నా ప్రశస్తమైన స్నేహితులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 128:2 వ వచనమును నేడు మనము ధ్యానించెదము. ఆ వచనము, "నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును'' ప్రకారం నిశ్చయముగా మీకు మేలు కలుగుతుంది.

ఎవరు ఈ ఆశీర్వాదములన్నిటిని పొందుకొనగలరు? బైబిల్‌లో కీర్తనలు 128:1వ వచనమును మనము చదివినట్లయితే, "యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు'' ప్రకారం ఈ వచనములో ప్రతిఒక్కరిని గురించి చెప్పబడినది. అనగా, ప్రతిఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను సమృద్ధిగా పొందుకొనవచ్చును! ఇంకను బైబిల్‌లో కీర్తనలు 115:13వ వచనములో చూచినట్లయితే, మనకు మరింత హామీ ఇస్తుంది, " పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులుగలవారిని యెహోవా ఆశీర్వదించును'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియ స్నేహితులారా, కుటుంబమంతయు దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొనవచ్చును. అయితే, మనము ఈ ఆశీర్వాదములను పొందుకొనుటకు ఏమి చేయాలి? మన పూర్ణ హృదయముతో మన ము ఆయనను వెదకినప్పుడు నిశ్చయముగా మనము అటువంటి గొప్ప ధన్యతను పొందుకొనగలము.

దావీదు ప్రభువును ఎంతగానో ప్రేమించాడు. బైబిల్‌లో కీర్తనలు 23:1వ వచనమును చూచినట్లయితే, "యెహోవా నా కాపరి '' అని కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు. అతడు ఇంకను ఇలాగున అంటున్నాడు, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.'' దేవుడు సమస్తమును చక్కని మార్గములో దయచేస్తాడు. ఈ కీర్తన ఎంతో చిన్నదైనప్పటికిని, కేవలము 6 వచనములతో ఉన్నప్పటికిని, ఆ 6 వచనములు కూడా ఎంతో ఫలభరితమైనవిగా ఉన్నవి. ఆ వచనమంతయు ఆశీర్వాదములతో నిండుకొని ఉన్నవి. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా నేటి నుండి ప్రతిరోజు కీర్తనలు 23 వ అధ్యాయమును చదువుకొని, ఆశీర్వాదములను పొందుకొనండి. ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకొనండి, ఆయన మీకు కాపరిగా ఉంటున్నాడా? ఆయనను మీరు కాపరిగా కలిగి ఉన్నారా? మీరు కాపరిగా కలిగి ఉన్నప్పుడు, మీరు దేనికి కూడా లేమి కలిగియుండరు. అవును, దావీదు ప్రభువును తన కాపరిగా కలిగి ఉన్నాడు. ఇంకను దేవుని ప్రేమను అనుభూతి చెందుతూ, ఆయన నడిపింపును పొందుకున్నాడు. అందునిమిత్తము దావీదు అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు.

నా ప్రియులారా, ఈ వచనములను జాగ్రత్తగా చదువుచూ, పరిశీలించి, ధ్యానించండి. దావీదు యొక్క అంతము ఏ విధంగా ఉన్నది? అని 1 దినవృత్తాంతములు 29:28వ వచనమును మనము చూచినట్లయితే, అతని అంతమును స్పష్టముగా మనకు తెలియజేయబడినది. అదేమనగా, " అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.'' అతడు కేవలము ఒక సాధారాణమైన వ్యక్తి. కానీ, ప్రభువు అతనిని రాజుగా హెచ్చించి, బహుగా దీవించాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, అదేవిధంగా మీరు ప్రభువును వెదకుచూ, ఆయనను మీ కాపరిగా కలిగియున్నప్పుడు, మీ కష్టార్జితము యొక్క ఫలములను మీరు అనుభవించెదరు. దేవుని యొక్క ఐశ్వర్యము, అభివృద్ధి నిత్యము మీకు తోడుగా ఉంటుంది. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ వాగ్దానాలు మరియు ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు మా కాపరిగా ఉండి, మా అవసరాలన్నింటిని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. తండ్రీ, మమ్మును నీకు అతి సమీపముగా ఉంచుకొనుము. దేవా, నీవు మా రక్షకునిగాను, మా నాయకునిగా అంగీకరించునట్లుగా మాకు కృపను చూపుము. ప్రభువా, దావీదు వలె నీలో ఉన్న అత్యధికమైన దీవెనలు పొందుకొనునట్లుగా సహాయము చేయుము. దేవా, మేము నీ మార్గాలలో నడవడానికి మరియు మా పూర్ణ హృదయంతో నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి మాకు కృపను చూపుము. ప్రభువా, మేము ప్రతిరోజు నిన్ను వెదకుచున్నప్పుడు, మా కుటుంబాన్ని మరియు మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా జీవితాలను నీ యొక్క సమాధానము, క్షేమము మరియు దైవీకమైన కటాక్షముతో నింపి, మేము వేయుచున్న ప్రతి అడుగులో మమ్మును నడిపించుము మరియు నీ నీతి మార్గంలో నడిపించుము. ప్రభువా, దావీదు చేసినట్లుగా నిన్ను విశ్వసించడానికి మరియు నీ ప్రేమ మరియు భద్రతలో ఆనందించడానికి మాకు నేర్పుము. దేవా, మా కష్టార్జితమునకు తగిన ఫలమును మరియు నీ ఆశీర్వాదాల గొప్పతనాన్ని ఆనందించడానికిని మరియు నీ సమృద్ధియైన కృప నిత్యము మమ్మును ఆవరించుటకు మాకు సహాయం చేయుము. ప్రభువా, నీకు దూరముగా ఉన్నవారందరిని ఇప్పుడే నీకు సమీపముగా ఆకర్షించుకొనుము. దేవా, వ్యక్తిగతంగాను మరియు కుటుంబముగాను మమ్మును దీవించి, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ధన్యతగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.