నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 5:8వ వచనమును తీసుకొనబడినది. నేటి వాగ్దానములో యేసు తెలియజేసినట్లుగానే, "హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు'' ప్రకారము మత్తయి 5వ అధ్యాయములో 'ధన్యతల కొండ మీద' యేసు 5 విభిన్న ధన్యతల గల ఆశీర్వాదములను గురించి తెలియజేసియున్నాడు. ఈ లోకములో మనము కలిగి యుండగలిగే అతి గొప్ప ఆశీర్వాదము ఇది. అదేమనగా, " హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు''అని చెప్పినట్లుగానే, మన హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొని దేవుడు ఇచ్చే ధన్యతను పొందుకోవాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు.
మన హృదయములో పరిశుద్ధతను ఎలా కలిగి ఉండగలము? నిజమైన నీతిలో పాలిభాగస్వామ్యాన్ని కలిగి ఉండు నిమిత్తము, యేసు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన ఆహ్వానము. ఇట్టి ఆహ్వానాన్ని మనము అంగీకరించినట్లయితే, ధన్యులుగాను, హృదయమునందు శుద్ధిగలవారుగాను మీరు ఉండగలరు. బాహ్యముగా ఉండే పవిత్రత కంటెను, హృదయములోను, అంతరగంములోను పవిత్రతను కలిగియుండాలని యేసు ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. యూదా మతములో ప్రజలు పవిత్ర స్నానాలను ఆచరిస్తూ ఉండేవారు. వారి ఏకాగ్రత బాహ్య పవిత్రత మీదనే ఉన్నందున, వారు తమ చేతులను మరియు పాదములను, దేహమంతటిని కడుగుకుంటూ ఉంటారు. వారు ఆలాగున చేసినట్లయితే, దేహమందును, ఆత్మలోను పవిత్రంగా ఉంటామని భావించేవారు. అయితే, యేసు నిజముగా తెలియజేయుచున్న భావము, అంతరంగములో నుండి బహిర్గతముగా పవిత్రతను కలిగి ఉండుటయే. అందుచేతనే కీర్తనలు 51:10వ వచనములో చూచినట్లయితే, "దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము'' అని దావీదు దేవునికి మొఱ్ఱపెట్టియున్నాడు. మనుష్యులు మన బాహ్య రూప లావణ్యాన్ని చూస్తాడు గానీ, దేవుడైతే, మనుష్యుల హృదయములను చూచువాడై యున్నాడు. కాబట్టి, మీరు దిగులుపడకండి.
యేసు నతనయేలు ఒక ఇశ్రాయేలీయుని యొక్క హృదయములోనికి చూచియున్నాడు. బైబిల్‌నందు యోహాను 1:47లో చూచినట్లయితే, "యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను.'' దేవుడు నిజముగా హృదయాంతరంగములోనికి చూచువాడై యున్నాడు. మన హృదయములను పవిత్రముగా ఉంచుకోవడము ఎంత ప్రాముఖ్యమో కదా! అప్పుడు ప్రభువైన యేసు అతనితో ఇలాగున అంటున్నాడు చూడండి, యోహాను 1:50,51వ వచనములో మనము చూచినట్లయితే, "అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందు వలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను'' ప్రకారం, పరలోకమును చూచుటయు, దేవుని చూచుటయు ఎంత గొప్ప ధన్యవంతమైన అనుభూతియే కదా.
నా ప్రియులారా, నేడు మీరు పరిశుద్ధమైన హృదయమును కలిగియున్నప్పుడు, పరలోకము మీ కొరకు తెరువబడుతుంది. తద్వారా మీరు దేవుని యొక్క సౌందర్యమును చూచెదరు. అంతమాత్రమేకాదు, మీరు దేవునితో సంభాషణ బాంధవ్యమును కలిగి ఉంటారు. అప్పుడు ప్రభువు ఉత్తముడు అని మీరు రుచి చూచి తెలిసికొనెదరు. అవగాహన సామర్థ్యము గల దృష్టితో మీరు క్రీస్తును చూచెదరు. అన్నిటి కంటె మిన్నగా, దేహా రూప విధానంలో ప్రభువును మీరు చూచెదరు. యేసును ముఖాముఖిగా చూచుట ఎంత ధన్యవంతమో కదా! అందుకే నేటి వాగ్దానములో చెప్పబడినట్లుగానే, 'హృదయ శుద్ధిగలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు' వచనం ప్రకారం ప్రియ స్నేహితులారా, ఇప్పుడే ప్రార్థన చేసి, మీరు ఇట్టి ధన్యతను పొందుకుందామా? ఆలాగున మీ హృదయాలను దేవునికి సమర్పించి పరిశుద్ధపరచుకున్నట్లయితే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నీవు చెప్పినట్లుగానే, మేము నిన్ను చూచునట్లుగా మా హృదయాలను పరిశుద్ధపరచుము. ప్రభువా, మా హృదయాలను తెరచి, ఆకాశము తెరువజేసి, మేము పరలోకపు మహిమను చూచునట్లుగా మా తల నుండి అరికాళ్ళ వరకు మమ్మును శుభ్రపరచడం ద్వారా నీవు మమ్మును ఇట్టి ధన్యతకు అర్హులనుగా చేయుమని ప్రార్థించుచున్నాము. దేవా, నీ దూతలు ఎక్కుటయు దిగుటయు చూచునట్లుగా కృపను అనుగ్రహించుము. ప్రభువా, నిన్ను చూచునట్లుగా, మా హృదయ నేత్రములను తెరవజేయుము. దేవా, మేము నిన్ను ముఖాముఖిగా చూచు గొప్ప ధన్యతను మాకు దయచేయుము. ప్రభువా, మేము నీతో నడుచునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మేము నిన్ను ముఖాముఖిగా చూడాలని మరియు నీ మహిమను చూడాలనియు, నీ స్వరమును వినునట్లుగాను మరియు ప్రవచించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ వాక్కును మాట్లాడునట్లుగాను మరియు మేము నేటి నుండి ఆశీర్వదింపబడునట్లుగా మాకు సహాయమును చేయుము. మేము నిన్ను చూచునట్లుగా పరలోకము ఇప్పుడే తెరచునట్లుగా చేయుము. ప్రభువా, నిన్ను చూచే గొప్ప మహిమ మా మీదికి దిగివచ్చునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, దయచేసి నీతో సన్నిహితంగా నడవడానికి మరియు ఎల్లప్పుడూ నీ స్వరాన్ని వినడానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును నీతిమంతులుగాను మరియు పవిత్రంగా మార్చబడునట్లుగా కృపను మాకు అనుగ్రహించుమని మా ప్రభువును, యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.