నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు నా మనమరాలైన స్టెల్లా రమోలా మరియు తన భ ర్తయైన డానియేల్ డేవిడ్ సన్ వారి జీవితములో ఎంతో గొప్ప దినమై యున్నది. ఈ రోజు వారి యొక్క వివాహ జీవితములో మొదటి వార్షికోత్సవమును జరుపుకుంటున్నారు. దయతో వారిని మీ ప్రార్థనలలో జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను.
నా ప్రియులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 28:15వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, " ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను.'' పైన చెప్పబడిన ఈ వచనం సర్వశక్తుడైన దేవుడు యాకోబునకు సెలవిచ్చిన మాట ఇది. మన పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానములన్నిటిని నెరవేర్చే గొప్ప దేవుడుగా, మన దేవుడు ఉంటున్నాడు. మన హృదయమంతటితో ఆయనను వెదకాలి. ఆ విధంగా మనము చేసినప్పుడు, బైబిల్ గ్రంథములో మనము చదివే వాగ్దానములన్నిటిని ఆయన మన జీవితములో తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి, మీరు వాక్యమును చదివినప్పుడు, ఆశీర్వాదములను స్వీకరించండి. వాక్యములో సెలవిచ్చినరీతిగా ప్రభువు సమస్తమును మీ జీవితాలలో నెరవేరుస్తాడు. అన్నివేళల ప్రభువు మీతో కూడ ఉండి, మిమ్మును తన చిత్తప్రకారముగా నడిపిస్తాడు.
ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, సామెతలు 8:30 ప్రకారం "నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.'' అవును, నా ప్రశస్తమైన సహోదరీ, సహోదరులారా, ప్రభువు అట్టివిధంగా మనతో ఉన్నప్పుడు, అది ఎంత ధన్యకరమైన జీవితము కదా! మీరు దేవునితో అన్యోన్య సహవాసమును కలిగి యున్నా రా? ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. ప్రభువు యెదుట ఇష్టకరమైన జీవితాన్ని కలిగి ఉండండి. ఆయన అప్పుడు ఏమి చేస్తాడు? బైబిల్‌లో కీర్తనలు 119:33,34 మరియు కీర్తనలు 32:8వ వచనముల ప్రకారం ప్రభువు ఉపదేశము చేసి, మనము నడువవలసిన మార్గమును మనకు బోధించి, తన దృష్టిని మన మీద ఉంచుతాడు. అందుకే మనము దేవుని సన్నిధానములో ఎల్లప్పుడు కనిపెడుతూ ఉండాలి. అంతమాత్రమేకాదు, నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి.
నా ప్రియులారా, మన యొక్క ప్రతి ఒక్కరి జీవితములో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన విషయము. మనము ఎంత అధికముగా ప్రభువుకు ప్రార్థిస్తామో అంత సమీపముగా మనము మారతాము. ఆయన తన చిత్తానుసారముగా మనలను నడిపిస్తుంటాడు. ఇది ఎంత అద్భుతమైన జీవితమో కదా! రండి! అటువంటి జీవితముతో మనలను నింపమని ఆయనను అడుగుదాము. ఆలాగుననే, నా ప్రియులారా, దేవుని నడిపింపునకు మిమ్మును మీరు సమర్పించుకున్నప్పుడు, నిశ్చయముగా, ఆయన మీ మీద తన దృష్టిని ఉంచి, మీకు ఆలోచన చెప్పి, మిమ్మును తన చిత్తప్రకారముగా నడిపిస్తాడు. నేటి వాగ్దానముగా మిమ్మును దేవుడు ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన పరలోకపు తండ్రీ, నీ యెదుట మొరపెడుతున్న మాకు నీవు మహిమోన్నతమైన జీవితాన్ని ఇస్తున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోక చింతలన్నిటిని మా యొద్ద నుండి తొలగించుము. యేసయ్యా, నీ గాయపడిన హస్తము ద్వారా మా వ్యాధులను ముట్టి స్వస్థపరచుము. ప్రభువా, నీవు మాతో మాట్లాడి, మేము నడవవలసిన మార్గమును మాకు బోధించి, నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మును నడిపించుము. దేవా, నీ చిత్తానుసారంగా మమ్మును నడిపిస్తానని నీ ప్రేమపూర్వక వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, ఇప్పుడు కూడా, మేము మా జీవితాన్ని సంపూర్ణంగా నీ ప్రేమపూర్వక చేతులలోనికి అప్పగించుకొనుచున్నాము. దేవా, దయచేసి మేము నీతో ఎక్కువ సమయం గడపడానికి మరియు ప్రతిరోజు నీకు సమీపముగా ఉండటానికి మాకు సహాయము చేయుము. తండ్రీ, నీ సార్వభౌమ ప్రణాళిక ప్రకారం మేము నడిపించబడాలని కోరుకుంటున్నాము. కాబట్టి, నీ స్వరానికి లోబడి ఉండటానికి మరియు నీ నడిపింపును అనుసరించడానికి మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీవు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడవు, మరియు నీవు నీ వాక్యమైన బైబిల్ ద్వారా మాతో మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా జీవితంలోని అన్ని రోజులు మేము నీ ద్వారా ఆశీర్వదింపబడునట్లుగాను మరియు నడిపించబడునట్లుగాను నీ కృపను మాకు అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.