నా ప్రియ సహోదరీ, సహోదరులారా, నేడు బైబిల్ నుండి కీర్తనలు 122:7వ వచనము నుండి అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానము కలదు. ఆ వచనము, "నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక'' ప్రకారం నేడు మీ ప్రాకారములలో నెమ్మదిని కలుగజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. ఈ కీర్తనలో దావీదు రాజు, యెరూషలేమును ప్రేమించే యాత్రికులను యెరూషలేము నగరము క్షేమము కొరకు ప్రార్థించమని ప్రోత్సహించాడు. మనము ఎందుకు యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి? యెషయా 62:4 వ వచనములో చూచినట్లయితే, "విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును'' ప్రకారం అది యెహోవా దేవునికి ఆనందమును కలుగజేయుచున్న పట్టణముగా ఉన్నదని మనకు వాక్యము స్పష్టము తెలియజేయుచున్నది. ప్రభువు ఆ పట్టణమును, "నా ఆనందము దాని యందు ఉన్నది, అని అర్థము ఇచ్చు హెప్సీబా అనే పేరుతో పిలుచుచున్నాడు. '' ఇంకను యేసయ్యా, పుట్టినటువంటి ప్రదేశము యెరూషలేము. యేసు పరిచర్య చేసి, ఆయన సిలువ వేయబడ్డాడు, మరల మూడవనాడు ఆయన పునరుత్థానమును పొందియున్న స్థలము. యెరూషలేము ప్రపంచ కేంద్రమై ఉంటుంది. ఎందుకనగా, ఆయన మరల ఈ లోకమునకు వచ్చినప్పుడు, యెరూషలేములోనే అడుగుపెడతాడు. అందుకే మనము యెరూషలేమునకు ప్రాముఖ్యతను ఇచ్చుచున్నాము.

ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయులు యెరూషలేమును వారి రాజధానిగా చెబుతుంటారు. కాబట్టి, యెరూషలేము ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయుల యుద్ధము జరుగు స్థలముగా పిలుచెదరు. యెరూషలేముపై 52 సార్లు దాడులు జరిగియున్నాయి. ఆ పట్టణము 2 సార్లు నాశనము చేయబడినది. కనుకనే, గొడవులు, యుద్ధాలు అన్నియు కూడా ఆగిపోయి, యెరూషలేములో ఉన్న ప్రజలు సమాధానముతో నివసించాలని మనము ప్రార్థన చేయాలి. ఎలాగున ప్రార్థించాలి అనగా, సమాధానకర్తయగు అధిపతియైన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము సమాధానము కొరకు ప్రార్థించాలి. ఆలాగుననే, కీర్తనలు 122:6వ వచనములో మనము చూచినట్లయితే, " యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు'' అని చెప్పబడిన ప్రకారం మనము యెరూషలేమును ప్రేమించి, యెరూషలేము సమాధానము కొరకు ప్రార్థించినప్పుడు, మనలను కూడా దేవుడు వర్థిల్లింపజేస్తాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఒకరినొకరు "షాలోం'' అని పలుకరించుకుంటారు. 'షాలోం' అనగా, సమాధానము అని అర్థము. యేసయ్య, అనేకసార్లు అద్భుతములు చేసిన తర్వాత, అనేకసార్లు, "నీవు సమాధానముతో వెళ్లుము'' అని చెప్పుచున్నట్లుగా మనము బైబిల్ గ్రంథములో చూడగలము.

ఒకసారి, పండ్రెండు సంవత్సరములుగా రక్తస్రావపు వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ, యేసయ్య, వస్త్రపు చెంగును విశ్వాసముతో ముట్టుకున్నప్పుడు, ఆమె విశ్వాసము వలన ఆమె బాగుపరచబడినది. బైబిల్‌లో మార్కు 5:34వ వచనములో చూచినట్లయితే, యేసు ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.'' ఆలాగుననే, యేసయ్య, తన శిష్యులతో కూడా ఏమని చెప్పెననగా, మీరు ఏ గృహమునకు వెళ్లినను కూడా, మొదటగా ఆ గృహమునకు సమాధాన వచనమును పలుకమని చెప్పెను. యెరూషలేములో ఉన్న ప్రజలు సమాధానమును కలిగియుండుటకు ఇష్టపడతారు. అందుకే యెరూషలేము సమాధానము మరియు క్షేమము కొరకు ప్రార్థించాలి. యెరూషలేము పట్టణములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును కలిగి ఉండడానికి ఎంతో దీవించబడినవారముగా ఉన్నాము. దేవుని పట్టణమై యున్న యెరూషలేములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము ఉండటము నిజముగా ఎంత దీవెనకరముగా ఉంటున్నది కదా. ఇశ్రాయేలు ప్రార్థన గోపురములో ప్రార్థన యోధులు 24 గంటలు యెరూషలేము పట్టణములోనికి చూస్తూ, ఆ పట్టణము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థించడము మాత్రమే కాదు, వారు ప్రవచిస్తారు కూడా. అందుకే ఈ రోజు యేసు పిలుచుచున్నాడు పరిచర్యను దేవుడు ఎంతగానో ఆశీర్వదించియున్నాడు. నా ప్రియులారా, ప్రభువు నేడు మిమ్మును కూడా వర్థిల్లింపజేయును గాక. ప్రభువు మీకు మరియు మీ కుటుంబమునకు కూడా సమాధానము ఇచ్చును గాక. ఇంకను మీ ప్రాకారములలో మీకు నెమ్మది కలుగును గాక. మీ నగరులలో క్షేమము, వర్థిల్లత ఉండును గాక. ఇంకను నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్కు చేత మేము క్షేమాభివృద్ధి పొందియుండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రియ తండ్రీ, మా జీవితంలో సమాధానము మరియు క్షేమమును కలుగజేయుము. దేవా, ఇప్పుడు కూడా, నీవు ఎంచుకున్న నగరమైన, నీవు ఆనందించే పట్టణమైన యెరూషలేమును గురించి మేము వేడుకొనుచున్నాము. ప్రభువా, యెరూషలేములో నీ యొక్క సమాధానము శాంతి, దాని నగరులలో క్షేమము, వర్థిల్లత ప్రతి ఇంటిని నింపునట్లుగా చేయుము. దేవా, విభజన ఉన్న చోట బాధ మరియు ఐక్యత ఉన్న చోట స్వస్థతను తీసుకురమ్ము. ప్రభువా, దాడులు మరియు యుద్ధములకు అంతమును కలిగించి, నిత్యమైన సమాధాన నిబంధనను కలిగించున ట్లుగా ప్రార్థించుచున్నాము. దేవా, సమాధానకర్తయైన యేసు సన్నిధితో ఆ పట్టణమును నింపునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాక్యంలో వాగ్దానం చేసినట్లుగానే, యెరూషలేమును ప్రేమించి దానిని సమాధానమును కోరుకునే మమ్మును వృద్ధి చేయుము. దేవా, మా హృదయాలు విశ్వాసంతో నీ వైపుకు తిరుగునట్లుగాను మరియు బాధ నుండి విడుదలను పొందునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, హృదయంలో మరియు మా గృహములలోను మేమము సాటిలేని సమాధానమును మరియు సమృద్ధియైన క్షేమమును, వర్థిల్లతను మేము అనుభవించునట్లు మాకు నీ కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.