నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:16వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును'' అని వ్రాయబడియున్నది. పరిశుద్ధ గ్రంథము ఏమని తెలియజేయుచున్నదనగా, "ఆయన వేరొక ఆదరణకర్త.'' అవును, ఆయన ప్రత్యేకమైన దేవుడు కాదు, తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మయైన దేవుడు. ఈ ముగ్గురు కూడా ఒక్కరుగా ఉన్నారు.

ఈ ఆదరణ కర్త ఎవరు? ఈయన పరిశుద్ధాత్మ దేవుడై యున్నాడు. బైబిల్ లో 1 కొరింథీయులకు 6:19వ వచనము ఈలాగున చెబుతుంది, " మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు'' అన్న వచనము ప్రకారము, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక 'వరముగా' అనుగ్రహించబడియున్నాడు. మరియు మీరు మీ సొత్తు కాదు, మీ దేహము దేవుడు నివాసము చేయుచున్న దేవాలయమై యున్నది. ఇది ఆలకించుటకు ఎంత ఆదరణకరంగా ఉంటుందో కదా. దేవుడు మనలో నివాసము చేయుచున్నాడు. ఆయన మొదటిగా మనకు అనుగ్రహించు ఆదరణ ఇదియే.

నా ప్రియులారా, ఆయన మనలో నివాసము చేయుచుండగా, మనకు ఏమి జరిగిస్తాడు? మనలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా ఆ రీతిగా తన ప్రేమను కుమ్మరించువాడై యున్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి యున్నది'' (రోమీయులకు 5:5)లో చెప్పబడినట్లుగానే, అదియు కూడా అత్యంత సమృద్ధియైన ప్రేమయై ఉన్నది. అవును, స్నేహితులారా, ఆయన తనకున్న ప్రేమతో మనలలో ఆసీనుడై మనలను నిమ్మళపరచు దేవుడై యున్నాడు. ఆయన, తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ఆసీనుడై ఆయన ప్రేమతో నిమ్మళంగా ఉంటాడు, జెఫన్యా 3:17లో చెప్పబడినట్లుగానే, "నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును'' ప్రకారం దేవుడు మీ యందు శాంతము వహించి, మీ యందలి సంతోషము చేత గానము చేయు దేవుడై యున్నాడు. కనుకనే, దిగులుపడకండి.

ఒక తల్లి తన చిన్న బిడ్డ కొరకు ఏమి చేస్తుంది? తన బిడ్డను ఉయ్యాలలో ఉంచి, ప్రేమతో తన కోసము జోల పాటలు పాడుతుంది. ఆ రీతిగా దేవుడు మన పట్ల కలిగియున్న గొప్ప ప్రేమను బట్టి, ఆయన మనలను గూర్చి, ఆనందించుచు, గానము చేయుచున్నాడు. అవును దేవుడు ఒక తల్లివలె మనలను ఆరీతిగా ఆదరించు దేవుడై యున్నాడు. యెషయా 66:13వ వచనము ప్రకారం, " ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు'' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరియు బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:3వ వచనములో చూచినట్లయితే, "కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక'' అని వ్రాయబడియున్నది. మరియు 2 కొరింథీయులకు 1:4వ వచనములో, "దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు'' అని వ్రాయబడినట్లుగానే, దేవుడు మీ శ్రమ అంతటిలోను మిమ్మును ఒక తల్లి వలె ఆదరిస్తాడు.

నా ప్రియులారా, ఈ రోజును కూడా, దేవుని ఆదరణ మీ మీదికి దిగివచ్చును గాక. ఆయన మీ పట్ల కలిగియున్న ప్రేమను బట్టి ఆలాగున జరిగించును. ఆ యొక్క శ్రమల మధ్యలో కూడా ఏలాగున మనము ప్రార్థన చేయాలో మనకు తెలియకుండా ఉన్నప్పుడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీ కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపనము చేస్తాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు'' (రోమీయులకు 8:26) ప్రకారం ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడని వ్రాయబడియున్నది. మీ యెడల ఆయన కలిగియున్న ఎంతో గొప్ప ప్రేమను బట్టి, మీ నిమిత్తము ఆయన ప్రార్థిస్తాడు. ఇంకను మీ యొక్క బలహీనతలలో మీరు ప్రార్థించడానికి ఆయన మీకు సహాయము చేస్తాడు. ఇటువంటి ఆదరణను మనము దేవునిలో కలిగియున్నాము. అనేక పర్యాయములు నేను దీనిని అనుభూతి చెందియున్నాను. నా హృదయములో ఎంతో విచారముతో నిండియుండి నేను దేవుని యొద్దకు వెళతాను. కానీ, ప్రభువు నా హృదయమును పరిశుద్ధాత్మ చేత నన్ను నింపిన తర్వాత, పరిశుద్ధాత్మ యందలి గొప్ప ఆనందముతో నేను అనుభూతి చెందుతాను. నా యొక్క ఆత్మలో ఎంతో గొప్ప విశ్రాంతి, నెమ్మది అనిపిస్తుంది. దేవుడు ఆదరణ కర్తగా నాలో ఉండియున్నాడను అనుభూతి నాకు కలుగుతుంది. ఆలాగుననే, మనము దేవునికి ప్రార్థించినప్పుడు, అట్టి ఆదరణనను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, నేడు మీరు మీ జీవితములో సమస్యలను కలిగియున్నట్లయితే, ఆదరణ కొరకు ఒక పురుషుని యొద్దకు లేక ఒక స్త్రీ యొద్దకు అన్నట్టుగా వెళ్లవద్దు. దేవుని చెంతకు వెళ్లండి. ఆయన మీ యొక్క బలహీనతలలో మీకు సహాయము చేస్తాడు. అయితే, ఒక పర్యాయము నేనెంతో ఒత్తిడికి గురియైనప్పుడు, 'ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత ఏలాగైన నన్ను నింపుము,' అని ప్రార్థించాను. అప్పుడు దేవుడు, 'నా కుమారీ, నీవు నిద్రపొమ్ము, ఉదయ కాలముననే లేచి, నీ భర్తతో కూడా కలిసి ప్రార్థించుము, నేను నిన్ను నా ఆత్మ చేత నింపెదనని ' తెలియజేశాడు. అక్షరాల ప్రభువు సెలవిచ్చినట్లుగానే, " నన్ను, నా యొక్క భర్తగారిని ఎంతగానో ఆయన మమ్మును అభిషేకించి, విభిన్నమైన నూతన భాషలను ఆయన మాకు అనుగ్రహించాడు.'' నా యొక్క ప్రార్థన సమయములో నేను యేసును ముఖాముఖిగా చూచియున్నాను. ఎంతో గొప్ప ప్రేమతో, పరిపూర్ణముగా నింపబడియుండుట నేను ఆయనలో చూచాను. ఆయన ఒక మానవుడు అని అన్నట్లుగా నాకు అనిపించలేదు. నేను ఆయన వైపు చూచినప్పుడు, ఆయన కన్నులలో తల్లి యొక్క ప్రేమ నాకు కనబడినది. నేను యేసును చూచిన తర్వాత, నా యొక్క ఒత్తిడి అంతయు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయినది. అవును, నా ప్రియులారా, మన యొక్క శ్రమలు మరియు సమస్యలన్నిటిలోను ఆయన వేరొక ఆదరణ కర్తను మన యొద్దకు పంపించి, మనలను ఒక తల్లివలె ఆదరిస్తాడు. ఈ రోజును కూడా దేవుడు తన యొక్క ప్రేమ చేత, తన ఆత్మ చేత మీ హృదయములను ఆ రీతిగా నింపును గాక. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆదరించి, ఆశీర్వదించును గాక. ఆదరణ అనుగ్రహించు దేవుడు మిమ్మును ఆదరించును గాక. మీరు ఇతరులను ఆదరించునట్లుగా, మీకు సామర్థ్యమును అనుగ్రహించును. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆదరించి, దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మా హృదయాలను నింపుము. ప్రభువా, మా యొక్క శ్రమలలో మాకు సహాయము చేయు దేవుడవు నీవే గనుకనే, నీవు మాకు సహాయము చేయుటకు మాలోనికి దిగి రమ్ము. దేవా, ఈ రోజునే మా యొక్క ఆవేదన, హృదయములో ఉన్న బాధలు మమ్మును విడిచిపెట్టి వెళ్లిపోవునట్లుగా చేయుము. దేవా, మేము ఆదరణ కొరకు ఇతరుల యొద్దకు వెళ్లకుండా, ఆదరణ కర్తయైన నీ యొద్దకు వచ్చునట్లుగా కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఆదరించే నీ సన్నిధి చేత, నీవు మమ్మును ఆదరించుము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ ప్రేమ మా హృదయంలోనికి ప్రవహించాలని మేము కోరుచున్నాము. ఆపద సమయాలలో నీవు మాకు సహాయకుడివిగాను, ప్రతి దుఃఖంలో మాకు ఆదరణకర్తవుగా ఉండి మమ్మును ఆదరించుము. ప్రభువా, మేము మా బాధను మరియు వేదనను నీకు అప్పగించుచున్నాము. దేవా, మా వ్యాధులను స్వస్థపరచి, నీ ఓదార్పునిచ్చే సన్నిధి మా ఆత్మను నింపునట్లు చేయుము. ప్రభువా, మాకు మరే ఇతర సౌకర్యాలు అవసరం లేదు. ఎందుకంటే నీవు మాత్రమే మాకు చాలు. మా బాధలను ఆనందంగా మార్చుము మరియు మా దుఃఖమును సంతోషముగా మార్చుము. ప్రభువా, నీవు మమ్మును ఓదార్చినప్పుడు, ఇతరులను ఓదార్చడానికి మాకు సహాయం చేయుము. నీవు మాలో కురిపించినట్లుగా వారి హృదయాలలో నీ యొక్క ప్రేమను కుమ్మరించుము. దేవా, మా భారాలను తొలగించి, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మును తాకుము. మరియు మేము ఎల్లప్పుడు నీవు మాతో ఉన్నావనియు ఇతరులు గుర్తెరుగునట్లు మమ్మును నీ ఆత్మ శక్తిచేత నింపి, సమాధానము, విశ్రాంతి కలుగునట్లు చేయుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.