నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ నుండి ఈ రోజు మనం 2 పేతురు 1:2,3వ వచనములను ప్రతిబింబింపజేయుచున్నది, ఆ వచనము ఈలాగున సెలవిచ్చుచున్నది, ‘‘తన మహిమనుబట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక’’ ప్రకారము దేవుని యొక్క శక్తి ద్వారా మనము సమస్తమును ఆయన యొద్ద నుండి పొందుకొనుచున్నాము. ఈ ప్రయాణంలో మొట్టమొదటి అడుగు ఏమనగా, దేవుని గురించిన జ్ఞానాన్ని పొందునట్లుగా చేస్తాడు. చివరికి, ఆయన తన మహిమను మరియు శ్రేష్ఠతను మనకు అనుగ్రహిస్తాడు. వీటన్నిటిని దేవుని యొద్ద నుండి మనం ఎలా పొందగలమని మీరు ఆశ్చర్యపోవచ్చును. దీనికి జవాబుగా బైబిల్‌లో ఫిలిప్పీయులకు 1:4వ వచనములో ఈలాగున వ్రాయబడి ఉన్నది. ఈ లేఖనము ద్వారా మనకు నిరీక్షణను కలిగిస్తుంది. అదేమనగా, ‘‘ మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను’’ అన్న వచనం ప్రకారము, మనలో సత్‌క్రియ చేయుటకు మన దేవునికి శక్తి కలదు. కనుకనే, ధైర్యముగా ఉండండి. 

ఆలాగుననే నా ప్రియులారా, దేవుడు మీ జీవితంలో తన సత్‌క్రియ చేయుటకు ఇప్పటికే ప్రారంభించియున్నాడు మరియు ఆయన దానిని సంపూర్తి చేస్తాడు. ఇంకను సమస్తమును మనకు అనుగ్రహించువాడై యున్నాడు. కొంతమంది, ‘ప్రభువా, నాకు పరిశుద్ధాత్మను మరి ఎక్కువగా దయచేయమని ప్రార్థించుచున్నారేమో?’ మరికొందరైతే, ఒకవేళ ‘ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించుమని’ ప్రార్థించుట నేను ఆలకించియున్నాను. అయితే, దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించియున్నాడు. దేవుని ద్వారా మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని యొద్ద నుండి మనము సమస్తమును స్వీకరించియున్నాము. అయినప్పటికిని, ఆయన దిగివచ్చి, మన హృదయములో ఆసీనుడై మన యొక్క విశ్వాసమును ఆయనే కట్టుచున్నాడు మరియు బలపరచుచున్నాడు. మనలో మన యొక్క విశ్వాసము అనునది, వృద్ధిచెందవలసి ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనకు ఈలాగున తెలియజేయుచున్నది, ‘‘ఆయన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడుగా ఉన్నాడు.’’ ఇంకను బైబిల్‌లో 1 పేతురు 5:10వ వచనమును మనము చూచినట్లయితే, ‘‘తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును’’ ప్రకారం ఆయనే మిమ్మును సంపూర్ణులనుగా చేసి స్థిరపరచి, బలపరుస్తాడను మాట వ్రాయబడియున్నది. కనుకనే, ఆయన మనలను సంపూర్ణులనుగా చేయుటకు స్థిరపరచి, బలపరుస్తాడు.   

నా ప్రియులారా, దేవుడు ఏదైన ఒక కార్యమును జరిగించినప్పుడు, ఆయన దానిని పరిపూర్ణముగా జరిగించువాడై యున్నాడు. దైవీకమైన పరిపూర్ణతనే, మహిమ లేక అత్యున్నతమైన శ్రేష్టత అని పిలుచుచున్నాము. హనోకు యొక్క జీవితమును చూచినట్లయితే, ఆదికాండము 5:24వ వచనములో హనోకు నమ్మకమైన వానిగా దేవునితో నడిచియున్నాడు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడు హనోకు జీవితములో కార్యములను సంపూర్ణము చేసియున్నాడు గనుకనే, మహిమాన్వితమైన సన్నిధి చేత అతడు నింపబడ్డాడు. చివరిగా, దేవుడు తనతో కూడా ఉండుట నిమిత్తమై పరలోకమునకు అతనిని కొనిపోయెను. అదేరీతిగా, బైబిల్‌లో చూచినట్లయితే, 2 కొరింథీయులకు 3:18వ వచనములో మనము చూచినట్లయితే, ‘‘మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.’’ ఆలాగుననే, నేడు మనము కూడా మహిమ నుండి మహిమలోనికి మరియు దేవుని యొక్క స్వారూప్యములోనికి రూపాంతరపరచబడుచున్నాము. హల్లెలూయా!

నా ప్రియులారా, ఇదంతయు కేవలం పరిశుద్ధాత్ముని శక్తి ద్వారానే సాధ్యము. పరిశుద్ధాత్మ అను వరములను స్వీకరించుటకు మనము ఏ మాత్రము కూడా యోగ్యులము కాదు. అయినప్పటికిని, ఆధ్యాత్మికంగా సకల విషయములను  మనము ఆనందించునట్లుగా, దేవుడు మనకు కృపాసహితునిగా అనుగ్రహించియున్నాడు. దేవుడు మనలను రాజులైన యాజక సమూహముగాను మరియు దేవుని ప్రజలనుగా తన ప్రత్యేకమైన స్వాస్థ్య జనాంగముగాను మనలను పిలుచుచున్నాడు. చివరిగా, సంపూర్ణముగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మన జీవితములో పరిపూర్ణమైనప్పుడు, మనము ఆయన ఏర్పరచుకున్న జనాంగమై యున్నాము. మన ద్వారా ఈ లోకములో ఉన్న లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా దేవుడు మనలను వినియోగించుకుంటాడు. అతి శ్రేష్టతను కలిగించు ఇట్టి ఆత్మ మీ మీదికి వచ్చును గాక. నేడు మీరు అతి శ్రేష్టమైన విధానమును కలిగించు ఆత్మ చేత మీరు నింపబడుదురు గాక. మీరు ఇంకను పరిశుద్ధులగుదురు గాక. అక్షరాల, మీరు ఆయన స్వారూప్యములోనికి రూపాంతరము చెందుదురు గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును తన అనుభవజ్ఞానములోనికి నడిపించి, సంపూర్ణులనుగా చేసి దీవించును గాక. 

ప్రార్థన:
కృపకలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మాకు జీవము మరియు దైవభక్తి కొరకు సమస్తమును అనుగ్రహించు నీ దైవీకమైన శక్తికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము నీ మహిమలో మరియు శ్రేష్ఠతలో నడుచునట్లుగా మా హృదయాన్ని నీ జ్ఞానంతో నింపుము. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచుము. ఎందుకంటే నీవు మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవై యున్నావు. కనుకనే, దేవా, నీవు ప్రారంభించిన దానిని సంపూర్తి చేస్తావని గుర్తెరిగియున్నాము, నీ పరిపూర్ణ క్రియలలో మేము నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. పరిశుద్ధాత్మ దేవా, మమ్మును ప్రతిరోజు నీ మహిమ నుండి మహిమకు క్రీస్తు స్వరూపంగా మార్చుము. ప్రభువా, హనోకు వలె, మమ్మును నీ మహిమాన్విత సన్నిధిలో నివసింపజేయుచూ, నీతో నమ్మకంగా హనోకు వలె నడుచునట్లుగా మాకు కృపను దయచేయుము. మా అనర్హతలో కూడా, నీవు మమ్మును ఏర్పరచుకొని, మమ్మును పిలిచియున్నావు మరియు కాబట్టి మేము నీ కృపకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మమ్మును ఇతరులకు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉపయోగించుము, నీ పవిత్రత మరియు ప్రేమను ప్రతిబింబించునట్లుగా మమ్మును మార్చుము. దేవా,మేము చేయుచున్న ప్రతిదానిలో నిన్ను మహిమపరచగలిగేలా శ్రేష్ఠతగల పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించుము. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి, నీ కొరకు వినియోగించు పాత్రగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు ఘనమైన మహిమ గల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.