నా ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మును ఎన్నటికిని విడువడు, ఎందుకనగా, ఆయన తన ప్రజలను స్వంత జనముగా ఏర్పరచుకొని యున్నాడు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 12:22వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు'' ప్రకారం మీరు దేవునికి స్వంత జనముగా ఉన్నారు. ఎందుకనగా, దేవుడు మిమ్మును తన స్వంత బిడ్డలనుగా చేసుకొనుటకు ఆనందించుచున్నాడు. మరియు మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. ఆయన మిమ్మును తనకు స్వకీయ జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగియున్నాడు. కనుకనే మీ నిమిత్తము యేసు తన రక్తమును చిందించాడు. మిమ్మును తనకు స్వకీయ జనముగా చేసుకొనుటకు యేసు తన స్వరక్తమును క్రయధనముగా చెల్లించాడు. ఇంకను తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన ఎన్నడు కూడ విడనాడడు. ఇంకను ఆయన మిమ్మును ఎన్నటికిని తృణీకరించడు. కనుకనే, దేవుని యందు విశ్వాసముంచండి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.

నా ప్రియులారా, మీరు నిరుత్సాహమును ఎదుర్కొన చుండవచ్చును, దేవుడు ఇక మీదట మిమ్మును ప్రేమించలేదు అని మీరు చెప్పవచ్చును. అవును, ఆరంభ దినములలో ఆయన తన జనముగా మిమ్మును చేసికొనియున్నాడు. కానీ, ఇప్పుడు మీలో ఈ లోపము ఉన్నది లేక మీరు ఆయనను సంతోషపెట్టడానికి ఈ కార్యములను జరిగించలేదు. లేక మీ గురించి ఈ వ్యక్తి ఈలాగున మాట్లాడుచున్నాడు. లేక మీ పరీక్షలలో మీరు అపజయమును పొందియుండవచ్చును. లేక మీ ఉద్యోగములో మీరు వైఫల్యమును పొంది ఉండవచ్చును. ఇంకా మరెన్నో. ఇక దేవుడు ఏమాత్రము మిమ్మును ప్రేమించడు మరియు మిమ్మును తన జనముగా లేదా తన బిడ్డగా లక్ష్యపెట్టడు అని మీరు తలంచవచ్చును. అపవాది మీ అపజయములను మాత్రమే పైకెత్తి చూపుతూ, మీరు ఇక దేవుని బిడ్డగా ఉండడానికి యోగ్యత లేదని చెబుతుండవచ్చును. నా స్నేహితులారా, అది చాలా పొరపాటు. ప్రభువు యొక్క నామమును బట్టి, అది ఔనత్యముగా ఉండు నిమిత్తము ప్రభువు మిమ్మును పైకి లేవనెత్తుతాడు. ఆయన నామమును బట్టి, ప్రభువు ఎప్పటికి మిమ్మును తిరస్కరించడు మరియు ఆయన మిమ్మును ఎన్నటికిని విడనాడడు. ఎందుకనగా, ఆయన తన రక్తము ద్వారా మిమ్మును తన స్వంత బిడ్డలనుగా చేసుకొనుటకు ఆనందించు దేవుడై యున్నాడు. కనుకనే ఈ రోజు మీరు ఈలాగున చెప్పండి, ' ప్రభువా, నా జీవితము ఎటువంటి పరిస్థితిలో ఉన్నను సరే, నేను ఇంకను కూడా దేవుని బిడ్డనే, యేసు నన్ను ప్రేమించుచున్నాడు. ఆయన నాతో కూడా ఉండి, ఈ సమయములో నాకు సహాయము చేస్తాడు. ఆయన చిత్తమే నా జీవితములో వర్థిల్లుతుంది. ఈ రోజు సమస్త కార్యములు మేలు కొరకే సమకూడి జరుగుతాయి' అని మీరు పలికినప్పుడు అది ఆలాగుననే సంభవిస్తాయి.

మిమ్మును ప్రోత్సహించడానికి నేను ఒక సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. ఎలీషా పెరియస్వామి అనే వ్యక్తి ఒకప్పుడు ్రపైవేటు బ్యాంకులో పనిచేసేవాడు. అయితే, అతడు యేసును వ్యతిరేకించుచుండెను. అతడు యేసును ఎగతాళి చేయుచుండేవాడు. అతని కుటుంబము మాత్రము యేసును వెంబడించుచుండెను. కానీ, ఎప్పుడు కూడా అతడు యేసును ప్రేమించలేదు. అతడు తన ఉద్యోగమును కోల్పోయాడు. ఇంకను అతడు ఆర్థిక సమస్యలలోనికి వెళ్లిపోయాడు. కానీ, అతడు ఆత్మహత్య చేసుకోవాలని తలంచాడు. ఒకరోజు అతడు నడిచి వెళ్లుచుండగా, బహిరంగ కూటములో నుండి అతడు నా స్వరమును విన్నాడు, 'మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది, ' అది అతనిని యేసు యొద్దకు ఆకర్షించెను.

అతడు వెనుకకు తిరిగి వెళ్లి వాక్యమును చదువుటకు ప్రారంభించాడు. ఇంకను అతడు ప్రభువును అంగీకరించియున్నాడు. అతని జీవితము సమూలాగ్రముగా మార్చబడినది. ఏడు సంవత్సరములుగా అతనికి విరుద్ధముగా చట్టబద్ధమైన కేసులు ఉండెను. వాటన్నిటి నుండి దేవుడు అతనికి విజయమును అనుగ్రహించాడు. అతడు తిరిగి మరల బేతెస్ద ప్రార్థనా కేంద్రమునకు వెళ్లాడు. ఆక్కడ నిర్వహించబడిన కూటములో పాల్గొన్నాడు. నేను అతని కొరకు ప్రార్థించి, దేవుడు మిమ్మును ప్రవక్తగా చేయబోవుచున్నాడు అని చెప్పాను. అతని జీవితమును గురించి, నాకు ఏ మాత్రము కూడా తెలియదు. కానీ, దేవుడు అతని హృదయాన్ని రూపాంతరపరచియున్నాడు. ఈ రోజు దేవుడు అతనిని ప్రవక్తల పరిచర్యలో వినియోగించుకొనుచున్నాడు. అతడు, "నేను ప్రవచనాత్మకమైన వాక్కును పొందుకొని యున్నాను, దేవుడు నన్ను ప్రవచనాత్మకమైన వరముతో నన్ను నింపి, తన సేవలో వినియోగించుకొనుచున్నాడు.'' అవును, నా ప్రియులారా, ఈ రోజున దేవుడు మిమ్మును పైకి లేవనెత్తుచున్నాడు. ఎందుకనగా, ఆయన మిమ్మును తన స్వంత బిడ్డగాను మరియు స్వంత జనముగా ఏర్పరచుకొనియున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ ఎడతెగని ప్రేమకు మరియు మమ్మును నీ స్వంత బిడ్డలనుగా ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు. దేవా, ఈ రోజు నీ కౌగిలిలోనికి నీ బిడ్డలమైన మేము నీ యొద్దకు వచ్చునట్లుగా, నీ సన్నిధి మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. దేవా, నీ చిత్తము మా జీవితములో పరిపూర్ణమగునట్లు చేయుము. ప్రభువా, నీవే మమ్మును నీ ప్రజలనుగా ఉండునిమిత్తము పిలిచి ఉన్నావని మేము గుర్తించునట్లుగా చేయుము. ప్రభువా, నీవు ఎన్నటికిని మమ్మును తిరస్కరించవని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మా క్లిష్టమైన పరిస్థితిలలో మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈ రోజు మాకు ఒక గొప్ప విమోచనకరమైన దినముగా ఉండునట్లుగా చేయుము. దేవా, మా అపజయం మరియు బలహీనత యొక్క క్షణాలలో కూడా, నీవు మమ్మును ఎప్పటికి విడిచిపెట్టవన్న నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. దేవా, నిరుత్సాహం అనే అబద్ధాలకు వ్యతిరేకంగా స్థిరంగా మేము నిలబడడానికి మరియు మేము నీ దృష్టికి విలువైనవారముగా ఉండునట్లుగా మమ్మును నీవు గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నీ బిడ్డలమని, యేసు రక్తం ద్వారా మేము ప్రేమించబడ్డామని మరియు విమోచించబడ్డాము అని ధైర్యంగా ప్రకటించడానికి మా హృదయాన్ని బలపరచుము. దేవా, నీ ప్రణాళికలను విశ్వసించడానికి మరియు మా మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని నమ్మడానికి మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా ప్రతి శోధనలలో, నీ యందు విశ్వాసాన్ని కలిగి ఉండునట్లుగాను మరియు నీ యొక్క సమాధానముతోను, నీ ఆత్మతోను మమ్మును నింపుము. ప్రభువా, మమ్మును పైకి లేవనెత్తి నీ పరిపూర్ణ చిత్తానుసారం మమ్మును నడిపించుము. దేవా, మేము నీ ప్రేమ మరియు ఉద్దేశ్యంలో నడుస్తున్నప్పుడు మా జీవితం నీ గొప్ప నామమునకు ఘనత మహిమ కలుగునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.