నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయడంలో నేను ఎంతగానో సంతోషించుచున్నాను. దేవుడు తన జీవముగల వాక్యం ద్వారా మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 16:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు'' ప్రకారం దైవజనుడైన మోషే తన ప్రజలను బట్టి ఎంతో క్రుంగిపోయాడు. ఆ సమయములో అతడు దేవుని వైపు చూచాడు. బైబిల్‌లో నిర్గమకాండము 33:14వ వచనములో దేవుని వాక్యము ఈలాగున సెలవిచ్చుచున్నది, " అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదని'' వాగ్దానము చేశాడు.
నా ప్రియ స్నేహితులారా, దైవజనుడైన మోషే వలె మీరు కలవరపడుచున్నారా? మీ జీవితములో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారా? దేవుని సన్నిధి మీకు ముందుగా వచ్చునని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. నేడు కలవరపడుచున్న మిమ్మును చూచి, " నా కుమారుడా, కుమార్తె, నా సన్నిధి మీకు ముందుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును'' అని ప్రభువు మీకు వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, మనము ఏమి చేయాలి? మోషే వలె కేవలము మనము ప్రభువు వైపు చూడాలి. మోషే ఎల్లప్పుడు ఆ కార్యమును చేశాడు. గంటల తరబడి, రోజుల తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని యుండెను. హల్లెలూయా! అందుకే దేవుడు మోషేకు తోడుగా ఉండి, అనేక పరిస్థితుల నుండి విడిపించాడు. అంతమాత్రమే కాదు, " ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు'' అని కీర్తనలు 16:11వ వచనము మనకు స్పష్టంగా గుర్తు చేయుచున్నది. ఇంకను కీర్తనలు 31:19-20వ వచనములలో కూడా అదే వ్రాయబడియున్నది, " నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరుల యెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు'' ప్రకారం ప్రభువు తన సన్నిధి చాటున మనలను దాచి ఉంచుతాడు. కనుకనే, ఎటువంటి పరిస్థితులు కూడా మనలను జయించలేవు. ధైర్యముగా ఉండండి.
అదేవిధముగా, మా కుటుంబ జీవితములో మేము అనేక శ్రమలను ఎదుర్కొన్నాము. కేవలము 17 ఏళ్ల వయస్సులో ఉన్న మా కుమార్తె ఇవాంజెలిన్‌ను కోల్పోయినప్పుడు, మా సంతోషము మరియు మా నిరీక్షణ అంతటిని ఆమెతో కూడా కోల్పోయాము. మేము ఎల్లప్పుడు మా హృదయములలో విలపిస్తూ ఉండేవారము. ఒకరోజు ఎప్పటివలె ఉదయము 6 గంటలకు కుటుంబముగా కూర్చుని కలిసి ప్రార్థించుచుండగా, మేము యధావిధిగా కుటుంబ ప్రార్థన చేసుకొనుచుండగా, ఆ రోజు దేవుని సన్నిధి మా అందరిని నింపినది. మేము దేవుని శక్తితో నింపబడ్డాము. మా దుఃఖాన్ని మరచి, దేవుని సన్నిధితో నింపబడి, అందరము ఆనందముతో నవ్వుచున్నాము.
నా ప్రియులారా, బైబిల్‌లో 1 పేతురు 1:8 చూచినట్లయితే, " మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మ రక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు'' ప్రకారము మా జీవితాలలో సంతోషము కలిగినది. ఇంకను చెప్పనశక్యముకానీ, మహిమాయుక్తమైన ఆనందముతో మేము నింపబడ్డాము. అప్పుడు మేము దేవుని స్వరాన్ని ఇలాగున విన్నాము, "నా బిడ్డలారా, మీ వేదనను నేను యెరిగి యున్నాను, ఇటువంటి సమయములో మీరు నన్ను విడిచిపెడతారా? లేక నా పనిని కొనసాగిస్తారా?'' అని మమ్మును చూచి ప్రశ్నించియున్నాడు. వెంటనే మేము, 'లేదు ప్రభువా, మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడకు వెళ్లగలము? నీవే మా నిరీక్షణ మరియు మా ఆనందమునై యున్నావు' అని చెప్పాము. అప్పుడు ప్రభువు మమ్మును నూతన నిరీక్షణతో నింపాడు. మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చడము మరల ప్రారంభించాము.
నా ప్రియులారా, అలాగుననే మీరు కూడా మీ జీవితంలో ఆందోళనలు మరియు పోరాటాల ద్వారా భారముతో ఉన్నారా? మీరు కూడా మీ జీవితములో అనేక విషయాలను గురించి చింతించుచున్నారా? రండి ప్రార్థిద్దాము. అదే ప్రభువు మిమ్మును తన పరిశుద్ధాత్మ శక్తితో నేడు నింపుతాడు. అప్పుడు మీ ఆత్మలో ఆనందము కలుగుతుంది. అంతమాత్రమే కాదు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషము మీలో కలుగుతుంది. ప్రభువు మీకు నూతన మార్గమును తెరుస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనము సేవించుచున్నాము కదా! ప్రార్థన చేద్దామా? ఆలాగున చేసి, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మరియు సమాధానమును మీకు అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా అమూల్యమైన ప్రేమగల ప్రియతండ్రీ, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలైన మమ్మును నూతన నిరీక్షణతోను మరియు నీ సన్నిధానముతో నింపుము. దేవా, మేము చెప్పనశక్యమును సంతోషాన్ని మరియు విశ్రాంతిని కోరుతూ నీ సన్నిధికి వస్తున్నాము, నీవు మాకు ముందుగా వెళ్లి, మాకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, దయచేసి మా దృష్టిని నీపైనే ఉంచడం మరియు నిన్ను పూర్తిగా విశ్వసించడం మాకు నేర్పించుము. దేవా, నీ సన్నిధిలోని దాగు చోటులో మమ్మును దాచిపెట్టుము. ప్రభువా, మేము ఎదుర్కొంటున్న వేదనలన్నియు కూడా ఇప్పుడే మమ్మును విడిచిపెట్టి వెళ్లిపోవునట్లు చేయుము. దేవా, నూతన ఆశీర్వాదములను మరియు పరిశుద్ధాత్మ ద్వారా మాకు నూతన అభిషేకమును దయచేయుము. ప్రభువా, మాకు భారాన్ని కలిగించే ప్రతి ఆందోళన మరియు పోరాటం నుండి మమ్మును రక్షించి, మేము నీ సేవ చేయుచూ, ముందుకు సాగిపోవునట్లు చేయుము. ప్రభువా, మా కుటుంబములోను మరియు మా వ్యక్తిగత జీవితములోను మాకు సంపూర్ణమైన సమాధానమును మరియు సంతోషమును అనుగ్రహించుము. దేవా, మా కోరికలను పునరుద్ధరించుము మరియు నీ చిత్తమును అనుసరించుటకు మా విశ్వాసమును బలపరచుము. పరిశుద్ధాత్మ దేవా, నీవు దయచేసి మాకు బోధించి, మమ్మును నడిపించుము మరియు మా యెదుట నూతన ద్వారములు తెరువుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.