నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనలు 46:1వ వచనము మనకు గుర్తు చేయుచున్నది. అదేలాగున నేటి వాగ్దానముగా కీర్తనలు 5:11వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "నిన్ను ఆశ్రయించు వారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు'' అని చెప్పబడిన ప్రకారము అవును, దేవుడు తనను ఆశ్రయించేవారిని జాగ్రత్తగా పరామర్శిస్తాడు. ఎందుకనగా, దేవుడు మనకు నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన మన ఆత్మను, మన జీవాన్ని, మన యథార్థతను, మన స్వాస్థ్యమును మరియు మన కుటుంబాన్ని భద్రంగా కాపాడతాడు.
ఈ లోకములో యేసు క్రీస్తు పుట్టినప్పుడు, హేరోదురాజు బాలుడైన యేసును చంపడానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు యోసేపు వద్దకు ఒక దేవదూతను పంపి, ఆ శిశువును, ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళు అని స్పష్టమైన నడిపింపును వారికి అనుగ్రహించాడు. నా ప్రియులారా, ఈ దేవుడే నేడు మీ పిల్లలను పెంచడంలో మిమ్మును నడిపిస్తాడు మరియు వారిని కూడా భద్రంగా కాపాడి సంరక్షిస్తాడు. ఆయనే మీకు ఆశ్రయం మరియు ఆయన దైవీకమైన సంరక్షణ మరియు కాపుదల ద్వారా ఆయన మిమ్మల్ని ఆనంద ధ్వని చేయునట్లుగా మారుస్తాడు. కనుకనే, నేడు మీ హృదయం కలత చెందనీయ్యకండి.
యేసు పిలుచుచున్నాడు మా యౌవన భాగస్థుడైన ఆశిష్ షారోన్ జీవితంపై దేవుని కాపుదలను పొందుకున్న అద్భుతమైన ఒక సాక్ష్యం ఇక్కడ తెలియజేయబడుచున్నది. తన తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆశిష్ తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతను స్పృహ కోల్పోయాడు మరియు తరువాత ఆసుపత్రిలో మేల్కొన్నాడు. కానీ, అతని తల్లి అతనికి గుర్తుచేసింది, 'నువ్వు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థుడవు, కనుకనే ప్రార్థనా యోధులు నీ కొరకు భారముతో ప్రార్థించుచున్నారు. కాబట్టి, నీకు ఎటువంటి ప్రమాదము మరియు హాని జరగదు' అని తెలియజేసెను. చూడండి, కీర్తనలు 91:15వ వచనము, "అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను'' అన్న ఆ రోజు, యేసు పిలుచుచున్నాడు అనుదిన వాగ్దానముగా ఇవ్వబడెను. ఆశిష్ ఈ వాగ్దానానికి తనను తాను సమర్పించుకున్నాడు. దేవుని యొక్క దైవీకమైన కాపుదలకు కృతజ్ఞతలు! ఆశిష్ చేతులు విరిగిపోయినప్పటికిని, అతను ఎంతో నొప్పితో ఉన్నప్పటికిని, అతను దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని యొక్క 12వ తరగతి బోర్డు పరీక్షలు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండెను. కాబట్టి, అతను ప్రార్థన సహాయం కొరకు ప్రార్థనా గోపురమునకు ఫోన్ ద్వారా సంపద్రించాడు. ప్రార్థనా యోధులు అతని కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు, మరియు దేవుని బలంతో, అతను శ్రద్ధగా చదువుకున్నాడు. అతను 50 శాతం మాత్రమే మార్కులు సాధించగలడని అనుకున్నాడు. కానీ, దేవుడు అతనికి 80 శాతం మార్కులను అనుగ్రహించి, అతనిని ఆశీర్వదించాడు! దేవుడు ఆశిష్‌ను కాపాడడమే కాకుండా అతని చదువులలో అతనిని అభివృద్ధిపరచి అతని కుటుంబాన్ని కూడా కాపాడి సంరక్షించాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియులారా, మీ హృదయాన్ని కలవరపడనీయ్యకండి. నిజంగా, మీరు యేసును ఆశ్రయించినప్పుడు, ఈ లోకపు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికిని, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకు ఉత్తరమిస్తాడు, ఆయన మీకు ఆశ్రయముగా ఉంటూ, మీ శ్రమలలో ఆయన మీకు తోడుగాను, దుర్గముగాను ఉండి, మీ శ్రమల నుండి ఆయన మిమ్మును మరియు మీ కుటుంబ సభ్యులను విడిపించి, ఆయన మిమ్మును గొప్ప చేస్తాడు. ఇంకను ఆయన మిమ్మును సమస్త ప్రమాదము మరియు హాని నుండి కాపాడి సంరక్షించి, మీరు నిత్యము ఆనంద ధ్వని చేయునట్లుగా మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మా ఆపత్కాలములో మాకు ఆశ్రయంగాను, దుర్గముగాను మరియు మాకు నిత్యసహాయకుడవుగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నిన్ను ఆశ్రయించినప్పుడు, మేము నీలో ఉన్న ఆనందాన్ని పొందుకొనుటకును మరియు నిత్యము ఆనంద ధ్వని చేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, దయచేసి మా ఆత్మను, మా జీవాన్ని, యథార్థతను మరియు మా కుటుంబాన్ని నీ యొక్క దైవీకమైన సన్నిధితో కాపాడి సంక్షించుము. యేసయ్యా, మేము చేయుచున్న ప్రతి పనిలో మమ్మును నడిపించుము మరియు నీవు యోసేపును నడిపించినట్లుగానే, మాకును సరైన మార్గాన్ని చూపించుము. దేవా, సవాళ్లు ఎదురైనప్పుడు కూడా నీ కాపుదల యందు నమ్మకం ఉంచడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మా హృదయాన్ని నీ యొక్క దైవీకమైన సమాధానముతో నింపుము మరియు మా ప్రతి ఆందోళన మరియు భయాన్ని మా నుండి తొలగించుము. దేవా, నీవు ఎల్లప్పుడూ మాకు సమీపముగా ఉన్నావని మేము గుర్తెరుగునట్లుగా నీలో మేము నిత్యము ఆనందించడానికి మాకు నేర్పించుము. యేసయ్యా, నీ యొక్క శాశ్వతమైన ప్రేమ మరియు నిత్య కాపుదల మాతో ఎల్లప్పుడు ఉండునట్లుగా నీ దుర్గమును, కేడెమును మేము ఆశ్రయము కలిగియుండునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.