నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటకు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. నేడు మా నాన్నగారు డాక్టర్. పాల్ దినకరన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నందున ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినము. నేను మా నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను మరియు ఈ రోజు మా నాన్నగారితో కూడ వారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న ఎవరైనా సరే, వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. మీ అందరికి ఆనందకరమైన మరియు ఆశీర్వాదకరమైన పుట్టినరోజు కావాలని నేను మీ పట్ల ఆశించుచున్నాను!

నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 14:2వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.'' అవును, నేడు మీరు ప్రభువు దృష్టిలో ఎంతో విలువైనవారు. ఇంకను మీరు దేవునిచేత ఎన్నుకొనబడియున్నారు మరియు మీరు స్వకీయ సంపాద్యముగా ఉన్నారు. కనుకనే, దేవుడు తన స్వకీయ జనము అని ఎవరిని పిలుస్తాడు? బైబిల్‌లో నిర్గమకాండము 19:5వ వచనములో మనం చూడగలము, "కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు'' అన్న వచనం ప్రకారం ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించి, ఆయన నిబంధనను అనుసరించువారు ఆయన స్వకీయ జనము అని పిలువబడుచున్నారు.

కాబట్టి నేడు నా ప్రియులారా, మీరు ప్రభువునకు విధేయత చూపి, ఆయన చిత్తానుసారంగా ప్రతిదానిని చేసినప్పుడు, దేవుడు మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఉంచుకుంటాడు. ఆయన మిమ్మల్ని ఎంచుకున్నది. మీ నేపథ్యం, సంపద లేదా కీర్తి కారణంగా కాదు, ఆయన మిమ్మును ప్రేమించుచున్నాడు మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించు వారందరికి నమ్మకంగా ఉన్నాడని ద్వితీయోపదేశకాండము 7:9 వ వచనములో మనము చూడగలము. " కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను'' అని చెప్పబడియున్నది. యేసు తల్లి అయిన మరియ జీవితంలో మనం దీనిని చూడగలము. ఆమె ఏమి లేని దీనస్థితిలో ఉన్నప్పటికిని, ఆమె ప్రభువుచేత ప్రేమించబడినది. ఆమె దేవునికి ప్రియమైనదిగా ఉండెను. కనుకనే, దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, " ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను'' (లూకా 1:28,30) ప్రకారం అవును, ఆమె దేవుని దయను పొందియున్నదని ఆమెకు ఆ మాటలను తెలియజేశాడు. ఈ లోక రక్షకుని భూమి మీదికి తీసుకురావడానికి దేవుడు మరియ ఎవరో అని తెలియని వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే, ఆయన ఆమెను ప్రేమించాడు మరియు ఆమె పట్ల దయకలిగి ఉన్నాడు. కనుకనే, నేడు మీకు కూడ అటువంటి దయను కనుపరుస్తాడు.

ఈ రోజు, నా ప్రియ స్నేహితులారా, దేవుని దయ మీ పట్ల ఉన్నది. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించారు, కాబట్టి ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలు చేయడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. మీరు దీనిని మీ జీవితంలో, మీ పనిలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో మరియు మీ ఆధ్యాత్మిక జీవితంలో చూస్తారు. ఈ విషయాలన్నింటిలో మీరు గొప్ప అనుగ్రహాన్ని పొందియుండుట మీరు చూచెదరు. మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించినందున, మీరు ఆయనకు స్వకీయమైన జనముగా ఉన్నారు. కాబట్టి, ఆనందంగా ఉండండి! దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మును ప్రోత్సహించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మమ్మును ప్రేమిస్తున్నందున మరియు నీవు మమ్మును నీ కొరకు ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము అన్ని విషయాలలో నీకు విధేయత చూపడానికి మరియు నీ ఆజ్ఞలను అనుసరించడానికి మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. కనుకనే, దేవా, నీవు మమ్మును ఎక్కువగా ఆదరించి, మమ్మును నీ యొక్క స్వకీయ జనముగా పిలిచినందుకై మేము నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజు, మా జీవితంలోని అన్ని అంశాలలో మేము గొప్ప అభివృద్ధిని అనుభవించునట్లుగా సర్వసంపదలతో మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మా ప్రయత్నాలను, మా కుటుంబాన్ని, మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదించి మమ్మును నిత్యము నీకు స్వకీయ సంపాద్యముగా ఉండునట్లుగా నీకృపను మాకు దయచేయుము. యేసయ్యా, మేము నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞల ననుసరించి నడుచుకొనునట్లుగాను మరియు మా పట్ల నీ నిబంధనను స్థిరపరచి, వేయి తరముల వరకు మా పట్ల నీ యొక్క మహా కృపను మరియు దయను చూపుతావని మేము నీ యందు నమ్మిక యుంచునట్లుగా మా హృదయము మార్చుమని యేసు క్రీస్తు దయగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.