నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు సింహంవలె ధైర్యంగా ఉండండి. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కనుగొనబడిన వచనము 2 తిమోతికి 2:1 ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆ వచనము, " నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.'' అవును, నా ప్రియులారా, మీరు దేవుని చేత మీరు బలవంతులు కావాలని మన ప్రభువు మీ పట్ల వాంఛకలిగియున్నాడు. కాబట్టి, మీరు ధైర్యంగా ఉండండి.

నా ప్రియులారా, మనము యేసునందు మాత్రమే ఇటువంటి బలమైన కృపను కనుగొనగలము. మన యొక్క శ్రమలు విస్తరించుకొలది, మనము యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మరి ఎక్కువగా బలపరచబడవలసియున్నది. కేవలము మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులలో మాత్రమే మన బలమును మనము కనుగొనగలము. అందుకే సామెతలు 24:10లో ఏమని చెబుతుందనగా, " శ్రమ దినమున నీవు క్రుంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు.'' దీనికి అర్థము, మన జీవితములో మనము శ్రమల గుండా వెళ్లుచున్నప్పుడు, విసిగి వేసారి పోయిన పరిస్థితులలో మనము ఉండి ఉన్నప్పుడు, లేఖనము ఏమని తెలియజేయుచున్నదనగా, మన బలము చాలా స్వల్పమైన యున్నదని అర్థము. అందుచేతనే, 1 తిమోతి 6:12లో చూచినట్లయితే, పౌలు ఏమని తెలియజేయుచున్నాడనగా,"విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి'' అని చెప్పబడియున్నది. ఆయన, 'ఆ విశ్వాసము' అని అంటున్నాడు. ఆ విశ్వాసము అనగా, అది యేసుక్రీస్తునందు ఉన్న ఏకైక విశ్వాసము మాత్రమే. మనము యేసు క్రీస్తునందు మరి ఎక్కువగా బలవంతులముగా ఎదగవలసి ఉన్నది. కాబట్టి, కొలొస్సయులకు 1:29వ వచనములో చూచినట్లయితే,"అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను'' అని పౌలు స్పష్టముగా చెబుతున్నాడు. కాబట్టి, మనలో బలము కలుగు నిమిత్తము కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనము పోరాడుచు ప్రయాసపడవలెను.

నా ప్రియులారా, అవును అనేక ఫర్యాయములు స్వయముగా మీలోనే ప్రభువు ఏ విధముగా ఉన్నాడని మీకు తెలియదు. " అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా మీకు తోడైయున్నాడు'' అని బైబిల్ చెబుతుంది. అనేక ఫర్యాయములు మనము సమస్యల గుండా వెళ్లుచున్నప్పుడు, యేసు పరాక్రమముగల శూరునివలె మనతో కూడా ఉన్నాడని మనము మరచిపోతుంటాము. అందుకే, యేసు యొక్క క్రియా శక్తిని బట్టి, మనము ఎంతో ప్రయాసతో పోరాడవలెనని పై వచనములో పౌలు తెలియజేయుచున్నాడు. ఇంకను ఎఫెసీయులకు 6:10లో మనము చూచినట్లయితే, "తుదకు ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి'' అని పౌలు తెలియజేయుచున్నాడు. నా జీవితములో చూచినట్లయితే, నేను ఎప్పుడైన, అలసిపోయి, వేసారిపోయి ఉన్నప్పుడు, ఉపవాసము ఉండి, ప్రార్థన చేసి, దేవుని యొద్ద నుండి శక్తిని మరల తిరిగి పొందుకుంటాను. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది, "ఆత్మ సిద్ధమే గానీ, శరీరము బలహీనమై యున్నది.'' అవును, ఈ రోజు కూడ యేసుక్రీస్తు కృపనందు మీరు బలమును పొందగలరు. ఎందుకనగా, 2 కొరింథీయులకు 12:9వ వచనము ప్రకారము, " అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును'' అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయుచున్నది. దేవుని కృప మీకు చాలినంతగా ఉంటుంది కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియులారా, ఎందుకనగా, మన ప్రభువైన యేసు కృప చేత సంపూర్ణముగా నింపబడి యున్నాడు. కనుకనే, యేసు కలిగియున్న ఇట్టి కృప మీద మనము ఆధారపడియున్నప్పుడు, మరింత బలముగా మనము ఎదుగ గలుగుతాము. యేసునందు మాత్రమే కనుగొనగల ఆ యొక్క కృపలో బలముగా ఎదగమని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కనుకనే, నేడు మీరు బలహీనులుగా ఉన్నారని చింతించకుండా, ఆయన కృప కొరకు వెదకండి, అప్పుడు దేవుడు మిమ్మును తన కృప చేత బలపరచి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడి, మమ్మును బలపరుస్తానని వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీలో మాత్రమే మేము కనుగొనగలిగే ఆ కృపలో మమ్మును ఇంకను బలపరచుము. ప్రభువా, నీ కృప మా పట్ల చాలినంతగా ఉండాలి. ప్రభువా, నిన్ను వెదకు వారికి ఏ కోదువ ఉండదని నీ వాక్యము తెలియజేసినట్లుగానే మమ్మును నీ శక్తివంతమైన కృపతో నింపుము. ప్రభువా, నీ యందు కనుగొనగలిగే కృప ద్వారా మా జీవితములో ఏ కొదువ లేకుండా సమృద్ధికరమైన దీవెనలతో మమ్మును నింపుము. దేవా, మా మీద మరియు మా కుటుంబము మీద నీ కృప విస్తరించునట్లుగా చేయుము. ప్రభువా, మేము సమస్త కార్యములను చేయుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించుము. యేసయ్యా, మమ్మును బలపరచు నీ యందు మేము సమస్తమును చేయుటకు నీ కృపను మాకు దయచేయుము. దేవా, మా ప్రాణాత్మలను మరియు మా శరీరములను బలపరచుము, ప్రభువా, బలహీనమైన మా శరీరములను పరాక్రమవంతులైన శూరుని వలె మమ్మును శక్తివంతులనుగా చేయుము. ప్రభువా, నీ బలము మా మీదికి దిగివచ్చునట్లుగాను మరియు మేము సింహము వలె ధైర్యముగా ఉండునట్లుగాను, ఏ కీడు దుష్టత్వము మమ్మును తాకకుండా చేయుము. ప్రభువా, సింహము వలె మమ్మును బలవంతులనుగా మార్చుము. దేవా, మేము అత్యంతమైన బలవంతులముగా నీలో స్థిరముగా నిలబడునట్లుగా మాకు అటువంటి శక్తిని దయచేయుమని యేసుక్రీస్తు పరాక్రమమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.