నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 10:35 వ వచనము ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించి, పరిమళ సువాసనగా మిమ్మును అంగీకరించును గాక. ఆ వచనము, "ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును'' అనే మాట ఇక్కడ తెలియజేయబడుతుంది.

నా ప్రియులారా, యెహోవా యందలి భయము దేవుని యెదుట పరిమళ సువాసన వంటిదిగా ఉంటున్నది. అపొస్తలుల కార్యములు 10:2వ వచనములో కొర్నేలీని చూచినట్లయితే, అతడు దేవునికి భయపడుచూ, బహు దానధర్మములు చేయుచున్నాడనియు మరియు అతడు భక్తిపరుడనియు, దేవునికి భయపడువాడనియు కూడ స్పష్టముగా తెలియజేయబడియున్నది. ఇంకను అతడు బీదలకు బహు ధర్మము చేయువాడును మరియు ఎల్లప్పుడు ప్రార్థనలు చేయువాడై యున్నాడు. అతడు దేవుని యందు విశ్వాసముంచుట అనేది ఒక అరుదైన సంఘటన యేసునందు విశ్వాసముంచుటకు కొర్నేలీ యూదుడేమి కాదు. అతడు రోమా శతాధిపతి, అతడు దేవుని యందు భయభక్తులు గలవానిగా, నీతిని సాధకము చేసియున్నందున దేవుని ద్వారా అంగీకరించబడ్డాడు. దేవుడు పక్షపాతి కాడు, మీరు ఎవరై ఉన్నప్పటికిని, మీరు దేవుని యందు విశ్వాసముంచి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవచ్చును. మీరు ఎవరై ఉన్నప్పటికిని సరే, యేసునందు విశ్వాసముంచినప్పుడు, దేవుడు మీ జీవితాలలో అద్భుతాలను జరిగిస్తాడు.

బైబిల్‌లో చూచినట్లయితే, రోమా 4:3వ వచనములో చూచినట్లయితే, "లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను'' అని వ్రాయబడియున్నది. మనము కేవలం దేవుని యందు విశ్వాసముంచినప్పుడు, 'మీరు నీతిగల వ్యక్తి ' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. బైబిల్‌లో చూచినట్లయితే, యెషయా 64:6వ వచనములో, 'మన యొక్క స్వనీతి చర్యలు మురికి గుడ్డలు ' అని దేవుని యొక్క వాక్యములో చెప్పబడియున్నది. "మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి మా నీతి క్రియలన్నియు మురికి గుడ్డవలె నాయెను మేమందర ము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను'' అవును, దేవునికి పరిమళ సువాసనగా ఉండు నిమిత్తమై క్రీస్తు చేసిన త్యాగము ద్వారా, ఆయన తన యొక్క నీతి క్రియలు మన మురికి గుడ్డల వంటివి కాకుండా దానికి బదులుగా మార్పు చేసియున్నారు. యేసు యొక్క నీతిని బట్టి, మనము దేవుని ద్వారా అంగీకారయోగ్యమైనవారుగా ఉన్నారు. బైబిల్‌లో 2 కొరింథీయులకు 2:14-15వ వచనములలో ఈలాగున చెప్పబడియున్నది, "మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము'' అని వ్రాయబడియున్నది. అవును, 2 కొరింథీయులకు 2:15వ వచనములో ఆయన మనలను పరిమళ వాసనగా పిలుచుచున్నాడు. సర్వశక్తిగల దేవుని ద్వారా, అంగీకరించబడుట అనేది ఎంత మధురమైన కార్యము కదా! మనము కేవలము దేవుని యందు నమ్మికయుంచునప్పుడు మాత్రమే ఈలాగున జరుగుతుంది.

మేము నిర్వహించుచున్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవ సమయములలో ప్రజలు కొద్దిపాటి విశ్వాసముతోనే అద్భుత కార్యములను పొందుకొనుచున్నారు. లక్షలాది మంది ప్రజలు అక్కడికి కూడి వచ్చి ఉండవచ్చును. కానీ, అంత గొప్ప జనసమూహములో కూడ ప్రజలు కేవలము దేవుని యందు విశ్వాసముంచి, ఆలాగుననే దేవుని అద్భుత కార్యములను, స్వతంత్రించుకొనుచున్నారు. దేవుడు వారి కొరకు అన్నట్టుగా వారు భావిస్తున్నారు. ఇట్టి విశ్వాసము, ఇట్టి నమ్మిక వారికి నీతిగా ఎంచబడియున్నది. కనుకనే దేవుడు వారిని అంగీకరించి అద్భుతకార్యములను జరిగించియున్నాడు. వారు చక్రాల కుర్చీలో నుండి పైకి లేస్తున్నారు. వారి సంకెళ్లు బ్రద్ధలైపోతున్నాయి, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్నారు. ఆ మైదానములోనే దేవుని యొక్క పరిమళ సువాసనను ఆఘ్రాణించగలుగుచున్నాము. ప్రియ స్నేహితులారా, మీరు కూడా దేవుని చేత అంగీకరించబడియున్నారు. మీరు దేవుని యందు విశ్వాసముంచిన రీతిగా నాకు తెలుసు మీకు కూడ ఒక అద్భుత కార్యము జరగబోవుచున్నది. కాబట్టి, ధైర్యముగా ఉండండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ నమ్మకమైన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, 'విశ్వాసం లేకుండా నీకు ఇష్టుడై ఉండుట అసాధ్యమని' నీ వాక్యం చెప్పినట్లుగానే, కాబట్టి నిన్ను పూర్తిగా విశ్వసించాలని ఎంచుకుని ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మా జీవితం పరిమళ సుగంధం వలె నీకు ఆమోదయోగ్యమైనదిగా మారడానికి దేవుని పట్ల భయం మాలో దినదినము బలపడునట్లు చేయుము. ప్రభువా, సమర్పణతోను మరియు నీతివంతమైన జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుము మరియు ఎల్లప్పుడు నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, సిలువపై నీవు చివరి వరకు చేసిన త్యాగం ద్వారా మురికి గుడ్డలవలె ఉన్న మా నీతిని మార్చినందుకు మరియు సర్వశక్తిమంతుడైన దేవుని యెదుట మమ్మును నీతిమంతులనుగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా విశ్వాసాన్ని, సమాధానమును మరియు ఆనందాన్ని పునరుద్ధరిస్తావనియు మరియు మా జీవితంలో అద్భుతాలు జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్లినా నీ సువాసనను మోసుకెళ్ళే పరిమళ ధూపంలా మమ్మును స్థిరపరచుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.