నా స్నేహితులారా, ఈ రోజు యేసు పిలుచుచున్నాడు క్యాలెండర్‌ను పరిశీలించారా? చూసినట్లయితే, ఈ రోజు కొరకు దేవుని వాగ్దానమును మీరు చూచెదరు. 2 థెస్సలొనీకయులకు 3:5 ప్రకారం, ‘‘దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక’’ అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అనగా, సహనముతో దేవునికి సేవ చేయుటకును మరియు స్థిరముగా ఆయనను హత్తుకొని ఉండుటకును కట్టుబడి ఉండునట్లుగా దేవుడు మీ హృదయమును తన ప్రేమ వైపు ప్రేరేపించుచున్నాడు.

ప్రేమించగలననే నమ్మకమును కోల్పోయినట్లుగా నేడు మీరు భావించుచుండవచ్చును. "నా భార్యతో నిత్యం జరుగుచున్న గొడవల వలన తనను లేక నా కుటుంబమును నేను ప్రేమించలేకపోవుచున్నాను. వ్యాపారములో నా భాగస్థుడు చేసిన మోసము వలన ఎవరినైనను నమ్ముటకును లేక ప్రేమించుటకును నాకు కష్టముగా ఉన్నది. నాకెంతో ప్రియమైనవారిని నేను కోల్పోయినందు వలన ఎల్లప్పుడు నేను కోపముగా ఉంటున్నాను. నా హృదయము మూసుకొనిపోయింది మరియు కఠినమైపోయింది" అని అనుకొనుచుండవచ్చును.

యేసు, మొదటిసారి మా తాతయ్యకు దర్శనమిచ్చి, రక్షించినప్పుడు, ఆయన, ‘‘దినకరన్‌, నీది మానవుల హృదయము, అనగా కఠినమైన హృదయము. కానీ ఈనాటి నుండి నా హృదయమును నేను నీకు ఇచ్చుచున్నాను. ఇది ప్రేమ మరియు కనికరముతో నింపబడి, ప్రతిఒక్కరిని ప్రేమించగల హృదయము. వెళ్లు, నా జనులను ప్రేమించు’’ అని చెప్పెను. ఆనాటి నుండి, కృప మాలోనికి ప్రవేశించింది. ప్రజలకు పరిచర్య చేయుటకును మరియు వేలాది మంది ప్రజలకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయుటకును నా తండ్రి, ప్రేమగల హృదయముతో ఉదయము మొదలుకొని, సాయంత్రం వరకు నిలబడే ఉంటారు. ఆయన కార్యాలయములో పని చేసే సమయములో సహితం, ఎవరికైనను అత్యవసర ప్రార్థన అవసరమైనట్లయితే, వెంటనే వారికి ప్రార్థన చేయుటకును, వారిని కలుసుకొనుటకును ఆయన వెళ్తారు లేక ఫోన్‌ చేస్తారు. ఆయన చాలా తీరిక లేకుండా ఉన్నప్పటికీ, మా కుటుంబములోని ప్రతిఒక్కరిని ప్రేమించును మరియు మా అవసరములన్నిటిని ఆయన చూసుకొనును.

నా స్నేహితులారా, దేవుడు తన యందున్న ప్రేమతో మీ హృదయములను ప్రేరేపించుట ద్వారా మీలో ప్రజల పట్ల ప్రేమ మరియు కనికరము కలుగును. ఈరోజు, మన హృదయములను దేవుని ప్రేమ కొరకు తెరిచెదమా?

ప్రార్థన:
ప్రియ ప్రభువా, కఠినమైన హృదయముతో ఉండకుండ నుండుటకు నాకు సహాయము చేయుము. నీవు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను ప్రజలను ప్రేమించినప్పుడే, వారి కొరకు నేను చింతించగలనని నేనెరుగుదును. నేను నా కొరకు మాత్రమే జీవించాలని ఆశించుట లేదు. కనుక, ప్రభువా, ముందుగా నా హృదయమును నీ కొరకు తెరువుము మరియు నీ ప్రేమతో నన్ను నింపుము. నీవు వాగ్దానము చేసిన ప్రకారం, నా హృదయమును నీ ప్రేమ ద్వారా ప్రేరేపించుము. నీ యొక్క లోతైన ప్రేమ వలనే నీవు నా కొరకు సిలువ మీద శ్రమలు పొంది, మరణించావు. అటువంటి నీ ప్రేమను పొందుకొని, ఇతరులను ప్రేమించుటకు నాకు సహాయము చేయమని నేను నిన్ను అడుగుచున్నాను. నీ ప్రేమ యొక్క ఐశ్వర్యముతోను మరియు గొప్పతనముతోను నన్ను నింపుము. దయతో నన్ను సంరక్షించుము మరియు నిన్ను సేవించుట యందు స్థిరముగా నుండుటకును నాకు సహాయము చేయమని, యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.