నా ప్రియ స్నేహతులారా, నేటి దిన వాగ్దానమైన దేవుని వాక్యమును మనము స్వతంత్రించుకొనబోవుచున్నాము. మీరు జీవితము కొరకై దానిని చేపట్టుకొనండి. అప్పుడు మీలో జీవం ప్రవహిస్తుంది. అందుకే బైబిల్ నుండి యాకోబు 4:6లో దేవుడు ఏమని నేర్పించుచున్నాడంటే చూడండి, "ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును'' అన్న వచనం ప్రకారం స్నేహితులారా, దేవుడు అంహకారులను ఎదిరించువాడై యున్నాడని ఇక్కడ ఎంతో స్పష్టముగా చెప్పబడియున్నది.

బైబిల్‌లో మత్తయి సువార్తలో చూచినట్లయితే, యేసు పరిసయ్యులను గురించి చెప్పినది మనము చదివియున్నాము. వారందరు కూడ అగ్రపీఠములను ఆశించి గొప్ప పేరుతో ప్రజలందరు పిలువాలని మరియు వారు ఎల్లప్పుడును పేరును ప్రఖ్యాతిని కోరుకుంటారు. ఇంకను ప్రజలచేత గుర్తించబడాలనియు కోరుకుంటారు. అనేక ఫర్యాయములు ఈ పేరును ప్రఖ్యాతి ఘనతను అయోగ్యముగా ఉపయోగిస్తాము. ప్రజలతో అహంకారముగా ప్రవర్తిస్తుంటాము. అటువంటి అతిశయ వ్యక్తీకరణ మనలో కలిగియుంటాము. కానీ, దేవుడు అట్టి అహంకారులను ఎదిరించువాడై యున్నాడు. అనేక ఫర్యాయములు మనము దీనిని గుర్తించజాలము. మనము కేవలం గొప్ప ఘనత మాత్రమే రావాలని అనుకుంటూ ఉంటాము. ఈ రోజు అహంకారము మనలను ఎక్కడకు తీసుకొని వెళ్లదని మనము తెలుసుకుందాము. కేవలము దైవాశీర్వాదము మాత్రమే మనలను అత్యున్నతమైన స్థాయికి మరియు అత్యున్నతమైన ఘనతకు తీసుకొని వెళ్లగలదు. ఎందుకనగా, దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దీనులతో ఆయన ఉండి, వారి యొద్ద వినాలని కోరుకుంటాడు. ఆయన అహంకారుల మాటలను ఆలకించువాడు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో, "కనికరముగల వారు ధన్యులు '' అని చెప్పబడియున్నది. దేవుడు అట్టివారికి కనికరమును చూపుతాడు. ఆమేన్, దేవుడు మనకును అట్టి కనికరమును చూపుటకు నేడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి, మీరు కూడ దీనత్వము కలిగి జీవించుటకు నేర్చుకొనండి.

నా ప్రియులారా, మనము ఇతరుల పట్ల కనికరము చూపినప్పుడు, మనము ఉన్నత పీఠాలను విడిచిపెట్టి, ఇతరులకు సేవలను అందించినప్పుడు, కేవలము దేవుడే అత్త్యున్నతమైనవాడు. ఆయన యెదుట మనమందరము సమాన స్థాయిలో ఉన్నాము. కనుకనే, ఆయన యెదుటను కూడ మనము తగ్గించుకొని ఉండాలి. అట్టి విధేయత గల వైఖరి ఎల్లప్పుడు మనము ఆయనతో కలిగి ఉండునట్లుగా ఆయన తన కృపను మనకు అనుగ్రహించును. మన యొక్క కూటాలలో కూడను, ప్రజలు సవ్వినయముగా దేవునికి మొఱ్ఱపెట్టి అడుగుతూ ఉంటున్నప్పుడెల్లను కూడ, వారికి ఎటువంటి బిరుదులు ఉన్నప్పటికిని, వారు ఎటువంటి గొప్ప స్థితి నుండి వచ్చినప్పటికిని, అవన్నియు ప్రక్కన పెట్టి, యేసు యెదుట మొఱ్ఱపెడుతూ ఉంటారు. అటువంటి ప్రజల మొఱ్ఱలను దేవుడు ఆలకించి, ప్రభువు అక్కడనే, అద్భుత కార్యములను జరిగించుచున్నాడు. తన యెడల వినయము గలిగి మొఱ్ఱపెట్టిన వారికి దేవుడు కృపను అనుగ్రహించుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మిమ్మును మీరు తగ్గించుకొనండి. ఈ రోజు దేవుని కృప మీ మీద ఉన్నది. కాబట్టి, భయపడకండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, దీనత్వములో నీవు సంతోషిస్తావనియు మరియు అట్టి వారిని ఉన్నత స్థానమునకు తీసుకొని వెళ్లతావని నీ వాక్యము తెలియజేసినట్లుగానే, నీవు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దయచేసి, ప్రభువా, మేము దీనత్వము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయుము. ఇది మా గురించి లేదా మాకు తెలిసిన లేదా సాధించిన దాని గురించి కాదు, ఇది మీ గురించి అని ప్రతిరోజు మాకు చూపించుము. దేవా, నీ కృపచేతనే మేము రక్షింపబడి, దీవించబడునట్లు కృపను అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును క్షేమముగాను మరియు సురక్షితంగా ఉంచేది నీ భద్రత, కాపుదలను మాకు దయచేయుము. దేవా, మేము దీనత్వముతో నడుచుకొనుటకు నీ యొక్క జ్ఞానం మరియు వరములు ఉన్నత స్థానములోనికి వెళ్లుటకు సహాయపడునట్లు చేయుము. దేవా, నీవు లేకుండా మేము ఏమియు చేయలేము. యేసయ్యా, మేము ఎల్లప్పుడూ నీ యెదుట దీనత్వముతో ఉండునట్లుగాను మరియు నీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లుగా సహాయము చేయుము. దేవా, మా చుట్టూ ఉన్నవారి పట్ల కూడా మేము దీనత్వంగా ఉండునట్లుగా నీవు మాకు సహాయం చేయాలని కోరుచున్నాము. తద్వారా వారు మాలో నిన్ను చూచునట్లుగాను మరియు నీ నామాన్ని మహిమపరచునట్లు కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.