నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 22:16వ వచనమును తీసుకొనబడినది. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. ఈ వచనములో, "...కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక '' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ ముందున్న పనులను మీరే చేపట్టాలా? వద్దా? అని మీరు భయపడుచున్నారా? ఇంకను మీ యొక్క కుటుంబ విషయాలను గురించి ఆందోళనలు మీ మనసును ఆవరించుచున్నాయా? మీ వ్యాపారము పట్ల తీసుకొనబోవు నిర్ణయాలను గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? మీ చదువులలో, ఉద్యోగంలో లేదా కుటుంబ జీవితంలో, మీ భవిష్యత్తు కొరకు తీసుకోవలసిన కార్యములను గురించి మీరు గందరగోళంగా భావిస్తున్నారా? ఈ రోజు ప్రభువు మీతో మాట్లాడుచున్నాడు: 'మీరు లేచి, ముందుకు సాగి వెళ్లండి, మీ ముందున్న పనిని చేయుటకు పూనుకొనుము, యెహోవా మీకు తోడుగా ఉండును గాక!' అవును, ప్రభువు మీకు తోడుగా ఉన్నందువలన, ఆయన మీ చేతిపనిని ఆశీర్వదించి, మీరు చేయు ప్రతి పనిని సఫలము చేస్తాడు. మీ అడుగులు ఆయనచేతనే దైవీకంగా ఆదేశించబడియుంటాయి. కనుకనే, ధైర్యంగా మీరు ముందుకు సాగండి.

బైబిల్‌లో, మనము 1 సమూయేలు 14:45వ వచనములో యోనాతాను గురించిన ఒక సంఘటనను మనకు తెలియజేయుచున్నది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధం చేయుచున్నప్పుడు, సౌలు రాజు సైన్యాన్ని నడిపించినప్పటికిని, భయం అతని సైనికులను పట్టుకుంది, కనుకనే, వారు పారిపోయారు. కానీ, సౌలు కుమారుడైన యోనాతాను దృఢంగా నిలబడ్డాడు. అతను ఇలా అన్నాడు, "యోనాతానుఈ సున్నతిలేని వారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టానుసారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.'' అవును, తాను ఒంటరివాడు కాదని యోనాతానుకు నిశ్చయంగా తెలుసు. ఎందుకనగా, దేవుడు అతనితో కూడా ఉన్నాడు. ప్రభువు శక్తిపై అతడు నమ్మకం ఉంచి, అతను తన ఆయుధ ధారుని తీసుకొని ముందుకు వెళ్ళాడు. ఇద్దరు పురుషులు బలమైన సైన్యాన్ని ఎదుర్కొన్నారు, అయినప్పటికిని, దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. వారు ఇరవై మందిని మాత్రమే చంపారు. కానీ, ప్రభువు మహా భయకంపము పంపాడు, దానితో శత్రువులు గందరగోళానికి గురయ్యారు. ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొన్నారు మరియు ఇశ్రాయేలీయులు గొప్ప విజయాన్ని చూశారు.

నా ప్రియులారా, ప్రజలు దీనిని చూసి, 'యెహోవా యోనాతానుకు తోడుగా ఉన్నాడు, కనుకనే, యోనాతాను ఆ పని చేసాడు ' అని ప్రకటించారు. కనుకనే, నేడు మీరు ఏమి చేయాలో తెలియక, సందేహంలో కూర్చోకండి, మీరు ఆయనను అడుగుతూ ఉండండి, 'నేను అభివృద్ధి చెందుతానా? నేను విజయం సాధిస్తానా?' అయితే, సౌలు వలె విడిచి పారిపోకండి, పరిత్యాగం లేదా ఓటమికి భయపడకండి. ఈ లోకం మీ మార్గంలో మీకు విరోధముగా అడ్డంకులు విసిరివేయవచ్చును. కానీ, యోనాతాను వలె స్థిరంగా నిలబడి, ధైర్యంగా ప్రకటించండి, 'యేసు, మాకు ముందుగా వెళ్లుచున్నందుకు వందనాలు! యేసయ్యా, నీవే మా మార్గం. యేసు, పరిశుద్ధాత్మ ద్వారా మాలో మరియు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీవే మా బలం మరియు మా సత్యం. ప్రభువా, మా వెనుక కాపలాదారుడిగా ఉన్నందుకు వందనాలు. మేము నీ నామమున వెళ్లి చదువుతాము. నీ నామమున వెళ్లి పని చేస్తాము. మా కుటుంబమును నడిపించుటకు నీ నామమున వెళ్లుచున్నాము. ఇతరులకు పరిచర్య చేయుటకు నీ నామమున వెళ్తాము. నీవు మాతో ఉన్నావు!' అని ధైర్యంగా చెప్పండి మరియు ఇటువంటి వాంఛతో ముందుకు సాగిపోండి! అప్పుడు మీరు లేచి, మీ పని పూనుకొన్నప్పుడు, యెహోవా మీకు తోడుగా ఉంటాడు, ప్రభువు మీ పక్షమున సమస్తమును పరిపూర్ణము చేస్తాడు. ఆయన మీ చేతుల పనిని ఆశీర్వదిస్తాడు మరియు మీ వ్యాపారములోను, పనులలోను, చదువులలోను మీరు ఇస్సాకువలె, నూరు రెట్లు ఆశీర్వాదము పొందుకుంటారు. కనుకనే నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహా కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క వాగ్దానాల పట్ల పూర్తిగా నమ్మకంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, నీవు మాకు మార్గదర్శిగాను, బలంగాను, నిత్య సహాయంగాను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మా జీవితములో కలుగు భయాలు, సందేహాలు మరియు ఆందోళనలను నీ బలమైన చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువా, మా ముందు ఉంచబడిన పనిలో మమ్మును నడిపించుము మరియు నీ చిత్తం మా పట్ల నెరవేరునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా చేతుల పనిని ఆశీర్వదించుము మరియు మేము తీసుకొనుచున్న మా నిర్ణయాలన్నింటిలోను నీవు మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించుము. దేవా, నీవు మా కొరకు సిద్ధపరచిన మార్గంలో ధైర్యంగా ముందుకు నడవడానికి మమ్మును నీవు ధైర్యముతో నింపుము. ప్రభువా, నీ సన్నిధి మాకు ముందుగా వెళ్లునట్లుగాను, మా వంకర మార్గములను సరాళముగా చేయుము. యేసయ్యా, నీ నామమున మేము లేచి, ముందుకు సాగి వెళ్లుటకును, ఇప్పటికే నీవు మాకు ఇచ్చిన విజయాన్ని మేము పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీ కుమారుడైన యేసు ప్రభువు యొక్క శక్తివంతమైన నామమున మేము ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొనునట్లుగాను మరియు నీకే సమస్త స్తుతి ఘనత మహిమ చెల్లించుటకు నీ దయను మా పట్ల కనుపరచుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.