నా ప్రియమైన స్నేహితులారా, నేటి దినమున స్టెల్లా యొక్క జన్మదినము. కనుకనే, మీ అందరితో కలిసి, నేను కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:1వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును'' అన్న వచనం ప్రకారం మనము హెచ్చింపబడతామని, దేవుడు మనకు నిరీక్షణను కలిగించుచున్నాడు. బైబిల్‌లో ఇటువంటి గొప్ప ప్రతిఫలమును వాగ్దానం చేయబడిన మరొక ఉదాహరణ కలదు, కానీ అది దేవుడు కాదు. అది సాతాను. సాతాను తాను యేసునకు సమస్తమును ఇస్తానని ఆయనను శోధించాడు. యేసును అత్యున్నతమైన పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్లి, ఈ లోక రాజ్యములన్నిటిని చూపించాడు, వాటి మహిమలను కూడా చూపించాడు. సాతాను, ఆయనతో, 'యేసు, నీవు నాకు సాష్టాంగపడి నన్ను ఆరాధించు, ఈ యొక్క రాజ్యముల మహిమ ప్రభావమంతటిని నీకు ఇస్తానని చెప్పెను.' అందుకు, యేసు దానిని తిరస్కరించి, "నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.''

ఆలాగుననే, మా తాతయ్యగారు కూడా ఒక పెద్ద వ్యాధి చేత బాధపడుచుండగా, ఇదేరీతిగా, అపవాదియైన సాతాను ఆయనకు ప్రత్యక్షమైయ్యాడు, 'దినకరన్, నీవు నన్ను ఆరాధించుటకు ఎంపిక చేసుకున్నట్లయితే, నన్ను వెంబడించినట్లయితే, నేను నిన్ను ఈ వ్యాధుల నుండి స్వస్థపరుస్తాను. సకల విధములైన ఐశ్వర్యమును మరియు పేరు ప్రఖ్యాతులను నీకు అనుగ్రహిస్తాను చెప్పెను.' అదే సమయములో, ఆ యొక్క ఆకర్షణ ఎంతో మధురంగా ఉన్నదని మా తాతగారు తెలియజేశారు. ఎందుకంటే, ఆయన ఎంతగానో బాధపడుచుండెను. కానీ, ఆ సమయములో ప్రభువైన యేసు తాను సిలువను మోయుచున్న చిత్రమును మా తాతగారికి చూపించాడు. అప్పుడు మా తాతగారు, ఏమనుకున్నారంటే, 'సాతానా, ఇవన్నియు నీవు మాకు వాగ్దానము చేయుచున్నావు. కానీ, యేసు మాత్రమే నా కొరకు ప్రాణమును పెట్టియున్నాడు. కనుకనే, ప్రతి ఆశీర్వాదమును నిర్థారించుటకు కేవలం నేను ఆయనను మాత్రమే వెంబడిస్తాను అని చెప్పినప్పుడు,' సాతాను ఆయనకు సాష్టాంగపడి మ్రొక్కి వెళ్లిపోయెను.

నా ప్రియులారా, ఈ లోకములో మనలను శోధించుట ద్వారా సాతాను ఎన్నో గొప్ప వాగ్దానములను చేసి ఉండవచ్చును. కానీ స్నేహితులారా, అపవాది ఇచ్చునవన్నియు తాత్కాలికమైనవి మాత్రమే. ఒక సమయము వచ్చినప్పుడు, మహిమగా కనబడుచున్న ఐశ్వర్యమంతటిని తొలగించి, మన జీవితము మీద వినాశనమును తీసుకొని వస్తుంది. ఎందుకంటే, మనము పతనము కావాలని అపవాది మన పట్ల కోరుకుంటాడు. కానీ, మీరు యేసును ఎంపిక చేసుకొని ఉన్నప్పుడు, ఆయన మన కొరకు చిందించిన రక్తము ద్వారా మనము ఆయన స్వాస్థ్యసంపదయైన గొప్ప ఆశీర్వాదమును మనము పొందుకొనగలము. 'దేవుడు మిమ్మును హెచ్చిస్తాడు' అన్న నేటి ఈ వాగ్దానమును నెరవేర్పులోనికి వస్తుంది. ఎందుకంటే, ఆయన మీ నిమిత్తము రక్తమును చిందించాడు. మిమ్మును తన బిడ్డగా చేసుకొని ఉన్నాడు. ఆయన తన బిడ్డలకు బహుమానము ఇచ్చువాడై యున్నాడు. ఎందుకంటే, నా స్నేహితులారా, మిమ్మును మీరు తగ్గించుకొని ఉన్నారు కనుకనే, 'తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును' అని దేవుని వాక్యము చెబుతుంది కదా! కనుకనే, దేవుడే మిమ్మును హెచ్చించును. ఎందుకనగా, మీరు ఆయన మీద ఆధారపడి మరియు ఆయన కొరకు వేచి ఉన్నారు కాబట్టి, ఆయన మిమ్మును హెచ్చించును. కనుక ఆయన మనతో మాట్లాడిన ఈ మహిమాన్వితమైన వాగ్దానానికి మనం ఇప్పుడు ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించి, తాత్కాలికమైన దీవెనల మీద మనస్సు పెట్టకుండా, మీ హృదయములను దేవునికిచ్చినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును హెచ్చించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, నీ యెదుట తమను తాము తగ్గించుకునే వారిని హెచ్చింపజేస్తానని నీ మహిమాన్వితమైన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము నిన్ను మాత్రమే ఆరాధించడానికి మరియు సేవించడానికి ఎంచుకున్నాను. ఎందుకంటే, నీవు మాత్రమే మా దేవుడు మరియు మా రక్షకుడివి. కనుకనే, ఈ లోకం యొక్క క్షణికమైన శోధనలను మేము తిరస్కరించి, క్రీస్తు ద్వారా నీవు మాకు ఇచ్చిన శాశ్వతమైన వారసత్వాన్ని హత్తుకొని ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మా జీవితంలో పొందేందుకు నీవు మా కొరకు చిందించిన రక్తానికి మేము నిత్యము కృతజ్ఞులమై ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, తగిన కాలమందు మరియు నీ ప్రణాళికలను నమ్ముటకును కృపను చూపుము. ఎందుకంటే, నీవు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడవు కనుకనే, నీ యందు మేము నమ్మకము కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. దేవా, మా స్వంత బలంతో కాదు, నీ కృపతో మాత్రమే మమ్మును ఉన్నతంగా హెచ్చించుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ ఆమేన్.