నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతో సంతోషించుచున్నాను. మనమందరము కలిసి, ప్రభువైన యేసు మనలను ఎలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడో నేడు మనం ధ్యానిద్దాం. అందుకు నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:7వ వచనము నుండి ఆయన మనతో మాట్లాడుట, మనము చూడబోవుచున్నాము. ఆ వచనములో దేవుడు, "క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను'' అని చెప్పబడిన ప్రకారం ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టుట అనునది, మనకు ఎంత గొప్ప ఘనత కదా!
నా ప్రియులారా, ఇందునిమిత్తము ఆయన మనకు తన స్వంత నామమును అనుగ్రహించి, ఆ నామముతో మనలను ఆయనతో ఐక్యపరుస్తాడు. అందుకే దేవుని వాక్యములో, మనము ఆయన పిల్లలముగా మార్చబడినప్పుడు, ఆయన తన నామమును మన నుదుటి మీద ఉంచుతాడని చెప్పబడియున్నది. ఆ యొక్క యేసు నామంతో గొప్ప ఘనత మరియు ఉన్నత స్థితి కూడా ఒకటిగా వస్తుంది. యేసు నామముతో అత్యున్నతమైన ఔన్నత్యము మనకు వస్తుంది. ఆయన నామాన్ని మోసేవారుగా, మనం ఉన్నతమైన స్థానానికి ఎత్తబడతాము, ఆయనతో పాటు పరలోక రాజ్యాలలో కూర్చుండబెట్టబడతాము. ఈ కారణంగానే, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మనలను క్రీస్తుతో కూడా లేపుతాడు. ప్రతి మానవాళి యొక్క పాపపు ప్రభావములన్నిటి నుండి విడిపించి, ఆయన మనలను లేవనెత్తుతాడు. అటువంటి పాపము నుండి ఆయన మనకు పునరుత్థానమును అనుగ్రహిస్తాడు. క్రీస్తుతో కూడా ఉండునట్లుగా ఆయన మనలను లేపుతాడు. అప్పుడు మనం యేసుతో కూడా ఉన్నత రాజ్యాలలో ఉంచబడతాము, మహిమలో యేసుతో ఐక్యమవుతాము. భక్తుడైన యోనా జీవితములో కూడా ఇలాగుననే జరిగినది. ప్రవక్తయైన యోనా, దేవుని మార్గమును విడిచి తన స్వంత మార్గములో వెళ్లినప్పుడు, అతడు పాపములో పడిపోయాడు. ఓడ నుండి సముద్రములోనికి పడవేయబడిన యోనాను, ఒక పెద్ద చేప మ్రింగివేసినది. అక్కడ అతడు భూమి యొక్క దిగంతముల వరకు దిగిపోయాడు. గాఢాంధకారమందు అతడు ఉన్నప్పుడు, తన పాపము తనకు తెలియవచ్చినది. కనుకనే, అతడు, " ప్రభువా, నన్ను క్షమించు'' అని అడిగాడు. ప్రభువు అతనిని తనతో కూడా ఉండునట్లుగా, అతనిని దేవుడు పైకి లేవనెత్తాడు. అతనిని చేప కడుపులో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. తన జీవితాన్ని మహిమవంతముగా మార్చాడు. హల్లెలూయా!
నా ప్రియులారా, యోనా దేవునికి విధేయత చూపి, సరైన మార్గములో నడిచినప్పుడు, ప్రభువు అతనికి గొప్ప అధికారాన్ని ఇచ్చి అతనిని ఘనపరచాడు. యోనా మాట విని రాజు మరియు నీనెవె ప్రజలు భయపడ్డారు. ప్రభువు మహిమపరచిన దేవుని ప్రవక్త ఇచ్చిన సందేశానికి రాజు కూడా వణికిపోయాడు. యోనాకు దేవుడు దైవీకమైన అధికారమును, శక్తిని మరియు అతనికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇంకను యోనా ద్వారా నీనెవె పట్టణమంతటికి రక్షణను తీసుకువచ్చాడు. దేవుడు తనతో ఉండడానికి మిమ్మును కూడా పైకి లేవనెత్తినప్పుడు ఇలాగుననే మీకు కూడా జరుగుతుంది. ఆయన తన మహిమ కొరకు మిమ్మును మారుస్తాడు, ఘనపరుస్తాడు మరియు బలపరుస్తాడు! నేడు మనము ఇటువంటి కృపను పొందుకుందామా? ఆలాగైతే, మీ పాపములను ఒప్పుకొని, విడిచిపెట్టినప్పుడు, ఆయన మీ పాపములను శుద్ధీకరించి, ఆయన తన నామమును మీ మీద ఉంచి, మిమ్మును తనతో కూడా ఉండునట్లుగా, హెచ్చిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, పరసంబంధమైన మిమ్మును నడుచునట్లుగా చేస్తాడు. దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును క్రీస్తు యేసుతో కూడా లేపి పరలోక స్థలములలో కూర్చోబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, నీ పరిశుద్ధ నామాన్ని మా మీద ఉంచి, మమ్మును నీతో ఐక్యపరచినందుకు నీకు వందనాలు. ప్రభువా, మమ్మును, మా పాపం నుండి విడిపించి, నీ నీతిలో నడవడానికి మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మేము యోనా వలె నీకు విధేయత చూపుచూ, నీ ఆజ్ఞలకు లోబడి నడుచుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మేము ఎల్లప్పుడు నీ నామమునకు ఘనతను కలిగి ఉండుటకును, నీ చిత్తానికి విధేయత కలిగి జీవించునట్లుగా సహాయము చేయుము. దేవా, యోనావలె మా తప్పులను గుర్తించి, పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి రావడానికి మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, నీ మాటను మాట్లాడటానికి మరియు ఇతరుల జీవితాలలో రూపాంతరము తీసుకొని రావడానికి మాకు నీ యొక్క దైవీకమైన అధికారాన్ని అనుగ్రహించుము. దేవా, మా జీవితం నీ శక్తిని మరియు రక్షణను ప్రతిబింబించునట్లుగాను, అనేకులను నీ రాజ్యంలోనికి ఆకర్షించేవారినిగా మమ్మును మార్చుము. యేసయ్యా, మేము చేయుచున్న ప్రతి పనిలో నిన్ను మహిమపరచునట్లుగా నీ ఉద్దేశ్యం ప్రకారం మమ్మును హెచ్చించుము. దేవా, మేము దీన స్థితిలో ఉండవచ్చును మరియు మేము చేసిన పాపమును బట్టి, మా జీవితములో చేసిన తప్పు కార్యములను బట్టియు, మేము నిన్ను వెంబడించలేదు గనుకనే మమ్మును క్షమించుము. ప్రభువా, మమ్మును యోనా వలె ప్రవక్తలనుగా వినియోగించుకొనుము. మేము పనిచేయుచున్న ప్రతి రంగములోను అత్యున్నతమైన స్థాయిలో ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, నీ బలమైన సేవకులనుగా మమ్మును వాడుకొనుము. దేవా, మా ద్వారా నీ నామము మహిమపడునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.