నా ప్రియమైన సోదరీ, సోదరులారా, నేడు బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:10వ వచనములో అద్భుతమైన వాగ్దానమును మనము ధ్యానము చేయబోవుచున్నాము. ఆ వచనములో చెప్పబడిన మాట ఏదనగా, మనము దేవుడు చేసిన పనియై ఉన్నాము. అందుకే ఆ వచనములో మనము చూచినట్లయితే, "మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము'' అని వ్రాయబడియున్నది. మరియొక అనువాదములో చూచినట్లయితే, గొప్ప నైపుణ్యముతో సృజింపబడియున్న కళాఖండముగా పిలువబడుచున్నాము. మనము అత్యంత శ్రద్ధ వహించినవారముగా ఉన్నాము. గ్రీకులో మనము దానిని గమనించినట్లయితే, మనము దేవుని యొక్క కావ్యముగా చెప్పబడుచున్నాము. నిజంగా మనము కావ్యాన్ని రచించుచున్నప్పుడు, దాని పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాము కదా! ఇంకను ఒక కావ్యమును రచించుటకు మనము ఎంతో ఖర్చు చేస్తాము. మనం దానిని మెరుగుపరచడానికి ఎంతో సమయమును వెచ్చిస్తాము, ప్రతి పదాన్ని సరిగ్గా వచ్చే వరకు సంపూర్తి చేస్తాము కదా. మనం దానిని అసంపూర్ణంగా విడిచిపెట్టము కదా, అవునా? మనము దేవుని కృపకు మరియు ఆయన ప్రేమకు సంబంధించియున్న గ్రంథమై ఉన్నాము. అవును, ఎంతో గొప్ప ప్రేమతో మనలను దేవుడు సృజించియున్నాడు. దేవుడు మాత్రమే అట్టి కావ్యమును రచించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఆలాగున చేయుటకు మరి ఎవరికి కూడా అధికారము ఇయ్యలేదు.
మా యొక్క తల్లిగారు, తాను యౌవన ప్రాయములో ఉన్నప్పుడు, ఆమె బుట్టలు అల్లిక చేయుచుండేవారు. ఆమె అన్నియు కూడా సంపూర్ణంగా చేయాలని కోరుకునే ఒక వ్యక్తిగా ఉండేవారు. ఈ రోజున ఆమె భూమి మీద మనతో కూడా సజీవంగా లేరు. ఆమె దానిని ఎటువంటి లోపము లేకుండా, పరిపూర్ణముగా ఉండవలెనని కోరుకునేవారు. కనుకనే, దానిని మేము ఎవ్వరము కూడా తాకడానికి మాకు అనుమతించేవారు కాదు. నేను మాత్రమే ఆ అల్లిక పనిని సంపూర్తి చేస్తాను అని చెప్పేవారు. ఎంతో ప్రేమతో మరియు జాగ్రత్తతో ఆమె ఆ బుట్టలను తయారు చేసేవారు. ఆమె అత్యంత శ్రద్ధతో ఆ బుట్టలను అల్లేవారు. చివరిగా అందమైన అల్లిక బుట్టగా అది బయటకు వచ్చేది. ఈ రోజు వరకు కూడా ఆమె యొక్క జ్ఞాపకార్థముగా ఆమె అల్లిన అందమైన బుట్టను మా యొద్ద దాచి ఉంచుకొని ఉన్నాము. అది చాలా పెద్ద సంచివలె కనబడుతుంది. అది మా యొక్క ప్రయాణము కొరకు ఆమె ఆ యొక్క బుట్టను అల్లిక చేశారు. అది చాలా అందముగా కనబడుచున్న ఒక సంచిగా ఉండెను. అది ఆమె యొక్క కళాకృతి మరియు కళాఖండమై ఉన్నది. ఆలాగుననే, నేడు మీరు కూడా దేవుని యొక్క చేతి పనియైన కళాఖండమై యున్నారు. కనుకనే, దేవుడు ఆరంభము నుండి అంతము వరకు శ్రేష్టమైన రూపములో తిరిగి మీకు అందించుటలో ఆయన రూపుదిద్దియున్నాడు. ఆయన మిమ్మును మరల తిరిగి చక్కని రూపములోనికి రూపుదిద్దునిమిత్తమై వివిధ ఉపకరణములను ఉపయోగించియున్నాడు. అవి, ఆయన యొక్క అమూల్యమైన వాగ్దానములను వినియోగించియున్నాడు. ఆయన యొక్క ఆత్మను, ప్రేమను, ఆయన ఇంకను అనేకమైన వనరులను మన నిమిత్తము వినియోగించియున్నారు. కేవలము, మనము కళాఖండము వలె తీర్చి దిద్దవలెననే ఆకాంక్షతోనే, ఇవన్నిటి ద్వారా మిమ్మల్ని ఆయన రూపొందించిన వారినిగా మార్చాడు.
నా ప్రియులారా, ఈ రోజున కూడా ఆయన మీ జీవితములో పనిచేయుచున్నాడు. దేవుడు మనలను ఉద్దేశము మీద నాటియున్న దేవుడు. తద్వారా, మనము అధికముగా ఫలించునట్లుగానే, ఆయన మన పట్ల వాంఛకలిగియున్నాడు. అందునిమిత్తము, ప్రభువుచేత నాటబడియున్న, నీతి యను మస్తకి వృక్షములని పిలువబడుచున్నాము. మీ జీవితము గమ్యము లేనిది కాదు. మీ జీవితమును సత్‌క్రియలు చేయడానికి కొరకు సంసిద్ధము చేయబడియున్నది. కానీ, మీరు అడగవచ్చును, 'ప్రభువా, నేను ఏలాగున నీ కొరకు పనిచేయగలను,' అని చెప్పినప్పటికిని, మీ జీవితములను ఆయనకు సేవ చేయడాని కొరకు ఒక ఫర్యాయమును ఆయన హస్తాలకు అప్పగించినప్పుడు, ఆయనే మీ జీవితములో మార్గములను తెరవజేస్తాడు. కనుకనే, మీరు ఆ యొక్క ద్వారము గుండా ప్రవేశించుటకు వెనుకంజ వేయకండి. ఎందుకంటే, మీరు ఉన్నతమైన ఉద్దేశము కొరకు సృజించబడియున్నారు. మీరు దేవునికి విధేయులై ఆయన నడిపింపును అనుసరించి, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రేరేపించబడి, దేవుడు ఉద్దేశించిన, సత్‌క్రియలన్నియు మీరు చేసినట్లయితే, ఆయన మీ పట్ల సంతోషిస్తాడు. బైబిల్‌లో మత్తయి 25:35,36వ వచనములలో చెప్పబడినట్లుగానే, "నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును.'' అవును, మీరు కూడా ఆ రీతిగానే జరిగించునట్లుగా దేవుడు మిమ్మును రూపుదిద్దుతాడు.
నా ప్రియులారా, అదేవిధంగానే, నేడు మీ జీవితమును దేవునికి సేవ చేయుటకు మీ హృదయములను సమర్పించుకొనినప్పుడు, ఆయన మిమ్మును బట్టి, ఎంతగానో ఆనందించు దేవుడై ఉన్నాడు. ఎందుకనగా, మీరు దేవుని యొక్క చేతి పనియై యున్నారు. మీరు సత్‌క్రియలను జరిగించుట కొరకు మాత్రమే, క్రీస్తు యేసునందు సృజించబడియున్నారు. కనుకనే, మీరు మౌనముగా ఉండకండి, మీరు పైకి లేవండి, మీ పూర్ణ బలముతో దేవుని సేవించం డి, మీ పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించండి. అప్పుడు మీరు నీతి యను మస్తకి వృక్షములుగా పిలువబడుదురు. మీరు ఫలవంతమైన వృక్షమువలె ఉంటారు. వివాహమునకు ముందుగా నేను దేవునికి సేవ చేయలేదు. కానీ, నేను ఆయనకు సేవ చేయుటకు నా హృదయమును సమర్పించుకున్నప్పుడు, నేను అనేకమంది ప్రజలకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాను. తద్వారా, దేవుని యొద్ద నుండి నాకు బహుమానములు వస్తాయని నాకు తెలుసు. నా ప్రియులారా, నేడు మీరు కూడా ప్రభువు కొరకు పని చేసినట్లయితే, మీరు నిశ్చయముగా అటువంటి గొప్ప బహుమానమును పొందుకొనెదరు. కనుకనే, నేడు మీరు ఆయనకు సేవను జరిగించుటకు ముందుకు వస్తారా? నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మమ్ము నీ కళాఖండంగా సృష్టించినందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, నీ ప్రేమతో మమ్మును రూపుదిద్దుము మరియు మా జీవితం నీ చేతులలోనికి సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీ పరిపూర్ణ ప్రణాళిక మరియు ఉద్దేశ్యం ప్రకారం మమ్మును మలచుము. దేవా, మమ్మును నీ ఆత్మతో నింపుము మరియు నీవు మా కొరకు సిద్ధపరచిన సత్‌క్రియలు చేయడానికి మమ్మును నడిపించుము. ప్రభువా, మాకు ఎన్నో ఫలములను ఇవ్వడానికి మరియు నీ నామానికి మహిమ తీసుకురావడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మాలో ఎటువంటి కపటము కానీ, అపరాధ భావముగానీ ఉండకుండా మమ్మును నీ బిడ్డలనుగా మార్చి, మా జీవితములో ఎటువంటి అంధకారము, మచ్చలు లేకుండా మమ్మును పరిశుద్ధపరచుము. దేవా, మేము నీ ఉద్దేశముల వినియోగించుకొను నిమిత్తము మాత్రమే, మా జీవితములను రూపాంతరపరచుము. దేవా, మేము ఫలభరితమైన వృక్షముల వలె ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీతియను మస్తకి వృక్షమువలె మార్చబడునట్లుగా అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. యేసయ్యా, నీవు కొరకు తెరిచిన ద్వారములు గుండా అడుగు పెట్టడానికి మాకు ధైర్యమును దయచేయుము. ప్రభువా, మా హృదయం అవసరంలో ఉన్నవారి పట్ల ప్రేమ మరియు కనికరముతో నిండి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మేము రక్షింపబడుట మాత్రమే కాదు, నీ కొరకు సేవ చేయుటకు మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మా పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతో నిన్ను సేవించుటకు కృపను దయచేయుము. ప్రభువా, ఇతరులకు సేవ చేయడానికి మరియు ఆశీర్వదించడానికి మమ్మును ఒక పాత్రగా ఉపయోగించుకొనుము. ప్రభువా, మాకు నిశ్చయమైన ప్రతిఫలం పరలోకంలో ఉందని తెలుసుకుని, ఎల్లప్పుడూ నీకు నమ్మకంగా ఉండటానికి మరియు జీవించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.