నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 14:13వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఈ వచనం ఇలాగున చెబుతుంది, "భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.'' అవును నా స్నేహితులారా, ఈ వచనానుసారంగా, 'భయపడకుడి, మీరు ఊరక నిలుచుండి చూడుడి;' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మరియు 'మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు' అని నేడు ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియులారా,ఈ వచనము కంటె ముందున్న లేఖనములను మనము బైబిల్‌లో చూచినట్లయితే, వారిని నశింపజేయడానికై వస్తున్నటువంటి ఐగుప్తీయుల దేశ సైనికులను ఇశ్రాయేలీయులు చూచియున్నారు. ఇశ్రాయేలీయు లు వారు దాటలేని సముద్రం ముందు నిలబడ్డారు. వారు మధ్యలో చిక్కుకొని పోయారు. అప్పుడు వారు, ఐగుప్తులోనే మమ్మును విడిచిపెట్టినట్లయితే, మేము అక్కడనే భద్రముగా ఉండేవారము కదా! మరియు ఈ అరణ్యములో నశించిపోవుటకంటె ఐగుప్తులో బానిసలుగా ఉండి పనిచేయడమే మేలు కదా! అని వారు మోషేతో సణిగారు. దేవుడు వారికి రక్షణ కలుగజేయుటకు ముందే, వారు సహనాన్ని కోల్పోయి, సణగడము మొదలు పెట్టారు. ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావడానికి ముందు వారి పట్ల ఆయన ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు మరియు దేవుడు గొప్ప తనమును, ఆయన ప్రభావమును వారందరు చూడగలిగారు. అయినప్పటికిని, వారు చిక్కుకొనిపోయి ఉన్నారని గుర్తించిన ఆ ఒక్క క్షణములోనే, వారు సణగడము మొదలు పెట్టారు.

నా ప్రియులారా, అనేకసార్లు ప్రభువు యొద్ద నుండి ఒక వాగ్దానము లేక ప్రణాళిక పొందుకొని యున్నప్పుడు, అనేక సవాళ్లను కూడ మనము ఎదుర్కొంటాము. తర్వాత ఏమి చేయాలో మనకు తెలియకపోవచ్చును. ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటామని మనకు తెలియకపోవచ్చును. ఆ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు అనేకసార్లు ప్రభువుకు ఆరోపణ చేస్తుంటాము. దేవుని నిందిస్తుంటాము. 'ప్రభువా, నాకు ఈ యొక్క వాగ్దానమును ఇచ్చియున్నావు, అయినను నేనెందుకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందులను, ఈ ఓటమిని, ఈ నష్టమును, విమర్శలను మరియు ఈ వ్యాధిని నేనెందుకు ఎదుర్కోవాలి? 'ప్రభువా, ఈ వాగ్దానమును లేక ప్రణాళికను నేను పొందుకొనక ముందు నా జీవితములో నేను చక్కగా జీవిస్తున్నాను, అని అంటుంటాము కదా!' ఇంకను, ' ప్రభువా, నా పాత ఉద్యోగములో నేను పని చేస్తున్నప్పుడు నేను ఎంతో హాయిగా ఉన్నాను, ఈ కొత్త పనిని నాకెందుకు ఇచ్చావు? నేనెందుకు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాను' అని ప్రభువును అడుగుతూ ఉన్నారేమో? కానీ, నా ప్రియ స్నేహితులారా, 'భయపడవద్దు' అని ప్రభువు మిమ్మును చూచి అంటున్నాడు. 'ఊరక నిలుచుండి చూడుడి; మరియు దేవుని రక్షణను మీరు చూడండి' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 'ఈ రోజు మీరు చూస్తున్న శత్రువును, సమస్యలను, నేడు చూస్తున్న ఆటంకములను, అనారోగ్యమును, ఆర్ధిక ఇబ్బందులను ఇకమీదట మీరు ఎన్నడును చూడరు.' అదే అధ్యాయములో ఎర్ర సముద్రమును రెండుగా చీల్చడాన్ని మనము చూడగలుగుచున్నాము. ఇశ్రాయేలీయులు ఎండిన నేల మీద నడిచి దాటగలిగారు. ఇశ్రాయేలీయులు ఒడ్డుకు చేరిన తర్వాత, ఐగుప్తీయుల మీద సముద్రము తిరిగి పొర్లి వారిని ముంచివేసినది. చూడండి వారు ఇశ్రాయేలీయులను ఏమియు కూడా చేయలేకపోయారు.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఎదుర్కొంటున్న ఆటంకములన్నిటికంటె అధికముగా ప్రభువు తన శక్తిని మహిమను మీ మీద కనుపరచబోవుచున్నాడు. నేడు మీరు దేవుని రక్షణను చూడబోవుచున్నారు. కాబట్టి, ధైర్యము వహించండి నా స్నేహితులారా, దేవుడు మీ పక్షమున ఉన్నాడు. ఈ రోజు మీ మీద దాడి చేస్తున్న శత్రువు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, మరెన్నో వాటిని మీరు ఇకమీదట ఎన్నడును చూడరు. కనుకనే, నేడు అటువంటి గొప్ప దేవునికి వందనాలు చెల్లించి, ప్రార్థన చేద్దామా? నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నీ అద్భుతమైన వాగ్దానానికి మీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ గొప్ప శక్తి మరియు నీ మహిమ కొరకు మేము నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, ఈ రోజు, నీ శక్తిని అనుమానించకుండా, నీ గొప్ప అద్భుతాలను మరియు ఆశ్చర్యకార్యాలను మా పట్ల జరిగిస్తూ ఒడ్డుకు చేరుకోవడానికి మాకు సహాయం చేయడానికి నీపై నమ్మకం ఉంచడానికి కృపను దయచేయుము. ప్రభువా, ఈరోజు మా శత్రువులు, అడ్డంకులు మరియు రోగాలన్నింటిని, నీవు నాశనం చేస్తావని మేము నమ్ముచున్నాము. తద్వారా, మేము వాటిని ఇక ఎన్నటికిని చూడకుండా చేయుమని కోరుచున్నాము. దేవా, మాకు విశ్వాసం ఇచ్చినందు కు మరియు నీ రక్షణ చూడడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, మమ్మును ఆశీర్వదించి మరియు నీ నామాన్ని మహిమపరచునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.