నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:6వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో, " మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.'' నా ప్రియులారా, మీరు దేవుని ప్రణాళికలో ఒక పునఃరాలోచన కాదు; మీరు ప్రమాదవశాత్తుగా వచ్చినవారు కాదు. అందుకే బైబిల్‌లో రోమీయులకు 8:29వ వచనమును చూచినట్లయితే, "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను'' ప్రకారం నా ప్రియులారా, దేవుడు మీ పట్ల ఏదో నూతన ప్రణాళికలు కలిగియుండడము కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మీ జీవితములో సమస్తమును ప్రణాళిక బద్ధంగా సంకల్పించియున్నాడు. ఆయన ఉద్దేశము ప్రకారముగానే మీ పట్ల జరిగించుచున్నాడు. అదియుగాక, మీరు ఈ లోకములో ఏలాగున జీవించాలో, దానిని ఎరిగినవాడై యున్నాడు. తద్వారా దేవుడు మీ పట్ల ఎంత ప్రేమను కలిగియున్నాడు కదా!

నా ప్రియులారా, జగత్తు పునాది వేయబడక మునుపే తన ప్రేమలో దేవుడు మిమ్మును సృజించుకొని యున్నాడు. సంపూర్ణమైన ప్రేమ చేత నింపబడినవానిగా దేవుడు మిమ్మును సృజించుకొని యున్నాడు. మనము ఇవన్నియు కూడా తెలుసుకోవడము ఎంతో ప్రాముఖ్యముగాను మరియు మేలుకరముగా ఉంటుంది కదా. అయితే, దానిని విశ్వసించవలసియున్న బాధ్యతను మీ మీద ఉంచుచున్నాడు. దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు, కనుకనే మీరు విశ్వసించినట్లయితే, దేవుడు మిమ్మును జగత్తు పునాది వేయబడక మునుపే ఎరిగియున్నాడు అన్న ఈ సంగతిని మీరు విశ్వసించినట్లయితే, అప్పుడు మీరు కూడా నిందారహితులుగాను, పరిశుద్ధులుగాను ఉంటారని గుర్తెరుగుదురు. ఎందుకంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని యొక్క సృష్టిగా ఉన్నారు. కనుకనే, నేడు మీరు దేనినిమిత్తము చింతించకండి.

బైబిల్‌లో ఎఫెసీయులకు 2:8వ వచనములో చూచినట్లయితే, "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే'' ప్రకారము మనము దేవుని యందు విశ్వాసమును కలిగియున్నట్లయితే, మనము దేవునిలో భద్రపరచబడియున్నాము. మీరు మీ జీవితములో కష్టతరమైన సందర్భములను ఎదుర్కొనుచున్నప్పుడు, అత్యంత సుళువుగా, ' నేను ఎందుకు ఈ లోకములో జన్మించాను?' అన్నట్టుగా మీరు అనుకుంటుండవచ్చును. మీరు కష్టతరమైన సమయముల గుండా వెళ్లుచున్నప్పుడు మీరు చాలా సుళువుగా, 'అయ్యో, ఈ లోకములో నేనెందుకు పుట్టను? ' అని తలంచవచ్చును. కానీ, మీరు తన కొరకు ప్రత్యేకించబడినవారని దేవుడు మీకంటె ముందుగానే ఎరిగియున్నాడు. అయితే, మీరు ఎంతో ప్రత్యేకమైన వారుగా ఉన్నారని దేవుడు ఎరిగియున్నాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశమును కలిగియున్నాడు. బైబిల్‌లో చూచినట్లయితే, బాప్తిస్మమిచ్చు యోహాను జీవితము పట్ల ప్రభువు ఒక ఉద్దేశమును కలిగియున్నాడు. బైబిల్‌లో లూకా 1:14-17 వ వచనములను చూచినట్లయితే, యేసు ప్రభువు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఈలాగున తెలియజేయుచున్నాడు, "అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.'' అవును, దేవుడు యోహాను పట్ల ఒక చక్కటి ప్రణాళికను కలిగియున్నాడు. అందుకే, అతడు ఇంకను తన తల్లిగర్భములో పుట్టక మునుపే, అతని గురించిన సంగతులన్నియు చక్కగా ఆ యొక్క జీవగ్రంథములో వ్రాయబడియున్నవి. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప ప్రేమగలవాడు కదా!

అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మీ జీవితము పట్ల కూడా దేవుడు చక్కటి ప్రణాళికను కలిగియున్నాడు. అవును, జగత్తు పునాది వేయబడక మునుపే మీరు దేవునిచేత ఎంపికచేయబడి మరియు ఏర్పరచబడియున్నారు. అవును, మీరు దేవుని చేతి పనియై యున్నారు. మంచి కార్యముల కొరకై మీరు దేవుని యొక్క చేతిపనిగా ఆలాగున సిద్ధపరచబడియున్నారు. మనము అట్టికార్యముల యందు, నడుచునట్లుగా, దేవుడు ముందుగానే, ఆ రీతిగా సిద్ధపరచియున్నాడు. దేవుడు మీ గురించి ఎంతగా ఆలోచన చేయుచున్నాడు, దేవుడు మిమ్మును ఎంతగానో ఎరిగియున్నాడు కదా. దేవుడు మీ పక్షమున ఎంత ప్రేమను కలిగియున్నాడు కదా! ఆయన మిమ్మును చూచి, "మీరు నాకు స్వకీయ స్వాస్థ్యసంపాద్యమైన నిధి వంటివారగుదురు, మీరు నా ద్వారా ఏర్పరచుకొనబడియున్నారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గానీ, నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను. తద్వారా, మీరు అధికముగా ఫలములను ఫలించునట్లుగా నేను మిమ్మును ఏర్పరచుకొని యున్నాను'' అని సెలవిచ్చుచున్నాడు. అవును, నా ప్రియమైన స్నేహితులారా, దేవునికి మీ జీవితము పట్ల ఒక ఉద్దేశమును కలిగియున్నాడు. ఆ ఉద్దేశమును మీరు గుర్తించాలంటే, మీరు కేవలం, దేవుని యందు మాత్రమే విశ్వాసముంచండి, దేవుని చెంతకు రండి, ఆయన సన్నిధికి సమీపముగా వచ్చినప్పుడు, ఆయన మీకు సమీపముగా వస్తాడు. మీ పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశమును తప్పకుండా నెరవేర్చి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఆశీర్వదిస్తాడు.

ప్రార్థన:
మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, జగత్తు పునాది వేయబడక మునుపే మమ్మును నీవు ఎన్నుకున్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రియ ప్రభువా, నీవు మాతో మాట్లాడినట్లుగా, నీవు మా పట్ల ఒక ఉద్దేశమును కలిగియున్నావు. కనుకనే, ఆ ఉద్దేశమును నీవు మా పట్ల నెరవేర్చుము. దేవా, నీవు మా మేలు కొరకు ప్రణాళికను కలిగియున్నావని మేము నమ్మునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము అణిచివేతకు గురియైనది ఇక చాలు, ఇప్పుడే, నీ చెయ్యి పట్టి మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మేము నీ చేతి పనియై ఉన్నామని గుర్తించునట్లుగా అటువంటి కృపనిమ్ము. దేవా, నీవు మా పట్ల కలిగియున్న ఉద్దేశమును నీవు నెరవేర్చువరకు మమ్మును విడువకుండా, మమ్మును నడిపించుము. యేసయ్యా, నీ ప్రేమ కొలవలేనిది మరియు మా పట్ల నీ ప్రణాళికలు పరిపూర్ణమైనవి. యేసయ్యా, నీ ప్రేమలో మేము నీ యెదుట నిర్దోషులముగాను, పరిశుద్ధంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, నీకు ప్రత్యేకమైనవారమని మాకు గుర్తు చేయుము. ప్రభువా, బాప్తిస్మమిచ్చు యోహాను పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నట్లుగానే, మా కొరకు నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందనియు, మేము నీ యొక్క చేతి పనియై యున్నామనియు, మంచికార్యాలు చేయడానికి మేము యేసులో సృష్టించబడియున్నామనియు నమ్మునట్లుగా మాకు నీ కృపనిమ్ము. దేవా, మేము ఎక్కువగా నీలో ఫలించునట్లుగాను మరియు మేము చేయు ప్రతి పనిలో నీ నామాన్ని మహిమపరచునట్లుగా చేయుము. ప్రభువా, మేము నిన్ను హృదయపూర్వకంగా వెదకుచూ, నీకు సమీపముగా వచ్చినప్పుడు, నీవు మాకు సమీపముగా రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.