నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలియజేయుట నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు...'' ప్రకారం అవును, నా స్నేహితులారా, ఈ శక్తి కొరకు ఆశించుచున్నారా? ఇంత గొప్ప శక్తితో నింపబడాలని మీరు కోరుచున్నారా? పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలని అడుగుచుండగా, దేవుని శక్తి మీ మీదికి దిగివస్తుంది. బైబిల్‌లో, పేతురు జీవితమును చూచినట్లయితే, అతని జీవితములో కూడా అదే జరిగింది. అతను ఒక సాధారణమైన జాలరి. అతడు ఒక భయపడగల తత్త్వము ఉన్న ఒక వ్యక్తి. అతడు కష్టమైన పరిస్థితులలో అక్కడ నుండి పారిపోయిన ఒక వ్యక్తి. అతడు యేసు క్రీస్తు శిష్యుడైనప్పటికిని, ఎవరైనను యేసయ్యను గురించి అతనిని అడిగినప్పుడు, 3 సార్లు యేసయ్యను గురించి తెలియదని బొంకాడు మరియు తృణీకరించాడు. కారణము, అతడు ఎంతగానో భయము నొందాడు మరియు భయముగల ఒక వ్యక్తిగా ఉండెను.

అయితే, నా ప్రియులారా, బైబిల్‌లో అదే పేతురు జీవితము ఎలా పరిపూర్ణంగా మార్పు నొందినదని మనము చూడగలము. పెంతెకొస్తను దినమున దేవుడు తన ఆత్మను అతని మీద కుమ్మరించినప్పుడు, పేతురు జీవితము పూర్తిగా మారిపోయినది. యేసు నామము కొరకు నిలబడిన యోధులలో అతను ఒక వ్యక్తిగా ఉండెను. అంతమాత్రమే కాదు, అతడు ప్రజల పట్ల అద్భుతాలు మరియు ఆశ్చర్య క్రియలు, సూచక కార్యములు చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఇంకను అతడు ముందు వరుసలో నిలబడి దేవుని నిమిత్తము ప్రజల పట్ల సూచనలను జరిగించాడు. ఏది ఎదురు వచ్చినను సరే, ' యేసు కొరకు నేను నిలబడతాను, నేను భయము నొందను అని చెప్పి,' యేసు నామమును ప్రకటించుటకు ముందుకు వచ్చాడు. అవును, దేవుని శక్తి అతని మీదికి వచ్చినది. కుంటివాడు పైకి లేచి నిలబడి మరియు స్వస్థతగలవాడై నడిచాడు. ఇంకను పేతురు నీడ కూడా ప్రజల జీవితాలలో అద్భుతాలను జరుగునట్లు చేసినది. తద్వారా, అతని పరిచర్య సంపూర్ణముగా మారిపోయినది. హల్లెలూయా!

అదే విధముగా, నా ప్రియులారా, నేడు మీ జీవితాలను కూడా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఒకవేళ, నేడు మీరు, ' మేము అన్నిటికిని భయపడుచున్నాము' అని అంటున్నారా? 'మేము పిరికివారము, మేము చాలా సిగ్గుపడుచున్నవారము, దేవుని చేత ఉపయోగించబడడానికి మాలో ఎటువంటి లక్షణాలు లేవు' అని అంటున్నారా? అయితే, నా ప్రియులారా, దేవుడు నేడు మీతో మాట్లాడుచున్నాడు. ఆలాగునేన, దేవుని ఆత్మ ఈ రోజు మీ మీద కుమ్మరించబడుచుండగా, మీరు ఆయన శక్తితో నింపబడుతూ, ధైర్యంగా విశ్వాసములో నడుస్తూ, మీరు మీ జీవితములో ముందుకు సాగి వెళ్లడానికి, ఆత్మవిశ్వాసంతో శక్తివంతం చేయబడతారు. ఇంకను మీరు అద్భుతాలు మరియు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి, మీరు తన శక్తితోను మరియు ఆయన బలముతోను, జ్ఞానముతోను, ధైర్యముతోను నింపబడతారు.

అవును, నా ప్రియులారా, మీరు మెల్లని స్వరముతో అతి చిన్న ప్రార్థన, మీరు జరిగించే అతి స్వల్పమైన సేవా కార్యాలు కూడా దైవీకమైన శక్తితో నింపబడతాయి. ఇంకను మీరు చేయుచున్న చిన్న ప్రార్థన లేక చిన్న పరిచర్య, మీరు చేయుచున్న చిన్న పనులు ఎంతో గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. మీలో ఏదో వైవిద్యముగా ఉన్నదని ప్రజలు అంటారు. ఆలాగుననే, పరిశుద్ధాత్ముడు మీలో పని చేస్తాడు. కాబట్టి, అటువంటి ఈ శక్తిని మనము ఈ రోజు పొందుకుందాము. పరిశుద్ధాత్మ దేవుని మనము మన జీవితములోనికి ఆహ్వానించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు పేతురు వలె మిమ్మును తన ఆత్మ శక్తి చేత నింపి, మీ ద్వారా గొప్ప కార్యాలను జరిగించి, మిమ్మును తన పరిచర్యలో గొప్పగా ఉపయోగించుకుంటాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నిన్ను మా జీవితములో కలిగిఉండే కృపను ఇచ్చినందుకై నీకు వందనాలు. ప్రభువా, పెంతెకొస్తను దినమున శిష్యుల మీద నీ ఆత్మను కుమ్మరించినట్లుగానే, నేడు యేసయ్యా, మా మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము. దేవా, మా బలహీనతలన్నియు కనపడకుండా కనుమరుగై పోవునట్లుగా చేయుము. ప్రభువా, మేము ఏవైతే, మా శరీరములోను మరియు మా ఆత్మలోను బలహీనతగా భావించుచున్నామో ఇప్పుడే అవన్నియు లేకుండా చేయుము. యేసయ్య, మా మాటలు, మా క్రియలు మరియు చిన్న చిన్న సేవా పరిచర్యలు కూడా నీ యొక్క దైవీకమైన శక్తితో నింపబడునట్లుగా చేయుము. దేవా, మాలో ఉన్న సిగుపడు లక్షణాలన్నిటిని నేడు మా నుండి తొలగించుము. దేవా, నీవు మాకు ధైర్యమును, జ్ఞానమును, బలమును, శక్తిని, దయచేయుము మరియు మా జీవితములో ఉన్న భయము, అజాగ్రత్త, పిరికి స్వభావం ఇంకను సమస్తమును నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, నేడు ఆత్మ విశ్వాసముతో ముందుకు నడుచునట్లుగాను, మా జీవితం నీకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, నీ భక్తుడైన పేతురు వలె మార్పునొందినవారినిగా మమ్మును మార్చుము. దేవా, నీవు మా జీవితములోనికి ప్రవేశించునప్పుడు, మా జీవితాలను రూపాంతరపరచుము. యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము నీ కొరకు అద్భుతాలు ఆశ్చర్యకార్యములను జరిగించునట్లుగా కృపను దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.