నా ప్రియమైన స్నేహితులారా, నిత్యము మనము యేసునందు గొప్ప నిరీక్షణ కలిగియుండాలి. అవును, ఆయన యందు నిరీక్షణ కలిగి, నమ్మకముగా ఉన్నప్పుడు, మనము నీతిమంతులముగా తీర్చబడతాము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 15:6 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము'' ప్రకారం అవును, దేవుడు నీతిమంతులను ఘనపరచువాడు. గొప్ప నిధి వారి యింట ఉంటుంది. దేవుని హత్తుకొని ఉండువారికి ఆయన ఆలాగున సమస్తమును అనుగ్రహిస్తాడు. దావీదు మరియు సొలొమోనును మీరు గమనించినట్లయితే, చివరికి దేవుడు ఎంతో గొప్ప ఉన్నత స్థాయిలో వారిని హెచ్చించాడు. దేశములో ఉన్న వారికందరికంటె ఎక్కువ సంపదతో వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆలాగుననే మా తాతయ్యగారి జీవితములో కూడా జరిగినది. అయితే, ఈ సంపదంతయు మాకు అనుగ్రహించకమునుపే, మమ్మును పరీక్షించాడు. అవును, దేవుడు మనలను పరీక్షిస్తాడు. నిజంగా మన జీవితాలను ఆయన కరిగింపజేస్తాడు. ఆయన శోధనల చేత మనలను శుద్ధి చేసి, మెరుగుపరుస్తాడు, మనము ఎలాంటివారమై యున్నామని ఆయన మనలను పరిశీలిస్తాడు. మన జీవితాలలో గొప్ప కరువు గుండా మనము వెళ్లవలసి ఉంటుంది. మనము నమ్మదగినవారముగా ఉన్నామా? అని ఆయన మనలను పరీక్షిస్తాడు. మరియు ఆయన అనుగ్రహించు నిధులకు మనము అర్హులముగా ఉన్నామా? అని చూస్తాడు.

నా ప్రియులారా, ఎందుకనగా, శోధనలు మరియు కష్టాలు వచ్చినటువంటి సమయములోనే యేసును వెంబడించుచున్నాము అని చెప్పువారు అనేకమంది ఆయన నుండి పారిపోతారు మరియు 'మేము దేవుని బిడ్డలము' అని నామాకార్థముగా చెప్పువారందరు ఆయనను విడిచి వెళ్లిపోతారు. కానీ, కరువు మధ్యలోనే దేవుడు మనలను చూస్తుంటాడు, ఇటువంటి నిధిని మన చేతులకు అప్పగించబడడానికి మనము నమ్మదగినవారముగా ఉన్నామా? లేక దానిని పొందుటకు అర్హులముగా ఉన్నామా? అని మనలను పరిశోధిస్తాడు. అటువంటి సమయములో మనము సంపద లేకపోయినా, మనము వాడబారిన స్థితి నుండి వెళ్లుచున్నప్పటికిని కూడా, ఆయన తానే స్వయంగా ఒక గొప్ప నిధి వలె ప్రత్యక్షపరచబడతాడు. మనకు ఏమి లేకపోయినప్పటికిని అన్నియు ఉన్నట్టువంటి అనుభూతి మనలో కలుగుతుంది. అంతమాత్రమే కాదు, మన జీవితములో గొప్ప నిధి ఏమిటో అని మనము గ్రహించునట్లుగా బయలుపరుస్తాడు. మన జీవితంలోని గొప్ప సంపద ఏమిటంటే, ఆయనను అన్నింటికంటే ఎక్కువగా కలిగి ఉండటం అని ఆయన మనకు బోధిస్తాడు, తద్వారా, ఆయన మనకు ఈ లోక సంపదను అనుగ్రహించినప్పుడు, మనం దాని పట్ల ఎక్కువగా మక్కువ చూపకుండా, అన్నింటికంటే ఎక్కువగా ఆయనను నిధిగా ఉంచునట్లుగా చేస్తాడు.

అదేలాగున అబ్రాహాము జీవితములో జరిగినది. దేవుడు గొప్ప నిధులను అబ్రాహామునకు అనుగ్రహించాడు. దేవుడు అతనికి ఎన్నో భూములను అనుగ్రహించి, అతనిని అత్యధికముగా ఆశీర్వదించాడు. అంతమాత్రమేకాదు, అతనికి అత్యధికమైన సంపదను ఇచ్చాడు. అత్యంత అమూల్యముగా ఉన్న కుమారుని ఇచ్చాడు. అది అతని జీవితములో ఒక గొప్ప నిధి వంటిది. అయినప్పటికిని ఈ సంపదంతయు అతని జీవితములోనికి రాకమునుపు, దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. తన నిరీక్షణ మరియు విశ్వాసము ఎక్కడ ఉంటుందో అని చూచాడు. అది దేవుడు అతనికి ఇచ్చిన సంపద మీద ఉంటుందా? లేక నిధుల మీద నిలిచి ఉంటుందా? లేక ఆయన మీద నిలిచి ఉంటుందా? అని అతనిని దేవుడు పరీక్షించాడు. అయితే, అబ్రాహాము దేవుని మీద విశ్వాసముంచాడు. ఇంకను అన్నిటికంటె మిన్నగా, అబ్రాహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. దేవుడు దానిని అతనికి నీతిగా ఎంచాడు. ఆ తర్వాత దేవుడు అతనిని విస్తరింపజేసి, ఆశీర్వదించాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మీ గృహము నీతిమంతుల యిల్లుగాను, గొప్ప ధననిధిగా ఉండబోవుచున్నది. అంతమాత్రమే కాదు, అబ్రాహాము వలె మీ యిల్లు గొప్ప నిధుల చేత నింపబడి ఉంటుంది. మనము ఈ కృప కొరకు దేవుని అడుగుదామా? నా ప్రియ స్నేహితులారా, మీ యింటిని సంపూర్ణంగా సమృద్ధితో నింపుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును సమృద్ధియైన నిధితో నింపి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నేడు గొప్ప నిధుల చేత మమ్మును నింపుము. దేవా, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, నిన్ను అంటిపెట్టుకొని జీవించునట్లుగా, వాడబారిన స్థితిలో ఉన్నప్పుడు, దేవా, మా నిరీక్షణ, నమ్మకము నీవే. కనుకనే, నేడు నీవు మమ్మును ఘనపరచుము. దేవా, మా యిల్లు, నీతిమంతముతో నింపుము, మా యిల్లు సమృద్ధి నిధులతో పుష్పింపజేసి, మరియు విస్తారింపజేయుము, వర్థిల్లజేయుము, మాకున్న కొంచెము వర్థిల్లునట్లు చేయుము. నీవే మా యొక్క గొప్ప నిధిగా ఉండుము. మేము ఎదుర్కొనే సమయం ఏదైనా సరే, నీలో స్థిరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. ఎండాకాలంలో కూడా, మేము నిన్ను మాత్రమే నమ్మి, అంటిపెట్టుకుని ఉండాలనుకుంటున్నాము. దేవా, నీవే మా నిరీక్షణ, నమ్మకము, మాకు బలం మరియు మాకు ఆశ్రయం. ప్రభువా, నీ వాక్యం ప్రకారం నీతిమంతుల ఇల్లు వర్ధిల్లనిట్లుగా చేయుము. దేవా, మా ఇంటిని నీ గొప్ప సంపదలతో, ఆధ్యాత్మిక మరియు భౌతిక ఆశీర్వాదాలతో నింపుము. దేవా, మా భూభాగాన్ని విస్తరించి, నీవు మాకు ఇచ్చినవన్నీ విస్తరింపజేయుము. ప్రభువా, మా దగ్గర ఉన్న కొద్దిపాటిని నీ దైవీకమైన హస్తం ద్వారా వర్థిల్లజేయుము. అయితే అన్నింటికంటే ముఖ్యంగా, ప్రభువా, నీవు ఎల్లప్పుడూ మాకు గొప్ప నిధిగా ఉంటూ, ఈ లోక ఆశలన్నిటిని విడిచిపెట్టి, నిన్ను హత్తుకొని జీవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.