నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 20:11వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడై యున్నాడు... ’’ అని చెప్పబడినట్లుగానే, ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటాడు. ప్రవక్తయైన యిర్మీయా ఈ మాటలు పలికిన దినములలో ఏమి జరిగింది అని చూచినట్లయితే, యిర్మీయా గ్రంథమును మనము చదివినట్లయితే, ప్రభువు అతనితో చెప్పిన ఎన్నో విషయాలను అతడు ప్రవచించుచుండెను. వినడానికి అనేక మందికి అవి వినసొంపుగా ఉండేవి కావు. ఎందుకనగా, వారు దేవుడు చెప్పుచున్న మాటలు వినకుండా వారి పాపాలలోనే ఆనందించుచుండిరి. దేవుని ఆజ్ఞలను వారు పాటించడము లేదు. దేవుని ఆలయములో ఒక ముఖ్య అధికారి ఉండేవాడు. అతని పేరు పషూరు. ఈ ప్రవచనములన్నియు అతడు విన్నప్పుడు, యిర్మీయాను పారద్రోలాలి అని అనుకున్నాడు. కాబట్టి, అతనిని వేదించాడు, కొట్టించాడు, అవమానించాడు. అయితే, ఇవన్నియు ఉన్నప్పటికిని, ఈ వేదన అంతయు సహించుచు, యిర్మీయా ఈలాగున పలికాడు, ‘‘ అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడై యున్నాడు. ఆయన పేరు యెహోవా ’’ అని అందరి యెదుట ఆయన ధైర్యంగా ప్రకటించాడు. 

అదేవిధముగా, నా ప్రియులారా, మీ గృహములో లేక మీ పని స్థలములో, లేక మీ చదువులలో నేను సరైనది చేయుచున్నాను అని అంటున్నారేమో? దేవుని దృష్టిలో నేను సరియైనది మాత్రమే చేయుచున్నాను. కానీ, నన్ను ఎందుకు వేదిస్తున్నారు? నేనెందుకు పారద్రోలబడుచున్నాను, నాకు రావలసిన మంచి పేరు, ఎందుకు రాలేదు అని తలంచుచున్నారేమో? అయితే, అటువంటి పరిస్థితులలో కూడా, ‘‘ పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడై యున్నాడు’’  అని ధైర్యముగా యిర్మీయా వలె ప్రకటించండి. 

నా ప్రియులారా, ప్రవక్తయైన యిర్మీయా ఆలాగున ప్రకటించినప్పుడు, ఏమి జరిగింది? ప్రభువు అతనితో కూడ ఉండడము మనము చూడగలము. అతని యొక్క యుద్ధమును ప్రభువే చేశాడు. యిర్మీయాను భద్రముగా కాపాడాడు. అద్భుతాల ద్వారా దేవుడు, ‘నేను నీతో కూడా ఉన్నాను,’ అని యిర్మీయాకు కనపరచుకున్నాడు. యిర్మీయా చెప్పిన ప్రవచనమంతయు కూడా ఆలాగుననే జరిగింది. యిర్మీయా ఏమైతే ప్రవచించాడో, అవన్నియు తప్పకుండా జరిగాయి. తద్వారా, ప్రభువు అతనితో ఉన్నాడు అని ఋజువుపరచబడినది. 

అవును, నా ప్రియ స్నేహితులారా, పరాక్రమముగల శూరుని వలె దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఒకవేళ మీరు బాధపడుచున్నారేమో? మీరు అన్ని విధాలుగా అవమానింపబడుచున్నారేమో? మీరు హింసింపబడుచున్నారా? కానీ, ప్రభువు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఎందుకనగా, ఆయన సాధారణమైన సైనికుడు కాదు, పరాక్రమముగల శూరుడు. ఆయన మీతో కూడా ఉన్నాడు. ఆయనే మీ యుద్ధములన్నిటిని చేస్తాడు. కాబట్టి, ఎప్పుడు మీ తలను క్రిందికి దించుకొనకండి. ఎందుకంటే, ప్రభువు మీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. కనుకనే, ధైర్యముగా మీరు ముందుకు సాగండి, యిర్మీయా వలె ఆయన మాటలకు లోబడి జీవించినప్పుడు నిశ్చయముగా, మీ పక్షమున నిలిచి యుద్ధము చేస్తాడు. కనుకనే, ఈ వాగ్దానమును బట్టి, ఆయనకు వందనాలు చెల్లించండి,  నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
కృపామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు పరాక్రమముగల శూరుని వలె నీవు మాతో కూడా ఉండుము.  దేవా, మా ఉద్యోగ స్థలములోను, మా వ్యాపారములోను, మా గృహములో, మా పాఠశాల, కళాశాలలో మా పట్ల  నీతి న్యాయములను జరిగించుము. ప్రభువా, నీవే మా పక్షమున యుద్ధము చేయుచున్నట్లుగా, మా శత్రువులు చూచునట్లుగా, నీవు మా ప్రక్కన నిలిచి,  మా ప్రతి యుద్ధమునకు విజయమును అనుగ్రహించి, నీవు మాతో ఉన్నవని మా శత్రువులకు కనుపరచుము. ప్రియమైన ప్రభువా, ఈ రోజు, మేము భారముతో నిండియున్న హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మేము నీతిమంతులుగా జీవించడానికి, నీ మార్గాలలో నడవడానికి మరియు నీ దృష్టిలో సరైనది చేయడానికి ప్రయత్నించాము. అయినప్పటికి, మేము వ్యతిరేకతను, తిరస్కరణను మరియు బాధను ఎదుర్కొంటున్నాము. కానీ ప్రభువా, నీవు ఒక పరాక్రమము గల శూరుని వలె మాతో ఉన్నావని నీ వాగ్దానం ద్వారా ఆదరణను, ధైర్యమును పొందుకొనుచున్నాము. దేవా, మా బాధను, మా పోరాటాలను మరియు మా యుద్ధాలను మేము నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. యేసయ్యా, మా యొక్క ప్రతి తుఫానుల ద్వారా మమ్మును భద్రంగా కాపాడుతూ, సురక్షితముగా నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు ఒక పరాక్రమముగల శూరుని వలె మాతో ఉన్నావని మేము ధైర్యంగా విశ్వాసంతో ప్రకటించుచున్నాము. ప్రభువా, ఈ వాగ్దానానికై వందనాలు చెల్లించుచు, మేము దానిని అంగీకరించుచున్నాము, దానిని మేము స్వంతం చేసుకొని, ఆ వాగ్దానమును పట్టుకొని ముందుకు నడవడానికి మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.