నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:31వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? '' ప్రకారము, దేవుడు మీ పక్షమున మరియు మీతో ఉన్నాడు. గనుకనే, మీకు విరోధంగా ఎవరు ఉండగలరు? కాబట్టి, మీకు విరోధంగా ఉన్నవారిని చూచి మీరు భయపడకండి. దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు.

అవును, నా ప్రియులారా, యేసు ప్రభువు తన రక్తముతో మిమ్మును కొనియున్నాడు. కనుకనే, మీరు ఆయనకు చెందినవారై యున్నారు. ఆయన మిమ్మును తన యరచేతిలో చెక్కుకొని యున్నాడు. ఆయన ఎప్పటికైన మిమ్మును మరచిపోతాడా? ప్రజలు మీకు విరోధంగా పోరాడవచ్చును. గానీ, ప్రభువు, "వారు మీ మీద జయాన్ని పొందలేరనియు, నేను మీకు ముందుగా వెళ్లెదను, నేను వంకర మార్గమును సరాళము చేయుదును, దాచబడియున్న నిధులను నేను మీకు అనుగ్రహించెదను. మరుగైన ప్రదేశములలో ఉన్న ఐశ్వర్య సంపదను, నేను మీకు ఇస్తాను '' అని సెలవిచ్చుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, యెషయా 45:2-3వచనములో చూచినట్లయితే, " నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను'' అని చెప్పబడియున్నది. కనుకనే, మీకు విరోధంగా ఎవరును మిమ్మును అధిగమించలేరని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎల్లవేళల మీతో కూడ ఉన్నాడు. కనుకనే భయపడకండి,

భువనేశ్వరి అను ఒక సహోదరి తన సాక్ష్యమును పంచుకొనెను. తన భర్తకు ఒక స్నేహితుడుండెను. అతడు చాలా మంచి స్నేహితునిగా నటించాడు. అతడు తన భర్తకు కొంత ధనమును ఇచ్చాడు. కోట్ల రూపాయల ఖరీదైన తన యొక్క నివాస గృహమును స్యూరీటి అని తన పేరు మీద వ్రాయించుకుని, ఆ రీతిగా సంతకము చేయించుకొన్నాడు. ఆకస్మాత్తుగా ఈ ఇల్లు నాది. కనుకనే, ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేయండి అని అన్నాడు. అది విన్న వారు నిర్ఘాంతపోయారు. వారు కోర్టుకు వెళ్లారు. కేసు నమోదు చేశారు. అది 20 సంవత్సరాల పాటు ఆ కేసు కొర్టులో కొనసాగింది. ఈ మధ్యకాలములోనే ఆ చింతతోనే, ఆమె భర్త చనిపోయాడు.

అటువంటి సమయములో వారి నగరములోనే ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి వారికి ఎవరో చెప్పారు. ఆమె అక్కడికి వచ్చినది. మంగళ వారములో నిర్వహించబడిన, ఉపవాస ప్రార్థనలో ఆమె కూడా కలుసుకొని, ప్రార్థనలో ఏకీభవించారు. తద్వారా, తన బంధకాలు బ్రద్ధలు చేసి, తన గృహన్ని దేవుడు తనకు మరల ఇవ్వాలని ఆమె ఎంతగానో మొఱ్ఱపెట్టినది. వెంటనే ఒక అద్భుత కార్యము జరిగినది. ఆమెకు ఏ మాత్రము కూడ తెలియని ఒక న్యాయవాది ఆమె యొద్దకు వచ్చి, ఈ కేసును నేను నీ కోసము వాదిస్తాను అని అన్నారు. అతడు ఆ కేసును నడిపించాడు. న్యాయమూర్తిగారు ఈమెకు అనుకూలమైన తీర్పును అనుగ్రహించాడు. ఆమెను మోసగించిన ఆ వ్యక్తి, ఆమె యొద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, నాకు ఇంక కొంచెము డబ్బును ఇవ్వండి, నేను మీ యింటిని తిరిగి మీకే ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఆమె తన యింటిని తిరిగి పొందుకున్నారు. ఈ రోజున ఆమె తన స్వంత గృహములో నివసించుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన పక్షమున ఉండగా, మనకు విరోధి ఎవడు? కనుకనే, నేడు మీ పట్ల విరోధులు ఎవరు ఉన్నను సరే, మీరు భయపడకండి, ఆయనకు మొఱ్ఱపెట్టండి, దేవుడు మీ పక్షమున ఉండి, మీ పట్ల యుద్ధము చేసి, మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
న్యాయాధిపతివైన పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నీ ప్రేమపూర్వక వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, మాపై నీకున్న ప్రేమ ఇతరులకన్నా గొప్పది మరియు బలమైనది. యేసయ్యా, నీ విలువైన రక్తంతో మమ్మును కొని నీ సొత్తుగా చేసుకున్నావు. కనుకనే, నీకు తెలియకుండా మా జీవితంలో ఏదియు జరగదు. దేవా, అన్యాయముగా మా యొద్ద తీసుకొన్న డబ్బు లేక మాకు చెందిన దానిని ఏదైన సరే, వారు తిరిగి మాకు ఇచ్చునట్లుగా వారి హృదయాలను మార్చుము. ప్రభువా, నీవు వాగ్దానం చేసినట్లుగానే, నీవు మాతో ఉన్నావని అందరు గుర్తించునట్లుగా, మేము పోరాడుచున్న ఈ యుద్ధంలో నీవు మా పక్షమున పోరాడి, విజయం సాధించడంలో మాకు సహాయము చేయుము. దేవా, దయచేసి మాకు ముందుగా వెళ్లి, ప్రతి వంకర మార్గాన్ని మాకు సరాళము చేయుము. ప్రభువా, నీవు మాతో ఉన్నట్లయితే, మాకు ఏదియు హాని కలిగించదని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ మమ్మును చూస్తున్నావనియు, మా పక్షాన నిలబడి మా యుద్ధం చేసి మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, మాకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్థిల్లకుండా చేయుము. ప్రభువా, మా కోర్టుకేసులో మా పక్షమున వాజ్యమాడి, మాకు న్యాయము చేకూర్చుమని యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.