నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 1:14వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము ఈలాగున సెలవిచ్చుచున్నది, "ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.'' అవును, ఇది క్రిస్మస్ యొక్క ఒక కధయై యున్నది. అందుకే యేసు శరీరధారియై ఈ లోకములో జన్మించిన దేవుడై యున్నాడు. పాతనిబంధన కాలములో మోషే , 'ప్రభువా, నీ పేరేమిటి అని దేవుని అడిగాడు?' " అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను'' ప్రభువు ఆ దినములలో అదృశ్యునిగా ఉండెను. కానీ, ఈ రోజు యేసు మన కొరకు దృశ్యరూపకమైన వాక్యధారిగా ఉన్నాడు.

ఆ యొక్క వాక్కు ఏమిటి? బైబిల్‌లో ఏమని చెబుతుందో చూడండి, రోమీయులకు 10:17లో "కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును'' అన్న వచనము ప్రకారము దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఈ లోకములో విశ్వాసమును కలిగియున్నాము. ఇక్కడ యేసు వాక్యముతో పోల్చబడియున్నట్లుగా మనము చూడగలము. ఇంకను, యోహాను 1:1వ వచనములో చూచినట్లయితే, "ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను'' అని వ్రాయబడియున్నది. ఆ వాక్యము దేవుడై యున్నాడు. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా దేవుడై యున్నాడు. యోహాను 1:2,3వ వచనములలో బైబిల్ ఏమంటుందో చూడండి, " ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు'' అని చెప్పబడిన ప్రకారము ఈ లోకములో ఆయన లేకుండా ఏదియు సృజించబడలేదు. ఎందుకనగా, యేసే ఆ వాక్యమై యున్నాడు. కనుకనే, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మహిమను మనము చూడగలము. పాతనిబంధన కాలములో ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారములో ఆయన యొక్క మహిమను వారు చూచినట్లుగానే, నేడు మనము కూడా చూడగలము. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీయుల మధ్య అదృశ్య రూపకముగా ఉండి ఉన్నది. వారు దేవుని యొక్క మహిమను పొగ వంటి స్తంభమును మరియు అగ్ని స్తంభము వంటి రూపములో మరియు మేఘ స్తంభము యొక్క రూపములో ఆ రీతిగా వారు చూచియున్నారు. బైబిల్‌లో నిర్గమకాండము 40:34వ వచనములో చూచినట్లయితే, "అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను'' అను మాటను మనము చూడగలుగుచున్నాము. నేడు కూడా మనలను ఆయన తన మహిమతో నింపబోవుచున్నాడు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.

అయితే, క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని యొక్క సన్నిధిని జీవముగల దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు దృశ్యరూపకమైనది. యేసు ఒక వ్యక్తిగా ఆయన గుఢారము వలె మన మధ్య నివసించుచున్నాడు. ఆ యొక్క వాక్యమే యేసుగా యున్నాడు. అందుచేతనే దేవుడు మనకు తోడై యున్నాడు, ఇమ్మానుయేలు అని మనము ఆయనను పిలుచుచున్నాము. మత్తయి సువార్త 17:2వ వచనములో చూచినట్లయితే, యేసు యొక్క శిష్యులైన పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. వారు యేసును చూస్తుండగానే, " ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ముఖము సూర్యుని వలె తెల్లనిదైనట్లుగా వారు గమనించారు. ఆయన వస్త్రములు వెలుగు ఎంత తేజస్సువంతముగా ఉంటుందో ఆ రీతిగా మార్చబడ్డాయి. యేసు యొక్క రూపమంతయు, మహిమవంతమైన వెలుగుగా రూపాంతరపరచబడియున్నది. అందుచేతనే, 2 పేతురు 1:16లో చూచినట్లయితే, వారు ఆ రీతిగా సాక్ష్యమిచ్చుచున్నారు. " మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి'' అని అంటున్నాడు.

నా ప్రియులారా, నేడు మీరును కూడ యేసును ఆయన మహిమలో చూడగలరు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది. మనము వాక్యమును చదివినప్పుడు, ఆయన వాక్యపు లోతులలోనికి మనము వెళ్లినప్పుడు, యేసు మనలో ఆయన నివాసము చేస్తాడు. మనము మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అందుచేతనే మానవ రూపములో యేసు ఈ లోకమునకు వచ్చాడు. యేసు వాక్యమై యున్నాడు. యేసు స్వయంగా ఈలాగున సెలవిచ్చాడు, "నేనే మార్గమును, సత్యమును జీవమునై'' యున్నాను అని చెప్పాడు. యేసు సత్యమై యున్నాడు. ఆ సత్యము మీలోనికి వచ్చినప్పుడు, ఆయన మిమ్మును స్వతంత్రులనుగా చేస్తాడు. నా ప్రియులారా, మన మధ్య నివాసము చేయుటకు ఎంత ప్రియమైన దేవునిగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు కదా. ఆయన తన మహిమను ఇవ్వడానికి యేసును ఈ రోజు మీరు క్రిస్మస్ వేడుకగా జరుపుకుంటున్నారు. నేడు అత్యంత ఆశీర్వాదకరమైన ఈ క్రిస్మస్‌ను మీరు కలిగి ఉండవలెనని నేను మీ పట్ల ఆకాంక్షించుచున్నాను. ఇంకను ఆశీర్వాదకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కనికరము కలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మా మధ్య నివసించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వరమునకై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీ యొక్క జీవగముల వాక్యమై ఉన్న నీ ద్వారా నీ మహిమను మరియు సత్యాన్ని మా పట్ల వెల్లడిపరచినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు మాలోనికి రమ్ము, మాలోను మరియు మా మధ్యను నీవు నివాసము చేయుము. దేవా, నీ మహిమను మా మధ్యను ఉండునట్లుగా నీ సన్నిధితో మమ్మును నింపుము. ప్రభువా, మేము నీ వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు, మా హృదయాన్ని విశ్వాసంతో నింపుము. దేవా, నేడు నీ యొక్క మహిమ నుండి మహిమకు మమ్మును మార్చుము. ప్రభువా, యేసును ఆయన మహిమలో చూడడానికి మరియు మా అనుదిన జీవితంలో ఆయన సన్నిధిని మేము అనుభవించడానికి మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీ సత్యం మమ్మును విడిపించి, స్వతంత్రులనుగా చేయునట్లుగాను మరియు మా జీవిత మార్గంలో మమ్మును నడిపించుము. యేసయ్యా, నేడు ఈ క్రిస్మస్ నీ ప్రేమ, కృప మరియు మహిమను మా హృదయంలో జరుపుకునే సమయంగా ఉండునట్లు చేయుము. దేవా, నీ కుమారుడైన యేసు యొద్ద నుండి జీవమును అంగీకరించునట్లుగా చేయుము. ప్రభువా, సత్యమై ఉన్న యేసు ద్వారా ఇప్పుడు మమ్మును స్వతంత్రులనుగా చేయుము, మమ్మును నీ యొద్దకు వచ్చునట్లుగాను మరియు నీ వాక్యంపై మా అవగాహనను మరింతగా అభివృద్ధి పొందునట్లుగా చేయుము. ప్రభువా, నీ మంచితనం మరియు శాశ్వతమైన విశ్వాసం కొరకు మేము నిన్ను ఘనపరచునట్లుగాను మరియు ఆరాధించునట్లు మా హృదయాలను ఆయత్తపరచుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.