నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 4:4వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "...మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు'' ప్రకారం ఈ వచనములో బయల్పరచబడినట్లుగానే, ఈ వచనములో ఇద్దరు వ్యక్తులు పనిచేయుచున్నట్లుగా మనము చూడగలము - ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి, మీలో ఉన్నవాడు గొప్పవాడు మరియు మరొక వ్యక్తి, లోకంలో ఉన్నవాడు. లోకంలో ఉన్నవాడు అనగా అపవాది. అందుకే యోహాను 10:10 వ వచనములో చూచినట్లయితే, "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, గాని మరిదేనికిని రాడు'' అని చెప్పబడియున్నది. ఆలాగుననే, యోహాను 16:33లో చూచినట్లయితే, " లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను'' అని యేసు తానే హెచ్చరించాడు, పాపం అనేక జీవితాలపై మరియు భూమిపై సాతానుకు ఆధిపత్యం కల్పించినందున మనం కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొంటాము.
నా ప్రియులారా, అవును, పాపము మనకు మరణమును తీసుకొని వచ్చినదని, రోమీయులకు 6:23వ వచనములో తెలియజేయుచున్నది, "ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము'' అని చెప్పబడినట్లుగానే, అపవాది ద్వారా ఈ లోకమునకు మరణము సంక్రమించినది. అందుకే సాతాను చీకటిని, భయాన్ని, నాశనమును విస్తరింపజేసి, ప్రజల ఆశీర్వాదాలను దోచుకుంటున్నాడు. కానీ, మనం మన హృదయాలను తెరిచి, జీవదాత అయిన యేసును మన జీవితములోనికి ఆహ్వానించినప్పుడు, సమస్తమును మార్చబడుతుంది. యేసు, పూర్తిగా దేవుడుగా ఉన్నప్పటికిని మానవ శరీరం ధరించి, మన పాపాలన్నింటిని తన మీద వేసుకున్నాడు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడైనప్పటికిని, మన కొరకు విధించబడిన దోష శిక్షను ఆయన భరించాడు, ఆయన పాపాల కొరకు కాదు, మన పాపాల కొరకు సిలువపై శ్రమపడ్డాడు. ఆయన మన స్థానంలో శాపంగా మారాడు, పాపమునకు ప్రతిఫలంగా - ఆయన మరణాన్ని - ఎదుర్కొన్నాడు.
అవును, నా ప్రియులారా, ఆయన దేవుడు కాబట్టి, దేవుడు మరణం చేత బంధించబడలేడు కాబట్టి, ఆయన ఆత్మ మూడవ రోజున ఆయనను బ్రతికించినది. ఆయన మరణాన్ని జయించి, సమాధిని గెలిచి తిరిగి లేచాడు మరియు నేడు ఆయన సజీవంగా మన మధ్యలో జీవించుచున్నాడు! ఎందుకు? మీలోనికి వచ్చి, మిమ్మును ఆయన బిడ్డగా, దేవుని యెదుట పవిత్రంగాను మరియు అంగీకారయోగ్యంగా జీవించడానికి ఆయన మరణాన్ని అనుభవించాడు. ఇంకను, చీకటి శక్తులను అణిచివేసి, పాప శాపాన్ని బ్రద్దలు చేసిన, అదే యేసు ఇప్పుడు మీలో జీవించుచున్నాడు. ఆయన ఆత్మకు, సంబంధాలకు మరియు దైనందిన జీవితానికి మరణాన్ని తీసికొని వచ్చే అపవాది కంటే గొప్పవాడు. యేసు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, ప్రతి శాపం నుండి మిమ్మును విడిపిస్తాడు మరియు మిమ్మల్ని జయించువారినిగా చేస్తాడు.
అవును, నా ప్రియులారా, ఈ రోజు, ఆయన మీ హృదయమను తలుపు వద్ద నిలబడి, మీ కొరకు ఎదురు చూచుచున్నాడు. కాబట్టి, నేడు మీరు మీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పండి, ఆయనకు మీ హృదయాన్ని తెరిచి, 'యేసూ, నీవు నా హృదయంలోనికి రమ్ము' అని చెబుతారా? ' ప్రభువా, నా యందు నివసించుము?' అని చెప్పి, ఆయనను మీ హృదయములోనికి ఆహ్వానించినట్లయితే, అటువంటి మిమ్మును ఆయన ప్రేమతో పిిలుచుచున్నాడు, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు ఆయన స్వరమును విని, మీ హృదయమును తెరిచినట్లయితే, ఆయన మీలోనికి ప్రవేశించి మీలో నివసిస్తాడు. క్రీస్తు మీ లోపల జీవిస్తుండగా, ఏ చీకటి శక్తి కూడా మిమ్మును అధిగమించలేదు. ఆయన మిమ్మును కేవలం ఒక జయించువారినికంటే ఉన్నతంగా విజయము పొందిన వారినిగా చేస్తాడు. దేవుడు మీతో ఉండవలసిన అవసరం లేదా? అని మీరు తలంచవచ్చును, కానీ, నా ప్రియులారా, యేసే మార్గం. ఈరోజే మీ హృదయాన్ని మార్గముగా ఉన్న ఆయనకు తెరవండి. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితంలో నీ సన్నిధిని కోరుతూ విధేయతగల హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువైన యేసు, ఈ లోకములో ఉన్న ప్రతి చీకటి శక్తి కంటే నీవు గొప్పవాడవని మేము నమ్ముచున్నాము. దేవా, దయచేసి నీవు వచ్చి మాలో నివసించుము. యేసయ్యా, నీవు మా పాపాలను నీ మీద వేసుకున్నందుకై, నీవు మా పాపములకు బదులుగా మరణించినందుకు మరియు విజయంలో తిరిగి లేచినందుకు నీకు వందనాలు. ప్రభువా, మమ్మును నీ నుండి వేరు చేయుచున్న ప్రతి పాపం నుండి మమ్మును కడిగి పవిత్రపరచుము మరియు మమ్మును నీ యెదుట పరిశుద్ధంగా జీవించుటకు నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, మేము శత్రువు యొక్క అబద్ధాలను తిరస్కరించి, నీ సత్యం యొక్క విడుదలను మరియు వెలుగులో నడవడానికి ఎంచుకున్నాము. యేసయ్యా, మేము ప్రతిరోజూ నీ పునరుత్థాన శక్తిలో జీవించగలిగేలా మమ్మును నీ ఆత్మతో నింపుము. దేవా, నీతో మా నడకకు ఆటంకం కలిగించే ప్రతి శాపాన్ని, ప్రతి సంకెళ్లను మరియు ప్రతి కోటను బ్రద్ధలు చేయుము. దేవా, నీ యొక్క శాంతి, హృదయాలలో ఉన్న మా భయాలకు బదులుగా నీ ప్రేమ ద్వారా మాలోనికి ప్రతి సందేహాన్ని తొలగించుము. యేసయ్యా, మా జీవితాన్ని మేము నీ చేతలకు సమర్పించుకొనుచున్నాము. దేవా, ఈ లోకములో మాకు శ్రమ కలిగినప్పుడు, నీవు మా యందు ఉండి, మా శ్రమలలో మేము జయమును పొందునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము నిత్యము నిన్ను నమ్ముకొని ముందుకు సాగిపోవునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.