత్ ఉండిరి. చిన్న కుమారుడు రోహిత్ చదువుపై దృష్టి పెట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నప్పుడు, ఆ పిల్లవాడు తన చదువులపై శ్రద్ధ చూపలేకపోయాడు. అతని తల్లిదండ్రులు తీవ్ర బాధలో ఉన్నారు, అతని భవిష్యత్తు గురించి అనిశ్చితిలో ఉన్నారు. నిరాశతో, వారు తమ ఇద్దరు కుమారులను తీసుకువచ్చి, యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థుల పధకములో భాగస్థులుగా చేర్పించారు. మా ప్రార్థనలతో పాటు, ప్రార్థన గోపురములో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. రోహిత్ తన 10వ తరగతి పరీక్షలు వ్రాసినప్పుడు, ఆ పిల్లవాడు, 500/485 మార్కులు సాధించి, తన పాఠశాలలో అగ్రశ్రేణి విద్యార్థి అయ్యాడు! అతని అన్నయ్య రోహన్ కూడా దైవీకమైన అనుగ్రహాన్ని పొందుకున్నాడు. రోహిత్ 12వ తరగతి పూర్తి చేసి నీట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. మళ్ళీ, ప్రార్థన గోపురములో ప్రార్థనలు జరిగించబడ్డాయి మరియు దేవుడు ఆ పిల్లవానిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. అతను ఉన్నత ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో ప్రవేశం పొందుకున్నాడు. వారి తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయి, యేసు పిలుచుచున్నాడు పరిచర్య మరియు యౌవన భాగస్థుల పధకములో మేము మా పిల్లలను భాగస్థులుగా చేయకుండ ఉన్నట్లయితే, మేము ఏమి చేసేవాళ్ళమో? అని చెప్పింది. వారి కొరకు ప్రార్థించినందుకు ఆమె మాకు కృతజ్ఞతలు తెలియజేసినది. నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా దేవుని రాజ్యము కొరకు మరియు ఇతరుల ఆశీర్వాదము కొరకు విత్తండి, దేవుడు మీ పిల్లలకు కూడా అలాగే చేస్తాడు! ఆయన మిమ్మల్ని వేర్ల నుండి పైభాగం వరకు ఫలించేలా చేస్తాడు! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీతిమంతులను ఆశీర్వదించి, జీవితంలోని ప్రతి రంగంలోనూ వారిని ఫలవంతం చేస్తానని నీవు చేసిన వాగ్దానానికి ధన్యవాదాలు. ప్రభువా, ఇప్పుడు కూడా నీ యందు విధేయతతో నడవడానికి, మా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి మరియు విశ్వాసంతో నీ రాజ్యమునకు విత్తడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము వేర్ల నుండి పైభాగానికి ఎన్నో ఫలాలను ఫలించగలిగేలా నీ సమృద్ధిగా ఉన్న ఆశీర్వాదాలను మా మీద కుమ్మరించుము. ప్రభువా, పేదలను చూసుకోవడానికి మా చేతులను బలపరచుము మరియు ప్రేమతో నీ పరిచర్యకు సహాయపడుటకు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితం నీ మంచితనం మరియు విఫలం కాని ఏర్పాటుకు సాక్ష్యంగా ఉండునట్లుగా నీ కనికరమును మాకు చూపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.