నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. ఈ రోజు బైబిల్ గ్రంథమును నుండి ఒక అద్భుతమైన వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వాగ్దానము న్యాయాధిపతులు 5:31వ వచనమును మనము చూడగలము, " యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అని పాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను'' ప్రకారం ప్రకాశించుచున్న వెలుగు మరియు సూర్యుని వలె మీ జీవితం ఆ విధంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడే ప్రభువు మీ జీవితాన్ని మార్చబోవుచున్నాడు. మీరు దీనిని నమ్ముచున్నారా? హల్లెలూయా! మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు.
నా ప్రియులారా, అటువంటి ధన్యకరమైన జీవితమును కలిగి ఉండాలంటే, ఏమి చేయాలి? ద్వితీయోపదేశకాండము 30:20వ వచనములో మనము చదివినట్లయితే, "నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.'' అదేవిధముగా, 1 కొరింథీయులకు 8:1లో మనము చూచినట్లయితే, " మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును'' ప్రకారం ప్రేమ మనకు క్షేమాభివృద్ధిని కలుగజేయునని వ్రాయబడియున్నది. కనుకనే, ఆయన ప్రేమను పొందుకొనుటకు మీ హృదయాలను ఆయనకు సమర్పించుకొన్నప్పుడు నిశ్చయముగా, దేవుని ప్రేమ మీ హృదయములో నింపబడుతుంది.
నాకు 16వ సంవత్సరము వచ్చువరకు నేను క్రీస్తు ప్రేమను ఎరుగలేదు. నేను నామాకార్థపు ్రకైస్తవురాలిని ఉన్నాను. మందిరానికి వెళ్లేదానిని కానీ, క్రీస్తుతో ఎటువంటి సంబంధము లేదు. అయితే, నేను ఒంటరిగా నిరాశలో ఉన్నప్పుడు, ఆ సమయములో ప్రభువు నాతో మాట్లాడాడు. 'స్టెల్లా నేను నిన్ను ఎంతగానో ప్రేమించుచున్నాను. నీ కొరకై సిలువలో నా ప్రాణాన్ని ఇచ్చాను. ఎల్లప్పుడు నన్ను చూడు, నేను నీ అవసరతలన్నిటిని తీరుస్తాను' అని చెప్పాడు. అంత గొప్ప ప్రేమను నేను ఎప్పుడు కూడా చూడలేదు కనుకనే, వెంటనే నేను పశ్చాత్తాపపడ్డాను. ఆ రోజు నుండి ప్రభువును శ్రద్ధగా వెదకుటకు ఆరంభించాను. హల్లెలూయా, ఆనాటి నుండి ఆయన నాకు స్నేహితుడుగా మారాడు. ఆయనతో మాట్లాడడము, నడవడము ప్రారంభించాను. నా 21వ సంవత్సరములో నేను నా జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని, యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నేటికిని దేవుడు నన్ను ఎంతగానో బలంగా తన సేవలో వాడుకొనుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీ కొరకు క్రీస్తు సిలువలో మరణించాడు. మీకు నూతన జీవాన్ని ఇవ్వడానికి సిలువలో శ్రమనొందాడు. మనము ఆయన సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడవలెనని ఎఫెసీయులకు 3:17-19లో ప్రేమను గురించి చక్కగా వివరించబడినది. ఇంకను రోమీయులకు 5:5లో చూచినట్లయితే, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించుటకు ఆయన సిలువ శ్రమలను అనుభించాడు. ఆలాగుననే, 2 తిమోతికి 1:7లో మనము చూచినట్లయితే, "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.'' కనుకనే ఇప్పుడే, ప్రభువు తన ప్రేమ అంతటితోను దీవించబోవుచున్నాడు. మీలో ఎంతమంది ఈ దైవీకమైన ప్రేమతో కూడిన స్నేహాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఆలాగైతే, నేడు మీరు దేవుని ప్రేమగల హస్తాలకు మీ జీవితాలను సమర్పించుకున్నప్పుడు, ఆయన ప్రేమ మీ హృదయాలను నింపుతుంది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ గొప్ప ప్రేమకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు ఆ సిలువలో శ్రమనొంది మాకు రక్షణను మరియు నీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞతలు. దేవా, నీవు మమ్మును ఎంతగానో ప్రేమించుచున్నావు, నీ ప్రేమ మా హృదయములో ప్రవహించునట్లు చేయుము, నూతన సృష్టిగా మమ్మును మార్చుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీ శక్తిని, ఇంద్రియ నిగ్రహమును, ప్రేమను మాకు దయచేయుము. దేవా, నీ గొప్ప ప్రేమకు మరియు నీ మహిమలో సూర్యునిలా ప్రకాశించే జీవితాన్ని మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నిన్ను గాఢంగా ప్రేమించడానికి, నీ స్వరానికి లోబడడానికి మరియు ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు పొందిన శ్రమల ద్వారా మాకు నూతన జీవితాన్ని మరియు నిరీక్షణను ఇవ్వడానికి సిలువపై నీవు మా కొరకు చేసిన త్యాగానికి వందనాలు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో, శక్తి మరియు ప్రేమ ఇంద్రియ నిగ్రహముతో మమ్మును నింపుము, తద్వారా మేము ప్రతిరోజు నీతో సన్నిహితంగా నడుచునట్లుగాను, నీవు ఒక స్నేహితుని వలె మాతో ఉండి మమ్మును నడిపించుము. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచుము, తద్వారా మేము నీ ప్రేమ యొక్క సంపూర్ణతను అనుభవించునట్లు చేయుము. దేవా, మేము ఎల్లప్పుడూ నీ స్నేహితునిగా ఉండాలని మరియు నీ ప్రేమను ఇతరులకు ప్రతిబింబించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.