నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానము కీర్తనాకారుడైన దావీదు ప్రార్థన నుండి తీసుకొనబడినది. ఆ వచనము బైబిల్ నుండి కీర్తనలు 86:17వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము, "యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము'' అని చెప్పబడియున్నట్లుగానే, నేడు మీ జీవితములో ఒక శుభకరమైన ఆనవాలును మీకు కనపరుస్తాడు. కనుకనే, ధైర్యంగా ఉండండి. అవును నా ప్రియ స్నేహితులారా, మనకు దేవుడు సహాయము చేస్తాడు మరియు ఆదరిస్తాడు. మనము కష్టములోను మరియు ఆపదలలో ఉండి ఉన్నప్పుడు, ఆయన మనకు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నాకు, మొఱ్ఱపెట్టుము, నేను వచ్చి నీకు విడుదలను ఇచ్చెదను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను. నేను నీ యొద్దకు వచ్చెదను, నీ దుఃఖమును సంతోషముగా మార్చెదను. ఔనత్యము చేత అన్ని వైపుల నుండి మిమ్మును హెచ్చింపజేసి, అన్ని వైపుల నుండి మిమ్మును ఆదరించెదను'' (కీర్తనలు 71:21) వ వచనములో మనము చూడగలము. కనుకనే ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, అవును నిజానికి, దేవుడు మీ జీవితంలో మీకు అనుకూలమైన సూచనను మీకు చూపిస్తాడు మరియు మిమ్మల్ని ద్వేషించే వారు మీ యెదుట అవమానము పొందుతారు. నేడు మీ పట్ల దేవుడు ఆలాగున చేస్తాడు. కనుకనే, భయపడకండి. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. బిలాస్‌పూర్ నుండి అనిల్ ప్రసాద్ అనే వ్యక్తి ఉండెను. అతడు ప్రభుత్వ రంగములో పిడబ్ల్యూడి అను శాఖలో ఉద్యోగము చేయుచున్నాడు. ఒక విలేఖరి తప్పుగా అతని మీద నిందారోపణ చేశాడు. అతని గురించి తప్పుడు నిందారోపణలు, ఉత్తరాల రూపములో ప్రభుత్వ అధికారులకు పంపించాడు. సహోదరులు అనిల్ ప్రసాద్‌నకు విరుద్ధముగా అన్యాయముగా కేసు నమోదు చేయబడినది. తద్వారా, అతడు భయంకరమైన నిరాశకు లోనయ్యాడు. 5 సంవత్సరాలుగా అతడు ఎంతగానో బాధపడ్డాడు. చివరకు ప్రభుత్వ కార్యాలయంలో జరిగే తీర్పు విచారణకు హాజరు కావాల్సిందిగా అతను అధికారులచే పిలువబడ్డాడు.

అతడు ఆ విచారణ నిమిత్తము రైలు బండిలో ప్రయాణము చేయుచుండగా, అతడు నా యొద్ద నుండి ఒక సమాచారము (ఎస్ఎమ్ఎస్)ను స్వీకరించడం జరిగింది. ఆ వర్తమానములో కీర్తనలు 112:5వ వచనమును ఉటకించి ఆ వర్తమానము పంపబడింది. ఆ వచనములో, "దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును'' అని చెప్పబడిన ఆ వచనమును అతడు చదివి ఎంతగానో ప్రోత్సహించబడ్డాడు. నేను నా విషయాలలో నేను ఎంతో న్యాయంగా ఉంటూ, అన్నిటిని చక్కపరచుకుంటున్నాను గనుకనే, దేవుడు తప్పకుండా నాకు న్యాయమును జరిగిస్తాడు అని అనుకున్నాడు.

అతడు ఆ వర్తమానమును విని విచారణలోనికి వెళ్లాడు. ఆ విచారణ చేసే సభ్యుల యెదుటకు వెళ్లాడు, ఐదుగురు అత్యుతున్న స్థాయిలో ఉన్న అధికారులు అక్కడ కూర్చుని ఉన్నారు. తన యొక్క పరిస్థితిని వివరించవలసినదిగా వారు అతనిని అడిగారు. అతడు మాట్లాడుతూ ఉండగా, ఒక అధికారి వచ్చి అతనిని గూర్చి ఇలాగున అన్నాడు, ఇతడు అపరాధి కాదు అని చెప్పాడు. ఆ మాటలు అక్కడ ఉన్నవారందరు కూడా అంగీకరించారు. అతడు ఆ విధంగా తన మీద పెట్టబడిన కేసు నుండి విడుదల పొందియున్నాడు. తిరిగి అతడు తన ఉద్యోగ స్థానములో మరల ఉంచబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా ప్రియులారా, దేవుడు తన అనుగ్రహమును అనుకూల సూచనగా సహోదరుడు ఆనిల్ ప్రసాద్‌కు చూపించాడు. ఇంకను అతనిని ద్వేషించినవారు అవమానమునకు లోనయ్యారు. కనుకనే, స్నేహితులారా, నేడు దేవుడు మీకును ఆలాగున జరిగిస్తాడు. కాబట్టి, మీరు దేనిని గురించి చింతించకండి. దేవుడు మీ పట్ల న్యాయము జరిగించాలంటే, ' ప్రభువా, మాకు ఒక ఆనవాలు కనుపరచుమని' మీరు ఆయనను అడిగినట్లయితే, నిశ్చయముగా దేవుడు మీ జీవితములో ఒక ఆనవాలును కనుపరచి, మీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, ఆపత్కాలములో నీవు మాకు సహాయమును మరియు ఆదరణను దయచేయుము. దేవా, మమ్మును ఎదిరించే వారు మా జీవిత పట్ల నీ హస్తము ఉన్నట్లుగా ఇతరులు చూసి సిగ్గుపడేలా నీ అనుగ్రహానికి ఒక సూచనను మాకు కనుపరచుము. దేవా, మమ్మును దుఃఖం మరియు బాధల నుండి విడిపించి, మా విచారమును ఆనందంగా మార్చుము. ప్రభువా, అన్ని వైపుల మా గొప్పతనాన్ని వృద్ధిపొందింపజేసి, నీ అనంతమైన ప్రేమతో మమ్మును ఓదార్చుము. దేవా, మేము నీ వాగ్దానాలపై నమ్మకముంచుటకు మరియు నీ విమోచన కొరకు ఓపికగా వేచియుండుటకు మా విశ్వాసమును బలపరచుము. యేసయ్యా, మా చేతుల పనిని ఆశీర్వదించుము మరియు నీ యొక్క నడిపింపులో మా ప్రయత్నాలు వర్ధిల్లునట్లు చేయుము. దేవా, నీ దయ ద్వారా మమ్మును గౌరవప్రదమైన స్థానానికి హెచ్చించి, మా జీవితంలో నీ ఉద్దేశాలను నెరవేర్చుము. ప్రభువా, మా ఆశ్రయం మరియు ఎల్లప్పుడు నమ్మకమైన రక్షకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. తండ్రీ, మేము అవమానము పొందిన అదే స్థలములను మాకు మంచి పేరును ఖ్యాతిని తిరిగి తెప్పించుము. దేవా, నీవు మమ్మును ప్రేమించుచున్నావనియు, మేము నీతిమంతులమనియు నీవు మా పట్ల న్యాయవంతమైన తీర్పును మాకు అనుగ్రహించుము. దేవా, మా కోర్టు కేసులో కూడా మా పట్ల న్యాయము జరిగించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.