నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేడు మనము ఒక అద్భుతమైన దేవుని వాగ్దానమును ధ్యానించబోవుచున్నాము. ఆ వాగ్దానము బైబిల్ నుండి 1 యోహాను 4:4వ వచనము తీసుకొనబడినది. ఆ వచనం, "చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించి యున్నారు'' అని వ్రాయబడిన ప్రకారం మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. కనుకనే మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియులారా, ఒకవేళ ఇప్పుడు మీరు కష్టములో ఉండవచ్చును, అయినను మీరు ఈ లోకము వైపు మరియు ఈ లోక స్నేహితుల వైపు మరియు మీ తల్లిదండ్రుల వైపు చూడకండి, దేవుని వైపు మాత్రమే చూడండి. ఎప్పుడు చెప్పే విధంగా, మీరు మోకరించి దేవుని వైపు మాత్రమే చూడండి, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకంటే, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఆయన పేరు అద్భుతమైన దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనము కలిగియున్నాము. నా ప్రియులారా, మన దేవుడు మహాత్య్మము గలవాడని కీర్తనలు 96:4వ వచనములో మనము చూడగలము, "యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు'' ప్రకారము, ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు. ఇంకను కీర్తనలు 104:1 మరియు కీర్తనలు 147:5 వ వచనములలో కూడా అదే వ్రాయబడియున్నది, "నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా, నా దేవా నీవు అధిక ఘనత వహించినవాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు మరియు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు'' ప్రకారం మన దేవుడు గొప్ప ప్రభావము గలవాడు. కనుకనే, ఆయన వైపు మాత్రమే చూడాలి.

నా ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ, అతడు ఒక దైవజనుడు. అయినను, అతడు ఎల్లప్పుడు దేవుని వైపు మాత్రమే చూశాడు. అంతమాత్రమే కాదు, "నీవే నా నిరీక్షణ మరియు నీవే నా ఆనందం. నీవే నా బలము, నీవే నా సమస్తము'' అని ఎల్లప్పుడు ప్రభువుతో చెప్పాడు మరియు ఆయనను స్తుతించి, ఘనపరిచాడు. హల్లెలూయా!! నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా అదేవిధంగా చెప్పండి, ' దేవుడే, నా నిరీక్షణాస్పదమై యున్నాడు. ఎల్లప్పుడు, నేను ఆయన వైపు మాత్రమే చూస్తాను' అని మీరు ఆలాగున చెప్పినప్పుడు, మీ జీవితములో కూడా ఆయన గొప్ప దేవుడుగా ఉంటాడు. ఇంకను కీర్తనలు 111:2,3 వచనాలలో చూచినట్లయితే, "యెహోవా క్రియలు గొప్పవి వాటి యందు ఇష్టముగల వారందరు వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును'' ప్రకారం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దావీదు దేవుని నమ్మాడు. తన యొక్క పూర్తి నమ్మకాన్ని దేవుని మీద ఉంచాడు. కాబట్టి, దావీదు వాటన్నిటిని జయించగలిగాడు. అతడు ఒక జయజీవితమును జీవించగలిగాడు.

అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మీరు కష్టములో ఉన్నారా? అనేక విషయాలలో అవసరతలలో ఉన్నారా? అయితే, మనుష్యుల వైపు చూడకండి. ఏ స్త్రీ సహాయము వైపు చూడకండి. మరి ముఖ్యముగా మనుష్యుల సహాయము కొరకు ఎదురు చూడకండి. దేవుని వైపు మాత్రమే చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడండి, ఇప్పుడే మోకరించి, దేవునికి మొఱ్ఱపెట్టండి. ఇంకను మీ అవసరతలన్నియు ఆయనకు తెలియజేయండి. ఎందుకంటే, మన మొఱ్ఱలను ఆలకించే దేవుడు ఆయనే కనుక, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన ఇప్పుడే మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దానిని మీరు నమ్ముచున్నారా? ఆలాగైతే, నేడే గొప్ప దేవుని యొద్ద నుండి గొప్ప దీవెనలు మీరు పొందుకొనబోవుచున్నారు. ఆలాగుననే, మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు. ఇప్పుడే ప్రార్థించి, ఇంతటి గొప్ప దేవుని నుండి గొప్ప కార్యాలను పొందుకుందామా? దేవుని సన్నిధి నేడు మిమ్మును నింపుతుంది. ప్రభువు మీ సమస్యల నుండి నేడు మిమ్మును విడిపిస్తాడు. కారణము, ఆయన గొప్ప దేవుడు, ఆయనకు మీ సమస్యలను చెప్పండి, దావీదు వలె ఆయనను మీరు నమ్మండి. దేవుడు నేడు మీ జీవితములో గొప్ప కార్యాలను చేయబోవుచున్నాడు. ఈ రోజు ఆయన గొప్ప ఆశీర్వాదాలను పొందుకొనండి. ఎందుకంటే, ఆయన గొప్పతనం ఎన్నటికిని మారదు. హల్లెలూయా!! ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలైన మా మొఱ్ఱలను ఆలకించుము. ప్రభువా, నీవంటివారు ఇంకను ఎవరు లేరు, నీవే మా గొప్ప దేవుడవు, కాబట్టి, నేడు గొప్ప కార్యాలు మా జీవితములో జరిగించుము. దేవా, నేడు మా అవసరతలన్నిటిని తీర్చుము. నేడు మా సమస్యలన్నిటిని మా నుండి తొలగించుము. ప్రభువా, మమ్మును నీ ఆనందముతో నింపబడునట్లు చేయుము. ప్రియమైన ప్రభువా, మేము నీ దగ్గరకు వచ్చుచున్నాము, మా గొప్ప మరియు శక్తివంతమైన రక్షకుడా, అందరికంటే గొప్పవాడా, మా ఏకైక నిరీక్షణ మరియు బలం నీవే. ఆపత్కాలములో, మా సర్వశక్తిమంతుడైన దేవా, మేము నీ వైపు మాత్రమే చూస్తున్నాము. ఎందుకంటే నువ్వు మాత్రమే మాకు ఆశ్రయం, మా ఆనందం మరియు మా సమాధానం. ప్రభువా, నీవు మా జీవితంలో అద్భుతాలు చేసి, నీ అద్భుతాలను మా పట్ల కనుపరచుము. దేవా, నీ యొక్క శాశ్వతమైన శక్తిని నమ్ముచూ మా అవసరాలన్నింటిని నీ ముందు ఉంచుచున్నాము. ప్రభువా, నీవు సకల దీవెనలకు ఆధారభూతుడవు, మా పట్ల అద్భుతం చేసే దేవుడా, మేము నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ మహిమ మా మీద ప్రకాశింపజేయుము. ప్రభువా, మా హృదయాంతరంగములో నుండి వచ్చే మొఱ్ఱలను నీవు ఆలకించి, మా పట్ల గొప్ప కార్యాలను జరిగించుము. దేవా, మేము నీ గొప్పతనాన్ని, శక్తిని నమ్మునట్లుగా మా జీవితాలను మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.