నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు, మన ధ్యానం కొరకు బైబిల్ నుండి 1 సమూయేలు 2:9 వాగ్దాన వచనమును ఎన్నుకొనబడియున్నది. ఆ వచనము, "తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును...'' ప్రకారము ఆయన తన యందు విశ్వాసముంచువారిని కాపాడును. 'ఆయన' అని ఎవరిని సూచిస్తుంది? బైబిల్‌లో యెషయా 43:3 మరియు 15 వ వచనములలో మనము చూచినట్లయితే, "యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను'' ప్రకారం మన దేవుడైన ప్రభువు ఆయనే అయి ఉంటున్నాడు, ఈ నిరీక్షణతో ఆ వచనమును మరల ఒకసారి చదవండి, ' దేవుడు తన యందు విశ్వాసముంచువారి పాదములను ఆయన కాపాడును. '

ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, లేవీయకాండము 20:26వ వచనము ప్రకారము దేవుడు ఇశ్రాయేలీయుల వైపు చూచి ఈ విధంగా చెప్పియున్నా డు. ఆ వచనము, "మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై యుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని'' ప్రకారం ఇశ్రాయేలీయులు ఎన్నిక చేయబడిన ప్రజలై ఉన్నారు. వారు దేవుని చేత ఏర్పరచబడ్డారు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను చూచి, "నేను మిమ్మును అన్యజనులలో నుండి వేరుపరచితిని, మీరు పరిశుద్ధులై ఉండవలెను'' అని దేవుడు సెలవిచ్చియున్నాడు. ఇది ఎంత మహిమకరమైన పిలుపుగా ఉంటున్నది కదా. అదేవిధముగా, ప్రియులారా, నేడు మిమ్మును కూడా, తన యొక్క స్వంత ప్రజలుగా ఉండడానికై ఆయన మిమ్మును పిలుచుచున్నాడు. తన పరిశుద్ధతతోను మరియు తన పవిత్రతతోను దేవుడు మిమ్మును దీవించాలని మీ పట్ల వాంఛ కలిగి ఉంటున్నాడు. అది ఏ విధంగా సాధ్యపడుతుంది? అది ఎలా జరుగుతుంది? అని మనము హెబ్రీయులకు 13:12వ వచనమును చదివినట్లయితే, అక్కడ ఈ విధంగా వ్రాయబడియున్నది, "కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను'' ప్రకారం తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై యేసుక్రీస్తు, తన రక్తమును సిలువలో చిందించియున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడియున్నారా? యేసుక్రీస్తు రక్తము చేత మీరు పవిత్రపరచబడియున్నారా? ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకోండి. ఒకవేళ, మీరు పరిశుద్ధపరచబడినవారైతే, మీరు ఒక పరిశుద్ధమైన జీవితమును జీవించుచున్నప్పుడే, ప్రభువు మీ పాదములను తొట్రిల్లనియ్యకుండా మరియు ప్రతి హాని నుండి మిమ్మును కాపాడతాడు.అందుకే బైబిల్‌నందు కీర్తనలు 91:11,12లో చూచినట్లయితే, " నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు'' అన్న వచనముల ప్రకారము దేవుడు మిమ్మును గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన పాదములకు రాయికి తగులకుండా ఆయన మనలను తన చేతుల మీద ఎత్తిపట్టుకుంటాడు. మన జీవితములో ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరము కదా. యేసు రక్తము చేత మీరు కడగబడియున్నారా? దేవునితో అన్యోన్య సహవాసము కలిగి యుంటున్నారా? రండి, ప్రభువు హస్తాలకు మన జీవితాలను సమర్పించుకుందాము. ఆ సిలువలో చిందించబడిన ప్రశస్తమైన రక్తముతో మిమ్మును కడిగి, క్షమించమని ప్రార్థన చేద్దాము. అటువంటి మహిమ కరమైన జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, అన్ని వైపుల మీరు కాపుదలను కలిగి ఉంటారు. ఇప్పుడే ప్రార్థన చేసి, ఆ దీవెనలన్నిటిని పొందుకుందామా? ఆలాగైతే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీ యొక్క ఆశీర్వాదముల కొరకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీవు మా కొరకై ఆ సిలువలో నీ ప్రాణాన్ని అర్పించినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా పాపములన్నిటిని నీ రక్తము ద్వారా కడిగి మాకు నీ యొక్క పరిశుద్ధమైన జీవితమును మాకు దయచేసి, మా జీవితములో అన్నివైపుల కాపుదలను మేము కలిగి ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవు మమ్మును నీతిమంతులనుగా మార్చుటకు మేము మరొక్కసారి మా జీవితాన్ని పరిపూర్ణంగా నీ ప్రేమపూర్వక చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువా, దయచేసి మా అపరాధములను క్షమించి, నీ అమూల్యమైన రక్తముతో మమ్మును పరిశుద్ధపరచుము. తద్వారా మేము నూతన సృష్టిగా మార్చుము. దేవా, నీ యెదుట పవిత్రంగా నడవడానికి మాకు నీ కృపను మరియు శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, నీవు మా పాదాలను రాయి తగులకుండా, మరియు నీవు మా పాదాలను మరియు మా జీవితంలోని అన్ని వైపులలోను కాపాడి సంరక్షించుము. దేవా, నీ సన్నిధితో మమ్మును భద్రంగాను మరియు సురక్షితంగా కాపాడుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.