నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. బైబిల్ నుండి నేటి వాగ్దానముగా, కీర్తనలు 37:18వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును'' అన్న వచనము ప్రకారము మనము నిర్దోషులముగా జీవించాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. ఆలాగున ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు సదాకాలము మన మీద నిలిచి ఉంటాయి. కనుకనే, మీరు చింతించకండి.


బైబిల్ గ్రంథములో ఎంతో మంది నీతిమంతులు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండడము మనము చదవగలుగుతాము. యోబు వారిలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. యోబు 1:1-8వ వచనముల వరకు మనము చదివినట్లయితే, దేవుడే సాతానుతో యోబును గురించి సాక్ష్యము చెప్పుట మనము చూడగలుగుతాము. "ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు'' అని దేవుడు సెలవిచ్చియున్నాడు. ఇంకను కీర్తనలు 15:2వ వచనమును మనము చదివినట్లయితే, అటువంటి యథార్థవంతుల సహితము శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ వచనమును చూద్దాము, "యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయ పూర్వకముగా నిజము పలుకువాడే'' అన్న వచనము ప్రకారము యోబు కూడ తన జీవితములో అనేకమైన కష్టాలను మరియు శ్రమలను ఎదుర్కొని యున్నాడు. మొట్టమొదటగా, అతడు తన పదిమంది బిడ్డలను పోగొట్టుకున్నారు. ఇంకను యోబు 30:16లో చూచినట్లయితే, " నా ఆత్మ నాలో కరిగిపోయి యున్నది ఆపద్దినములు నన్ను పట్టుకొనియున్నవి'' అని యోబు చెబుతున్నాడు. ఆ శ్రమలన్నిటిలో కూడ యోబు ఏమని చెబుతున్నాడు? చూడండి, యోబు 13:15లో చూచినట్లయితే, "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును'' అన్న వచనము ప్రకారము మనము కూడ యోబు వలె నిర్దోష ప్రవర్తనను కలిగియుండాలి. ఇంకను యోబు 23:10వ వచనములో యోబు ఈలాగున అంటున్నాడు, "నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును'' అన్న వచనము ప్రకారము యోబు శోధింపబడినను కూడతన యొక్క యథార్థతను విడిచిపెట్టలేదు. కనుకనే, తన యథార్థతకు ప్రతిఫలమును పొందుకున్నాడు.


నా ప్రియ స్నేహితులారా, యోబు తన శ్రమలన్నిటిలో కూడ దేవుని వైపు చూశాడు. అన్నివేళల అతడు దేవుని గట్టిగా పట్టుకొని యున్నాడు. అందుకే యోబు 42:2 వ వచనములో అతడు ఒక చక్కటి మాటను పలుకుచున్నాడు. ఆ వచనమేమనగా, "అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని '' అని చెప్పినట్లుగానే, అవును నా ప్రియ స్నేహితులారా, యోబు వలె మనము అన్యోన్యసహవాసము కలిగి ఉండాలి. అప్పుడు ఏమి జరుగుతుందనగా? దేవుని వాగ్దానము చొప్పున మన స్వాస్థ్యము సదాకాలము నిలుస్తుంది. అటువంటి ఆశీర్వాదమును పొందుకొనుటకు మనము ప్రభువు వైపు చూద్దామా? ఆలాగుననే మనము కూడ దేవుని యెదుడ యథార్థంగాను, నిర్దోషంగా జీవించినట్లయితే, నిశ్చయముగా మనము కోల్పోయిన దానిని రెండంతలుగా తిరిగి పొందుకుంటాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.


ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా యెడల నీకున్న ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, యోబు వలె మేము నీతో అన్యోన్య సహవాసము కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ యెదుట యథార్థమైన నడవడికను కలిగి జీవించుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, మేము ఎదుర్కొంటున్న శ్రమలను, అవమానముల మధ్య కూడ మేము యోబు వలె నీ యందు పరిపూర్ణమైన విశ్వాసముతోను, నిరీక్షణ కలిగి జీవించునట్లుగా మాకు అటువంటి యథార్ధమైన హృదయమును దయచేయుము. దేవా, ఆపద్దినములు మమ్మును పట్టుకొనియున్నప్పుడు, నీ గొప్ప వాత్సల్యముతో మమ్మును విడిచిపించుము. యేసయ్యా, నీవు మాపట్ల ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు మేము తెలుసుకొనునట్లుగా మా జీవితాలను నీలో స్థిరపరచుము. ప్రభువా, మా స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉండునట్లుగా మా పట్ల నీవు కనికరమును చూపుము. తద్వారా దేవా, యోబు వలె మేము కోల్పోయినదాని నంతటిని తిరిగి రెండంతలుగా పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.