నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 50:20వ వచనమును మనము ధాన్యించబోవుచున్నాము. ఆ వచనము, "మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను'' అని మనము చదువుచున్నాము. ఇది యోసేపు జీవితాన్ని క్లుప్తంగా తెలియజేయుచున్నది మరియు దేవుడు నీతిమంతునికి అంధకార సమయములు కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడని మనకు గుర్తుచేస్తుంది.

బైబిల్‌లో యోసేపు జీవితాన్ని చూచినట్లయితే, యోసేపు ఒక గొప్ప దైవజనుడు. యోసేపు తన బాల్య దినముల నుండి దేవుని ప్రేమిస్తూ, దేవుని బిడ్డగా జీవిస్తూ, తన తండ్రితో పాటు దేవుని మార్గములలో నడుచుకునేవాడు. అం దును బట్టి తన అన్నలందరు అతని యందు అసూయపడుచుండేవారు. అతని జీవితాన్ని కూడా అంతమొందించాలని అనుకున్నారు. అతను ఎన్నో విధములైన కలలను తన అన్నలకు వివరించాడు. కనుకనే, అతనిని చంపినట్లయితే, ఆ కలలన్నియు కూడా ఏమైపోతాయి? అని అతని అన్నల హృదయాలలో అదే అనుకున్నారు. ఇది వారు తమ హృదయాలలో దాచుకున్న దుర్మా ర్గం. కానీ వారు అతనిని బానిసగా విక్రయించి, ఐగుప్తునకు తీసుకొని పోబడినప్పటికిని, యోసేపు జీవితంలో దేవుని ఉద్దేశము ఇంకా తెలియజేయబడుతూనే ఉండెను.

యోసేపును కొనుకున్నవారు తనను ఐగుప్తునకు తీసుకొని వచ్చారు. అక్కడ కూడా అతడు అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. అతడు పనిచేస్తున్న గృహములో తన యజమానుని భార్య, పోతీఫరు ఇంటిలో సేవ చేస్తున్నప్పుడు అతనికి వ్యతిరేకంగా కీడు చేయాలని తలంచెను. ఇంకను అనైతికమైన కార్యాలను చేయాలని అనుకున్నది. ఇంకను యోసేపు, "నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను'' (ఆదికాండము 39:9) ప్రకారం యోసేపు పాపము చేయలేదు. ఇంకను అతడు యౌవనస్థుడు. అయినప్పటికిని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఎలాగున ఈ పాపము చేయాలని అతను అన్నాడు. అందుకే యోసేపును బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, సామెతలు 13:21వ వచనం ప్రకారం "కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును'' ప్రకారం అతడు నీతిమంతుడు గనుకనే, దేవుడు ఫరో ఇల్లంతటిలో అతనిని గొప్పగా ఆశీర్వదించాడు.

యోసేపు చెరసాలలో ఉంచబడ్డాడు. అయితే, దేవుడు చెరసాల నుండి అతని విడిపించి, బయటకు తీసుకొని వచ్చి, రెండవ అధినేతగా ఉంచాడు. రాజు తర్వాత అతడు రెండవ అధికారిగా నియమించబడ్డాడు. తగిన సమయంలో, దేవుడు రాజు హృదయాన్ని కదిలించాడు మరియు యోసేపు అద్భుతంగా చెరసాల నుండి బయటకు తీసుకురాబడ్డాడు మరియు గొప్ప గౌరవనీయమైన స్థానంలో ఉంచబడ్డాడు. అతను నేరుగా రాజు క్రింద పరిపాలిస్తూ రెండవ స్థానంలో నియమించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుని మనము కలిగియున్నాము కదా! నాకు వ్యతిరేకముగా అనేకమంది ఉన్నారు. నాకు ఎందుకు ఇలాగున జరుగుతుంది అని చింతించుచున్నారా? నేడు మీరు దేవుని యెదుట నీతిగల జీవితాన్ని జీవించినట్లయితే, దేవుడు మిమ్మును ఘనపరుస్తాడు.

నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపునకు ఇవ్వబడిన ఘనత మీకును నేడు ఇవ్వబడుతుంది. మనము ప్రార్థించి దేవుని యెదుట మన జీవితాన్ని సమర్పించుకుందాము. అప్పుడు దేవుడు గొప్ప కార్యములను మరియు అద్భుతాలు మీ జీవితములో చేస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ, నీతిమంతులకు చీకటి క్షణాలను కూడా ఆశీర్వాదాలుగా మార్చగల దేవుడవు నీవు. దేవా, నీతిమంతులకు మేలు జరుగుతుందని నీ వాక్యం చెబుతుంది. కాబట్టి, మా పూర్ణహృదయంతో నీ నీతితో నింపబడాలని వినయంగా కోరుచున్నాము. ప్రభువా, నీవు మాత్రమే మమ్మును పరిశుద్ధపరచగలవనియు మరియు మమ్మును సంపూర్ణంగా చేయగలవనియు మేము అంగీకరించుచున్నాము. ప్రభువా, నీ దృష్టికి సంతోషకరమైన నీతితో మేము జీవించగలిగేలా నీ నీతిని మాకు ధరింపజేయుము. పరిస్థితులు అసాధ్యమని అనిపించినా, నీ మార్గంలో నడిచేవారిని ఉన్నతపరుస్తూ, నీచమైన వారిని ఉద్ధరించే దేవుడవు నీవు. ఎల్లప్పుడూ మాతో ఉండే నీ సన్నిధిని మేము విశ్వసించునట్లుగాను, తద్వారా, మేము నీ నీతిలో నడుచుకుంటూ, తగిన సమయంలో నీవు మమ్మును ఘనపరుస్తావని నమ్ముచున్నాము. ప్రభువా, యోసేపు వలె మేము నీతిగా జీవించునట్లుగాను అందుకు ప్రతిఫలాన్ని మేము నీ యొద్ద నుండి పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.