నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయుట లో నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 18:16వ వచనము ఇలాగున చెబుతుంది, "ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలో నుండి తీసెను'' ప్రకారం మహా జలరాసుల నుండి మిమ్మును పైకి తీసుకొని వస్తాడు. ఇక్కడ, "మహా జలరాసుల'' అనగా తుఫానుల వలన కలుగు బాధలను సూచించుచున్నది.

నా ప్రియులారా, మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, అది మనలను అన్ని వైపులా చుట్టుముడుతుంది మరియు మనం లోతైన నీటిలో మునిగిపో వుచున్నట్లు మనకు అనిపిస్తుంది. అందుకే బైబిల్‌లో కీర్తనాకారుడైన దావీదు, కీర్తనలు 69:1లో, దేవునికి ఇలాగున మొరపెట్టాడు: " దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము. నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి'' అన్న వచనము ప్రకారము దావీదును శత్రువులు చుట్టుముట్టినప్పుడు, తద్వారా అతను మునిగిపోవుచున్నట్లుగా భావించాడు. అయినప్పటికిని, దేవుడు అతనిని విడిచిపెట్టలేదు; ఆయన దావీదును అగాధ జలములలో నుండి బయటకు తీసి, నీటిలో మునిగిపోకుండా కాపాడాడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు కీర్తనలు 66:12వ వచనములో ఈలాగున వ్యక్తపరిచాడు, " నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించియున్నావు'' అని చెప్పబడియున్నది. అవును, దావీదును పట్టుకొన్న విధంగా అగాధ జలముల మధ్య ప్రభువు మన చేతులను కూడా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఆ మహా జలరాసుల నుండి మనలను బయటకు తీసుకొని వస్తాడు.

అదేవిధంగా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యులు కూడా గలిలయ సముద్రములో ఉన్నప్పుడు అలాగుననే భావించారు. మత్తయి 8:23-27లో, సముద్రంలో శిష్యుల మధ్య జరిగిన ఒక సంఘటనను గురించి మనం చదవగలము. " ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. 'అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను.' ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.'' అవును, శిష్యులు యేసుతో కలిసి దోనెలో ఉండగా తుఫాను సముద్రాన్ని తాకినందున అది చూచిన శిష్యులు భయపడి, యేసును నిద్ర నుండి లేపారు. 'ప్రభువా, దయచేసి మాకు సహాయం చేయుము, మేము సముద్రంలో మునిగిపోతున్నాము అని కేకలు వేసారు.' యేసు వెంటనే లేచి, 'అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు?' అని శిష్యులను మందలించాడు. అప్పుడు ఆయన సముద్రాన్ని గద్దించాడు మరియు తుఫాను మరియు గాలి వెంటనే నిమ్మళించాయి.

అవును నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు తుఫానుల వంటి బాధలను అనుభవించుచున్నట్లయితే, దయచేసి మీ ధైర్యాన్ని కోల్పోకండి, మరియు నిరుత్సాహాపడకండి మరియు తుఫాను వంటి కష్టాలను చూచి భయపడకండి. ఎందుకంటే, మన ప్రభువైన యేసు మీ కష్టాల మధ్య ఉన్నాడు. ఆయన మీ చెయ్యి పట్టుకొని అగాధ జలములలో నుండి మిమ్మును బయటకు తీసి, మీ కష్టాలను మరియు మీ సమస్యలన్నిటిని గద్దించి, వాటిని నిమ్మళింపజేసి, మిమ్మును పరవశింపజేస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ ప్రేమపూర్వక వాగ్దానముతో మమ్మును ప్రోత్సహించినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, దయచేసి నీ బలమైన చేతిని చాచి అగాధ జలములనే కష్టాల నుండి మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మేము ప్రతిరోజు తీవ్రమైన బాధలలోను మరియు వేదనలలో మునిగిపోవుచున్నాము. మా అగాధ జలముల వంటి సమస్యలు మమ్మును క్రిందికి లాగుతున్న ప్రతి పరిస్థితి నుండి మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, నీ శక్తివంతమైన నామంలో మా జీవితం నుండి ప్రతి శాపం మరియు ఒత్తిడిని తొలగించి వేయుము. ప్రభువా, అగాధ కూపములో ఉన్న మా చేతిని దయచేసి, పట్టుకొనుము, మా కష్టాల నుండి మమ్మును విడిపించి, మా జీవితంలోని ప్రతి ప్రాంతంలో నీ పునరుద్ధరణ జరుగునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, లోతైన బాధలలో నుండి సహాయం కొరకు మేము చేసిన మొఱ్ఱలను విని, మా పట్ల గొప్ప అద్భుతాలను జరిగించి, మమ్మును పైకి తీసి, అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.