నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 18:10వ వచనము ప్రకారం దేవుని నామము మీ మీద ఉండును గాక. ఆ వచనము, "యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును'' అని బైబిల్ సెలవిచ్చుచున్నది. కనుకనే మీరు బలమైన దుర్గమైన ఆయన నామములోనికి మీరు వచ్చినప్పుడు, కీడంతటిని మీరు దూరంగా సురక్షితంగా ఉంటారు. కనుకనే, భయపడకండి.
బైబిల్‌లో, యిర్మీయా 10:6వ వచనమును చూచినట్లయితే, " యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను'' ప్రకారం ఆయన నామము ఘనమైనదని ఈ లేఖనములో మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. దేవుని యొక్క నామమును మనకు తెలుసుకోవాలని అనగా, మనము దేవునిని తెలుసుకోవాలి. మనము దేవునికి మొఱ్ఱపెట్టియున్నప్పుడు, ఆయన వాక్యమును మనము ధ్యానము చేయుచున్నప్పుడు, దేనిని గూర్చియైనను మనము ప్రార్థన చేయునప్పుడు, ఇంకను కొన్ని ఫర్యాయములు మరియు ఏదైనా చేపట్టే ముందు నిలకడగా ప్రార్థించినప్పుడు, మనం దేవునిని గుర్తెరుగుట ద్వారా ఆయనకు సమీపముగా ఉంటాము. కొన్ని ఫర్యాయములు, కొంతమంది సహోదరీలు నా యొద్దకు వచ్చి, ' దేవునికి సమీపము కావాలంటే, మేము ఏమి చేయాలి?' అని అడుగుతారు. అప్పుడు నేను వారికి జవాబుగా, 'సహోదరీలారా, దేవుని వాక్యమును ఎక్కువగా చదవండి. మనము దేవునిని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి అది మాత్రమే ఏకైక మార్గమై యున్నదని' చెబుతాను.
అదేవిధముగా, బైబిల్‌లో చూచినప్పుడు, శారయికి దాసిగా ఉన్న హాగరు పారిపోతున్నప్పుడు, దేవుడు ఆమె వైపునకు చూచియున్నాడు. అప్పుడు, దేవుని దూత ఆమెను చూచి, యెహోవా దూత అరణ్యములో నీటిబుగ్గ యొద్ద, ఆమెను కనుగొని, 'శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నాననెను.' అప్పుడు యెహోవా దూత, ' నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుము మరియు నేను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని ఆమెతో చెప్పెను.' ప్రభువు తన కుమారుడు భవిష్యత్తులో ఏలాగున ఉండబోవుచున్నాడో కూడా తెలియజేసియున్నాడు. ఆమె అరణ్యములో కూడా ప్రభువును చూచి యుండెను. అందుచేతనే, ఆదికాండము 16:13లో చూచినట్లయితే, "అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను'' ప్రకారం హాగరు అరణ్యములో దేవుని చూచినట్లుగా మనము ఈ సందర్భములో చూడగలుగుచున్నాము. ప్రభువు హాగరును గురించి ఎంతగానో శ్రద్ధకలిగియున్నాడు. తన యొక్క ఆవేదన, దుఃఖమయమైన స్థితిని ఆయన గమనించాడు. ప్రభువు హాగరునకు ప్రత్యక్షమయ్యాడు. అరణ్యములో ఆమె ఎక్కువగా దేవుని గురించి గుర్తెరిగి యుండెను. అందుచేతనే ఆమె దేవునికి ఒక క్రొత్త పేరును పెట్టియున్నది. ఆమె ఏమని చెప్పననగా, 'ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా' అనెను.
అవును, నా ప్రియులారా, యెహోవా నామము బలమైన దుర్గమై యున్నది. దేవుడు గనుక హాగరునకు ప్రత్యక్షముకాకపోయినట్లయితే, ఆమె తన జన్మస్థలమైన ఐగుప్తునకు వెళ్లిపోయి ఉండేది. ఆమె దేవునిని కోల్పోయి ఉండవచ్చునేమో. అయినప్పటికిని, దేవుడు ఆమెకు ప్రత్యక్షమై, మరల ఆమెను వెనుకకు తీసుకొని వచ్చాడు. నా ప్రియమైన స్నేహితులారా, అదే దేవుడు మీకును కూడా ప్రత్యక్షమవుతాడు. యెహోవా నామము బలమైన దుర్గమై యున్నది. నీతిమంతులు అందులోనికి పరుగెత్తి, సురక్షితముగా ఉంటారు. పాతనిబంధన గ్రంథములో చూచినట్లయితే, 'దేవుని నామము' అని చెప్పబడియున్నది. కానీ, క్రొత్త నిబంధన గ్రంథములో చూచినట్లయితే,అది 'యేసు యొక్క నామముగా' చెప్పబడియున్నది. అందుకే బైబిల్‌లో మత్తయి సువార్త, 1:23లో వాక్యము ఈలాగున సెలవిచ్చుచున్నది, " ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును, వారు ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.'' అదేవిధముగా, మత్తయి సువార్త, 1:21లో వాక్యము ఈలాగున సెలవిచ్చుచున్నది, " తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.'' అవును, యేసు యొక్క నామాన్ని పిలుచుట మనకు ఎంత గొప్ప ధన్యతయో కదా! ప్రభువు నామమును పిలిచే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుదురు. అవును, ప్రభువు బలమైన నామమును కలిగియున్నాడు. ఆయన నామము గొప్పది మరియు శక్తివంతమైనది. కనుకనే, నేడు ప్రభువు మిమ్మును యేసు నామములోనికి పరుగెత్తునట్లుగా చేయును. అప్పుడు మీరు సురక్షితముగా ఉండెదరు. యేసు నామములోనికి పరిగెత్తుటకు మరియు ఆయనలో భద్రతను కనుగొనుటకు ప్రభువు మిమ్మును నడిపించును గాక. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా ఆయన నామము మిమ్మును రక్షించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ నామములో సురక్షితముగా ఉండాలి. దేవా, మేము నిన్ను తెలుసుకొనుటకును మరియు చూచుటకు ఎదురు చూచుచున్న మా మీదికి నేడు నీ యొక్క పునరుత్థానపు శక్తి దిగివచ్చునట్లుగా చేయుము. తండ్రీ, నీ నామమును మేము ఆశ్రయం మరియు బలాన్ని పొందగలిగే బలమైన దుర్గముగా ఉండునట్లుగా చేయుము. దేవా, దయచేసి నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మరియు నీ నామమునకు మొఱ్ఱపెట్టుట ద్వారా మిమ్మును మరింత లోతుగా తెలుసుకోవడంలో మాకు సహాయం చేయుము. ప్రభువా, హాగర్‌ను ఆమె అరణ్యంలో నీవు చూసినట్లుగానే, మా పోరాటాలలో మమ్మును దయతో చూడుము మరియు నీ ఉద్దేశ్యం వైపు మమ్మును నడిపించుము. దేవా, మా నిరుత్సాహ సమయములలో మాకు ప్రత్యక్షపరచబడునట్లుగాను, మమ్మును చూచే దేవునివిగా నీవు మాతో ఉండి మమ్మును దీవించుము. యేసయ్యా, నీ యొక్క శక్తివంతమైన నామాన్ని విశ్వసించడానికి మమ్మును నడిపించుము. యేసయ్యా, అన్ని నామములకంటె పై నామముగా నీ నామము ఉన్నందుకై నీకు వందనాలు. మరియు నీవు మా పట్ల ఇమ్మానుయేలుగా ఉన్నందుకు మరియు నీ కృప ద్వారా మమ్మును రక్షించుము. దేవా, మేము భద్రత కొరకు మేము ఎల్లప్పుడూ నీ యొద్దకు పరుగెత్తునట్లు కృపను దయచేయుము. ప్రభువా, మేము సురక్షితముగా ఉండునట్లుగా నీ బలమైన దుర్గమైన నీ నామములోనికి మేము పరుగెత్తుకొని వచ్చునట్లు మమ్మును మార్చుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.